ఆంధ్రప్రదేశ్ లో అగ్రిగోల్డ్ వ్యవహారం మామూలుది కాదు. రాస్తే పుస్తకం.. తీస్తే సినిమా అవుతుంది. లక్షలాది మంది నుంచి డిపాజిట్లు సేకరించి బోర్డు తిప్పేయడంతో అందరూ మునిగిపోయారు. బాధితులు కోర్టును ఆశ్రయించడం.. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో కొన్నింటిని ఈడీ అటాచ్ చేయడం జరిగాయి. ఆ సంస్థకు సంబంధించిన ఆస్తులను అమ్మైనా బాధితులకు డిపాజిట్లు తిరిగి చెల్లిస్తామని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే దశలవారీగా పంపకాలు చేపట్టారు.
గత ఏడాది రూ.10 వేల లోపు డిపాజిట్ చేసిన వారికి చెల్లింపులు చేశారు. దాదాపు 260 కోట్ల రూపాయలకు పైగా బాధితులకు చెల్లించింది సర్కారు. ఇప్పుడు రెండో దఫా పంపకాలకు సిద్ధమైంది. ఈ నెల 24వ తేదీ నుంచే చెల్లింపులు చేయనుంది. ఈ సారి 10 వేల నుంచి 20 వేల లోపు వారికి డబ్బులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు బాధితులుగా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఇందుకోసం ఈ నెల 12వ తేదీ వరకు గడువు విధించింది. అయితే.. కొన్ని షరతులు విధించింది ప్రభుత్వం. ఒకరు ఎన్నిసార్లు డిపాజిట్ చేసినా.. ఒక డిపాజిట్ డబ్బులు మాత్రమే చెల్లిస్తారు. అదేవిధంగా.. గతంలో క్లెయిమ్ చేసుకున్నవారికి మళ్లీ ఇవ్వరు.
వైసీపీ అధికారంలోకి వస్తే.. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని జగన్ పాదయాత్ర సందర్భంగా చెప్పారు. బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని కూడా చెప్పారు. చెప్పినట్టుగానే మొదటి బడ్జెట్లో రూ.1150 కోట్లు కేటాయించారు. కానీ.. బాధితులకు అందించలేదు. టీడీపీ సర్కారు అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి రూ.260 కోట్లను కోర్టులో జమచేసింది. వాటిని తొలివిడతలో భాగంగా పదివేల రూపాయల్లోపు లబ్ధిదారులకు అందించారు. ఇప్పుడు 20 వేల లోపు వారికి అందజేస్తున్నారు.
అయితే.. అగ్రిగోల్డ్ సంస్థకు ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తే.. డిపాజిటర్లందరికీ న్యాయం చేయొచ్చనే అభిప్రాయం ఉంది. ఈ సంస్థకు చెందిన దాదాపు 4,109 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఇవన్నీ ఏపీ, తెలంగాణ, ఒడిషా, కర్నాటక రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటన్నింటినీ అమ్మేసి, బాధితులకు పంచేస్తే.. ఏ ఒక్కరూ నష్టపోయే అవకాశం లేదని అంటున్నారు. ప్రస్తుతానికి ఈ అంశం కోర్టు పరిధిలో ఉంది. కాబట్టి.. కోర్టు తుది తీర్పు ఏం చెబుతుంది? బాధితులకు పూర్తిస్థాయి న్యాయం ఎప్పుడు జరుగుతుంది? అన్నది చూడాలి.