BJP Alliance With TDP: ఏపీ బీజేపీకి ఇది పరీక్ష కాలం. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం,జనసేనతో పొత్తు ఉంటుందా లేదా అని బిజెపి రాష్ట్ర నాయకులు ఆందోళన చెందుతున్నారు. బిజెపి అగ్రనేతలు ఎటువంటి స్పష్టతనివ్వకపోవడంతో ఎలా ముందుకెళ్లాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నారు.ఇటు పవన్, అటు జగన్ చర్యలు చూసి ఎలా అర్థం చేసుకోవాలో తెలియక.. సతమతమవుతున్నారు. కానీ మెజారిటీ బిజెపి నాయకులు మాత్రం పొత్తునే కోరుకుంటున్నారు.
రాజకీయంగా పవన్ తో స్నేహం కుదుర్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్ట్యా జగన్కు సహకారం అందిస్తున్నారన్న టాక్ నడుస్తోంది. అయితే ఇప్పుడు పవన్ టిడిపి తో బహిరంగంగానే జతకట్టారు. బిజెపి పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. మరోవైపు బిజెపికి తెలియకుండా పవన్ ఇలా చేస్తారా.. ఇంతటి సాహసం చేయగలరా అన్న ప్రశ్న ఒకటి ఉంది. తప్పకుండా పవన్ బిజెపి అగ్రనేతల పర్మిషన్ తీసుకునే టిడిపి తో బహిరంగ పొత్తు ప్రకటన చేసి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బిజెపి సైతం తమతో కలిసి వస్తుందని పవన్ ఆశాభావం వ్యక్తం చేశారు కూడా.
మరోవైపు చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్ తో పాటు కేంద్ర పెద్దలపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చంద్రబాబు లాంటి నాయకుడు అరెస్టు విషయంలో జగన్ తప్పనిసరిగా కేంద్ర పెద్దల అనుమతి తీసుకొని ఉంటారు. వారి అనుమతి లేకుండా ఈ సాహసానికి దిగే పరిస్థితి లేదు. అయితే అటు పవన్ కు అనుమతి ఇచ్చి.. ఇటు జగన్ కు ప్రోత్సహించి బిజెపి నేతలు ఉద్దేశం ఏమిటో మాత్రం అర్థం కావడం లేదు. వచ్చే ఎన్నికల్లో జనసేన అవసరం బిజెపికి ఉంది. అలాగే ఈనెల 18 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ మధ్యంతర సమావేశాల్లో వైసిపి అవసరం ఉంది. కీలక బిల్లులు ఆమోదానికి వైసీపీ అవసరం అనివార్యంగా మారింది.
అయితే బిజెపి మాత్రం వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నట్లు తెలుస్తోంది. అదే ఉభయ తారకమని భావిస్తున్నట్లుంది. ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం పరంగా గట్టెక్కడం ముఖ్యం. ఎన్నికలకు ఇంకా ఆరు నెలల వ్యవధి ఉంది. ఆ సమయంలో జనసేన తో పాటు టిడిపి తో పొత్తు పెట్టుకోవడం అనివార్యం. ఇదే బిజెపి వ్యూహాత్మక మౌనానికి కారణంగా తెలుస్తుంది. అయితే కేంద్రం సమీకరణల దృష్ట్యా ఆలోచిస్తున్న విధానం ఏపీ బీజేపీ నేతలకు సంకట స్థితిలో పడేస్తుంది. అయితే ఏపీలో మెజారిటీ బిజెపి నాయకులు మాత్రం పొత్తులనే కోరుకుంటున్నారు.