Mayor Vinod Agarwal : ఒంట్లో నుంచి నెత్తురు చుక్క తీయలేదు.. రక్తదానం చేశానని గప్పాలు.. మోడీ పుట్టినరోజు నాడు మేయర్ ఘనకార్యం..

రాజకీయాలలో రోజురోజుకు వ్యక్తి పూజలు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఈ వ్యవహారాలు ఇప్పుడు దేశం మొత్తం వ్యాపిస్తున్నాయి.

Written By: Anabothula Bhaskar, Updated On : September 22, 2024 11:38 am

Mayor Vinod Agarwal

Follow us on

Mayor Vinod Agarwal : మిగతా పార్టీలు ఎలా ఉన్నా.. భారతీయ జనతా పార్టీలో వ్యక్తి పూజ అనేది చాలా తక్కువ. అయితే 2014లో మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ వ్యవహారం ప్రారంభమైందనే ఆరోపణలు ఉన్నాయి. సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత వ్యక్తి పూజ తారస్థాయికి చేరుతోంది. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన పని లేకుండా పోయింది. అయితే ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా రక్తదానం నిర్వహించాలని మొరాదాబాద్ లోని భారత జనతా పార్టీ కార్యాలయంలో నిర్ణయించారు. అందుకు అనుగుణంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఆ రక్తదాన శిబిరంలో ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మొరాదాబాద్ మేయర్ వినోద్ అగర్వాల్ రక్తదానం చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయన ఒంట్లో నుంచి ఒక్క రక్తపు బొట్టు కూడా బయటకు తీయలేదు. రక్తదానం నిర్వహించకపోయినప్పటికీ.. చేసినట్టుగా కెమెరా ముందు నటించారు. రక్తదానం చేసినట్టుగా అందర్నీ నమ్మించారు.. ఆ సమయంలో ఆయన బీపీని పరిశీలించేందుకు ఓ డాక్టర్ సిద్ధమయ్యారు. అయితే తన ఒంట్లో నుంచి ఆ రక్తం తీయకూడదని ఆయన కోరారు. ఆ తర్వాత ఆయన చెప్పినట్టుగానే ఆ డాక్టర్ అలా చేశారు. ఆ తర్వాత అగర్వాల్ మంచం దిగి ఆ గది నుంచి బయటికి వెళ్లిపోయారు.

అసలే ఇవి ఈ సోషల్ మీడియా రోజులు కాబట్టి.. అగర్వాల్ వ్యవహారం బయటికి వచ్చింది.. కేవలం కెమెరా ముందు మాత్రమే ఆయన రక్తదానం చేసిన విషయం తెలిసింది..” ఒంట్లో నుంచి రక్తపు చుక్క బయటికి తీయలేదు. కెమెరాలు తీస్తున్నాయనే సోయి కూడా ఆయనకు లేదు. ప్రతి వ్యవహారం కెమెరాలో రికార్డ్ అయింది.. సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన రోజు నకిలీ రక్తదానం చేశారు. ఇంతకు మించిన దరిద్రం ఇంకొకటి ఉండదు. రక్తదానం విషయంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని మోసం చేస్తే.. ఓటు వేసి గెలిపించిన ప్రజలను ఇంకెలా మోసం చేస్తున్నారో.. ఇలాంటి వ్యక్తుల వల్ల పార్టీకి నష్టం వాటిల్లుతుంది. వీలైనంత త్వరలో ఇలాంటి వ్యక్తులను బయటకు పంపాలి.. లేకుంటే పార్టీకి తలవంపులు తప్పవు. రక్తదానం చేయకపోయినా పర్వాలేదు. కానీ ఇలా చేయకున్నా చేసినట్టు నటించడమే ఇబ్బందికరంగా ఉంది. మనదేశంలో రక్తం లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటివారికి రక్తం అందించాలనే నిర్ణయం గొప్పదే అయినప్పటికీ.. ఇలా రక్తదానం చేయకపోయినప్పటికీ చేసినట్టు గప్పాలు పోవడమే అసలైన దరిద్రమని” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదే విషయాన్ని బిజెపి కార్యకర్తలు అంతర్గతంగా చర్చించుకోవడం విశేషం. కాగా, ఈ విషయం బిజెపి అధిష్టానానికి తెలిసిందని సమాచారం. ఈ వ్యవహారం జాతీయ మీడియాలోనూ ప్రముఖంగా రావడంతో… ఆ మేయర్ నాలుక కర్చుకున్నట్టు తెలుస్తోంది.