BJP: బీజేపీ రాష్ట్ర వ్యాప్తంగా బలపడేందుకు అడగులు వేస్తోంది. అందులో భాగంగా అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటోంది. హుజూరాబాద్ ఎన్నికల నుంచి బీజేపీ హడావిడి కనిపిస్తోంది. అక్కడ విజయం సాధించిన వెంటనే వడ్ల కొనుగోలు విషయంలో ఫోకస్ చేసింది. రైతుల దృష్టిలో పడాలని తాపత్రయ పడింది. రాష్ట్ర ప్రభుత్వం వడ్లను కొనాలని డిమాండ్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. ఇలా ప్రతీ అంశంలోనూ కలుగజేసుకుంటూ వార్తల్లో నిలవాలని చూస్తోంది. అయితే ఇప్పుడు హైదరాబాద్ పై దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఇప్పటికీ హైదరాబాద్‌లో బీజేపీకి కొంత పట్టుంది. దానిని మరింత విస్తృతం చేసుకోవాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ మెరుగైన స్థానాలనే దక్కించుకుంది.
Also Read: కేసీఆర్ కొత్త నాటకాన్ని బయటపెట్టిన కిషన్ రెడ్డి
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం లేదంటూ ఆందోళన..
ఏడాది నుంచి జీహెచ్ ఎంసీ కౌన్సిల్ సమావేశం నిర్వహించడం లేదంటూ బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం ఆందోళన చేపట్టారు. జీహెచ్ఎంసీ ఆఫీసు ఎదుట ధర్నా చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి, మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ధర్నా చాలా సేపు జరిగింది. కొంత సమయం తరువాత ఆందోళన కారులు మేయర్ ఛాంబర్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు కలుగజేసుకొని వారిని అడ్డుకున్నారు. నిరసనకారులు ఆఫీసులో ఉన్న పూలకుండీలను పగులగొట్టారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
అరెస్టుపై బండి సంజయ్ కుమార్ ఆగ్రహం..
బీజేపీ(BJP) కార్పొరేటర్ల అరెస్టును బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ ఖండించారు. జీహెచ్ఎంసీ పాలకవర్గ సమావేశం నిర్వహించడం లేదంటూ ఆందోళన చేపట్టిన కార్పొరేటర్లను అరెస్టు చేయడం సరైంది కాదన్నారు. కార్పొరేటర్లకు మేయర్ అందుబాటులో ఉండటం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వమే జీహెచ్ఎంసీని పాలించాలనుకుంటోందా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేటర్ల పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని అన్నారు. జీహెచ్ ఎంసీలో చాలా బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. వాటిని వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేశారు.
స్పందించిన మేయర్..
బీజేపీ ఆందోళన, బండి సంజయ్ వ్యాఖ్యలపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు. మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకపోవడానికి గల కారణాలను వివరించారు. కార్పొరేటర్లు ఎప్పుడైనా తనని కలవచ్చని చెప్పారు. ప్రభుత్వ ఆఫీసులో ఇలా విధ్వంసం సృష్టించడం సరైంది కాదని అన్నారు. కరోనా కారణంగా వర్చువల్ పద్దతిలో సమావేశాలు నిర్వహించామని చెప్పారు. సమావేశం జరగకపోయినా.. పార్టీలకు అతీతంగా ఎప్పుడైనా కార్పొరేటర్లు తనని కలవచ్చని సూచించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికలు ఉండటం వల్ల ఎన్నికల కోడ్ అమలులో ఉందని, అది ముగిసిన వెంటనే సమావేశాలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు.
Also Read: బీజేపీ బ్యాక్ స్టెప్ వేయడం ఇది ఎన్నో సారి ?