
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోయే ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ వేడి మొదలైంది. ఆ వేడి కేంద్రానికి తగులుతోంది. ఎందుకంటే యూపీలోనే 70కిపైగా ఎంపీ సీట్లు ఉన్నాయి. అక్కడి ఎంపీ సీట్లతోనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. యూపీలో ఓడిపోతే కేంద్రంలో బీజేపీ అధికారం కోల్పోయినట్టే. అందుకే యూపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ సర్జికల్ స్ట్రైక్ చేయబోతోంది.
యూపీలో ప్రస్తుతం అధికార బీజేపీని ఓడించడానికి అక్కడి ప్రతిపక్షాలు సమాజ్ వాదీ-బహుజన సమాజ్ వాదీ ఒక్కటయ్యాయి.ఈ కూటిమిని, నేతలను లాగడానికి బీజేపీ ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో మరో ప్రతిపక్షం కాంగ్రెస్ పై బీజేపీ పడింది. కాంగ్రెస్ నుంచి జితిన్ ప్రసాద చేరికతో బీజేపీ బలం పుంజుకుంది. అంతేకాదు.. త్వరలో మంత్రివర్గ విస్తరణ వంటి పరిణామాలతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి.
ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఢిల్లీ పర్యటన మరింత ఉత్కంఠను రేపుతోంది. పర్యటనలో భాగంగా ఆయన నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. చాలా సేపు సమావేశమయ్యారు. యూపీ మంత్రివర్గంలో మార్పులపై ప్రధానితో సీఎం చర్చించనున్నట్లు సమాచారం. రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం దిల్లీకి వచ్చిన యోగి.. నిన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు. యూపీ తాజా రాజకీయ పరిస్థితులపై వారు చర్చించినట్లు తెలుస్తోంది.
ఉత్తరప్రదేశ్‌లో కొవిడ్ నియంత్రణ విషయంలో యోగి ఆదిత్యనాథ్ సర్కారుపై గత కొంతకాలంగా విమర్శలు వస్తుండటంతో కేబినెట్‌లో మార్పులు చేర్పులకు బీజేపీ అధిష్ఠానం సిద్ధమైంది. మరోవైపు ఎన్నికల నేపథ్యంలో మంత్రివర్గంలో కొత్తవారికి అవకాశం కల్పించాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పలువురి పేర్లు వినిపిస్తున్నాయి.
మోదీ అత్యంత నమ్మకస్తుల్లో ఒకరైన మాజీ ఐఏఎస్ అధికారి ఏకే శర్మకు యూపీ ప్రభుత్వం కీలక పదవి ఇవ్వనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇక ఇటీవలే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన యువనేత జితిన్ ప్రసాదకు కూడా మంత్రిపదవి దక్కే అవకాశాలు కన్పిస్తున్నాయి.
కాగా.. సీఎంను కూడా మార్చే అవకాశాలున్నట్లు గత కొన్ని రోజులుగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో యోగి దిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రాష్ట్ర నాయకత్వంలో మార్పులు ఉండవని ఇటీవల బీజేపీ నేత ఒకరు మీడియాకు తెలిపారు.
యూపీలో గెలవకపోతే వచ్చేసారి కేంద్రంలో అధికారంలోకి రావడం బీజేపీకి కష్టం.. అందుకే తెలివిగా యూపీపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇటీవల ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఆశించిన బెంగాల్ పీఠం దక్కకపోవటమే కాదు.. దారుణ ఓటమి పాలైంది.. బెంగాల్ లో మమతను ఓడిద్దామని మోడీషాలు ఎంత అనుకున్నా అది జరగకపోవటమే కాదు..దేశంలో సెకండ్ వేవ్ లో ఏం చేయలేదన్న అపవాదును మూటగట్టుకున్నారు. మరోవైపు కొద్ది నెలల్లో కీలకమైన యూపీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకు రావటం బీజేపీ వ్యూహకర్తలకు ఒక పట్టాన మింగుడుపడటం లేదు.
పార్టీ అంతర్గత రిపోర్టులతో పాటు..పార్టీకి దిశానిర్దేశం చేసే సంఘ్ పరివార్ సైతం యూపీలో యోగి సర్కారు పరిస్థితి ఈసారి కష్టమేనన్న రిపోర్టుతో మోడీ షాలు అలెర్టు అయినట్లు తెలుస్తోంది.. యూపీలో పార్టీని మరింత బలోపేతం చేసుకోవటం.. ఎన్నికల వేళ యోగి సర్కారు మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే కసరత్తు పెద్ద ఎత్తున మొదలైంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ కు చెందిన జితిన్ ప్రసాద్ ను పార్టీలోకి చేర్చుకున్నారని తెలుస్తోంది.
ఢిల్లీకి రావాలంటూ యూపీ ముఖ్యమంత్రి యోగికి కబురు పంపటం రాజకీయ చర్చకు దారి తీసింది. ఇదంతా చూస్తుంటే.. యూపీ రాజకీయ పరిణామాలపై మోడీషాలు ఏదో ప్లానింగ్ చేస్తున్నారని చెప్పక తప్పదు. దీనికి కారణం లేకపోలేదు. గురువారం తన ఢిల్లీ పర్యటనకు కొన్ని గంటల ముందు.. లక్నోలో రాష్ట్ర బీజేపీ అధ్యక్ష.. ప్రధాన కార్యదర్శులతో భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరయ్యేందుకు రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సాల్ ను హెలికాఫ్టర్ లో హుటాహుటిన లక్నోకు చేరుకోవటం బీజేపీ యూపీలో ఏదో స్కెచ్ గీస్తుందన్న ప్రచారానికి కారణమైంది. తాజాగా పార్టీలో చేరిన జితిన్ ప్రసాద్ కు పెద్దపీట వేయటంతో పాటు..ఆయనతో కలిసి పని చేసేందుకు వీలుగా సీఎం యోగికి మోడీషాలు మార్గదర్శనం చేయనున్నట్లు చెబుతున్నారు. కొవిడ్ ను తగ్గించటంలో యోగి సర్కారు భారీగా ఫెయిల్ అయ్యిందన్న వాదన జోరుగా వినిపిస్తున్న వేళ.. మోడీషాలు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తోంది.