
రాష్ట్ర రాజధాని విషయంలో బీజేపీకి ఎదురవుతున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు (బీజేపీ మినహా) అన్ని అమరావతికి మద్దతు ఇస్తూ ఒకే సిద్ధాంతంతో ముందుకు వెళుతుంటే బీజేపీ మాత్రం అమరావతి విషయంలో ఒక వైఖరి లేకుండా, అటు కేంద్రం నుంచి స్పష్టత లేక నానా తిప్పలు పడుతుంది. చివరికి చేసేదేమీ లేక అమరావతి విషయంలో మీడియా చర్చలకు వెళ్లవద్దని పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. అయినప్పటికీ కొందరు అధిష్టానం ఆదేశాలను సైతం లెక్క చేయడకుండా మీడియా ముఖంగానే పార్టీ, కేంద్ర ప్రభుత్వ వైఖరిని విరుద్ధంగా ప్రకటనలు చేయడం పార్టీ రాష్ట్ర నాయకత్వానికి ఇబ్బంది తప్పడం లేదు. అది వారి వ్యక్తిగత అభిప్రాయంగా పార్టీ ముఖ్య నేతలు చెప్పుకొస్తున్నారు.
Also Read: శంకుస్థాపనకు ప్రధాని హాజరవుతారా?
రాజధాని విషయంలో మీడియా చర్చలకు హాజరు కావద్దని పార్టీ ఆదేశాలను లెక్క చేయకుండా చర్చలో పాల్గొన్న రమణ ను రాష్ట్ర నాయకత్వం కొద్ది రోజుల కిందట సస్పెండ్ చేసింది. అదేవిధంగా లంకా దినకర్ కు నోటీసులు జారీ చేసింది. అమరావతి విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా చెప్పుతో కొట్టుకుంటూ మీడియాలో పతాక శీర్షికకు చిక్కిన వెలగపూడి గోపాలకృష్ణను తాజాగా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పార్టీ కార్యాలయ కార్యదర్శి పి.శ్రీనివాసరావు ఆదేశాలు జారీ చేశారు. గతంలో కన్నా అధ్యక్షుడుగా ఉండగా లక్ష్మీపతి రాజా తదితరులను ఇదే విధంగా సస్పెండ్ చేశారు.
Also Read: విశాఖకు రాజధాని: జగన్ కు షాకిచ్చిన సొంత పత్రిక సర్వే?
అమరావతి విషయంలో పార్టీ స్పష్టమైన వైఖరి తీసుకోకుండా పార్టీ నాయకులపై చర్యలు తీసుకుంటూ పోవడం ఎంత వరకూ సబబు అని సస్పెండ్ అయిన నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీకి రాష్ట్రంలో ఉన్న నాయకుల సంఖ్య తక్కువ. వివిధ కారణాలతో ఉన్న వారిని సస్పెండ్ చేసుకుంటూ పోతే ఎలా అనేది వారి వాదన. బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం టిడిపి, వైసిపి నుంచి అధిక సంఖ్యలో వలసలు త్వరలో ఉంటాయని మీడియాకు చెప్పుకొచ్చారు. ఈ ధైర్యంతోనే ఉన్నవారిని సస్పెండ్ చేసుకుంటూ పోతున్నారేమోననే విమర్శలు వినిపిస్తున్నాయి.