Vice President Election 2022: బీజేపీకి వైసీపీ అవసరం దాటిపోయిందా? అందుకే పక్కన పెట్టే ప్రయత్నాలు చేస్తోందా? వైసీపీ ఓవరాక్షన్ భరించలేకే ఈ నిర్ణయానికి వచ్చిందా? అంటే ఢిల్లీ వర్గాలు అవుననే సమాధానం చెబుతున్నాయి. జరుగుతున్న పరిణామాలు సైతం అనుమానాలను నిజం చేస్తున్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ మద్దతుదారుగా ద్రౌపది ముర్ము బరిలో దిగారు. అయితే తటస్థంగా ఉన్న వైసీపీ ముందుగానే తన మద్దతు ప్రకటించింది. ముర్ము నామినేషన్ కు సైతం బీజేపీ ఆహ్వానం మేరకు పార్టీ ప్రతినిధిగా విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఎన్డీఏ పక్ష నేతలతో సమానంగా ఆయనకు గౌరవం లభించింది. బీజేపీ కీలక నేతల మధ్య కూర్చొని నామినేషన్ వేసిన నాడు విజయసాయి తెగ హడావుడి చేశారు. అటు తరువాత టీడీపీ సైతం ముర్ముకే మద్దతు ప్రకటించింది. అయితే తనకు మద్దతు తెలిపిన వారికి మర్యాదపూర్వకంగా కలవడానికి ఏపీకి వచ్చిన ముర్మును టీడీపీ నేతలను కలవకుండా వైసీపీ గట్టి ప్రయత్నాలే చేసింది. అయితే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా కలుగజేసుకోవడంతో వైసీపీ ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ముర్ముతో పాటు బీజేపీ సీనియర్లు చంద్రబాబుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలను కలిశారు. అయితే అంతకు ముందు భీమవరంలో అల్లూరి విగ్రహావిష్కరణలో సైతం వైసీపీ ఇదే హడావుడి చేసింది. ప్రధాన విపక్షం టీడీపీకి ప్రాధాన్యత లేకుండా చేసింది. అటు లోకల్ ఎంపీ రఘురామరాజుకు సైతం పక్కన పెట్టింది. అయితే ఈ మొత్తం పరిణామాలను చూసిప బీజేపీ అధిష్టానం మాత్రం రాష్ట్రపతి ఎన్నికల వరకూ వైసీపీకి కాస్తా ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడు పోలింగ్ జరిగిపోవడంతో వైసీపీని దూరం పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఇప్పుడదే హాట్ టాపిక్…
ఉప రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ ప్రక్రియకు వైసీపీకి ఆహ్వానం అందకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఎన్డీఏ అభ్యర్థిగా జగదీప్ దనఖడ్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. పశ్చిమబెంగాల్ గవర్నర్ అయిన జగదీప్ జాట్ తెగ నేత. రాజస్థాన్ లో ఎన్నికలను పరిగణలోకి తీసుకొని మోదీ, షా ద్వయం ఆయన్ను ఎంపిక చేసింది. కానీ బీజేపీ దేశంలో ఇతర పార్టీల మద్దతు ఇంకా కోరలేదు. కానీ ఉప రాష్ట్రపతి అభ్యర్థి జగదీప్ కు వైసీపీ స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించింది.
Also Read: Presidential Elections 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో భారీగా క్రాస్ ఓటింగ్.. యశ్వంత్ సిన్హాకు షాక్
అంతటితో ఆగకుండా వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి కావడం వల్లే తాము మద్దతిచ్చినట్టు సైతం సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంది. అయితే స్వచ్ఛందంగా మద్దతు తెలిపిన వైసీపీకి మాత్రం ఉప రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కు పిలుపు అందలేదు. ఢిల్లీలోని ఆ పార్టీ ఎంపీలను అడిగితే వారి నుంచి మౌనమే సమాధానం ఎదురవుతోంది. మొన్నటికి మొన్న రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ సమయంలో దక్కిన ప్రాధాన్యత ఇప్పుడు ఎందుకు తగ్గిందన్న వ్యధ మాత్రం వైసీపీ నాయకత్వాన్ని వెంటాడుతోంది. బీజేపీ కీలక అవసరం దాటిపోయింది కాబట్టి వైసీపీ పై కొరడా ఝుళిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ వ్యవహార శైలి తెలిసిన వారు అనుమానిస్తున్నారు.
కొరడా ఝుళిపించనున్న కేంద్రం…
అయితే ఇప్పటివరకూ జరిగింది ఒకటి.. ఇక నుంచి జరగబోయేది మరొకటి అని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇన్నాళ్లూ అవసరం ఉంది కనుక వైసీపీ విన్నపాలకు కేంద్రం తలూపింది. కానీ రోజురోజుకూ విన్నపాలు మరీ ఎక్కవైపోతుండడంతో బీజేపీ పెద్దల్లో అంతర్మథనం ప్రారంభమైంది. ఇన్నాళ్లూ వైసీపీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఒక్క విన్నపం చేయలేదట. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాలనే సీఎం జగన్ ఎక్కువగా ప్రస్తావించేవారట. అయితే విసిగివేశారిపోయిన కేంద్రం రాష్ట్రపతి ఎన్నికల వరకూ వేచిచూడాలని భావించిందట. అందుకే ఇన్నాళ్లూ గుంభనంగా వ్యవహరించింది. రాష్ట్ర ప్రభుత్వంలో అర్థిక క్రమశిక్ష లోపించడం, దివాళా వైపు ప్రయాణించడం వంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం ఆందోళనతో ఉంది. ఇలాగే వదిలేస్తే దేశ ఆర్థిక భద్రతపై పెను ప్రభావం చూపే అవకాశముందని భావిస్తోంది. దేశంలో 11 రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. అందులో ఏపీ ప్రథమ స్థానంలో ఉంది. ఎలాగైనా రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ముందుగా ప్రాధాన్యత తగ్గించాలని నిర్ణయించింది. అందుకే ఉప రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ ప్రక్రియకు ఆహ్వానం అందించలేదు. అయితే జరుగుతున్న పరిణామాలతో వైసీపీ కక్కలేని మింగలేని పరిస్థితుల్లో ఉంది. తప్పనిసరిగా ఎన్డీఏ మద్దతుదారుడైన ఉప రాష్ట్రపతి అభ్యర్థికే ఓటు వేయాల్సిన దుస్థితి.
Also Read:Presidential Polls 2022: రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ కీలకంగా మారిందా?