Janasena BJP Alliance
Janasena BJP Alliance: తెలంగాణలోనూ జనసేన పోటీ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాన్ స్పష్టత ఇచ్చారు. 32 స్థానాల్లో పోటీ చేస్తామని నెల క్రితం ప్రకటించారు. అయితే, ఎన్డీఏలో భాగస్వామి అయిన జనసేన తెలంగాణలో తమతో కలిసి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పవన్‌ను కోరారు. ఈమేరకు రెండు సార్లు కిషన్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ సంప్రదింపులు జరిపారు. ఈమేరకు ఒక అవగాహనకు వచ్చిన తర్వాత పొత్తు ఖరారు చేసేందుకు బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లారు. హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డాతో సమావేశమయ్యారు. పొత్తు దాదాపు ఖరారైంది. సీట్ల పంపకం అంశం కూడా నేడో రేపో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
ఆంధ్రా సరిహద్దు జిల్లాల్లో..
బీజేపీతో పొత్తులో భాగంగా జనసేన 30 సీట్లు అడుగుతోంది. ఇప్పటికే పవన్ 32 స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. తాజాగా పొత్తు నేపథ్యంలో 2 స్థానాలు తగ్గించి 30 స్థానాల్లో పోటీకి సిద్ధమంటున్నారు. కానీ, బీజేపీ మాత్రం అందుకు సుముఖంగా లేదు. జనసేనకు 7 నుంచి 15 టికెట్లు ఇచ్చే ఆలోచనలో ఉంది. అవి కూడా ఆంధ్రా సరిహద్దులో ఉన్న ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ జిల్లాలతోపాటు, ఆంధ్రా సెటిలర్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌లోని కొన్ని స్థానాలు జనసేనకు ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో బీజేపీ బలంగా లేదు. ఈ నేపథ్యంలో ఈస్థానాలను జనసేనకు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం ఉండకపోచ్చని సమాచారం. ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆంధ్రా సెటిలర్లు ఉన్న రెండు మూడు నియోజకవర్గాలను మాత్రమే జనసేనకు ఇవ్వాలనుకుంటోంది. ఎందుకంటే హైదరాబాద్‌లో బీజేపీ బలంగా ఉంది. ఇక్కడ యువ ఓటర్లు బీజేపీ అండగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జనసేనకు సాధ్యమైనంత తక్కువ స్థానాలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే జనసేన అడిగే నియోజకవర్గాల్లో సగానికి పైగా సెగ్మెంట్లు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలోనే ఉండడం గమనార్హం.
గ్రేటర్‌లో జనసేన అడుగుతున్న స్థానాలు..
హైదరాబాద్ శివార్లలోని పటాన్‌చెరు, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్బీనగర్, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, సనత్‌నగర్, ఖైర తాబాద్, జూబ్లీహిల్స్ వంటి నియోజకవర్గాలపై జనసేన కన్నేసింది. ఇవే స్థానాల్లో బీజేపీకి కూడా బలమైన అభ్యర్థులు ఉన్నారు.
సర్వే ఇలా..
జనసేన – బీజేపీ కలిసి తెలంగాణలో పోటీ చేస్తే జనసేన పార్టీ 3 స్థానాల్లో, బీజేపీ పార్టీ 8 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలు తెలుపుతున్నాయి. ఇది జనసేన పార్టీకి తెలంగాణ లో ఉనికి చాటుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది. అధికార బీఆర్‌ఎస్ పార్టీకి వణుకు పుట్టించిన బీజేపీకి మాత్రం ఘోరమైన డౌన్‌ఫాల్ అనే చెప్పాలి.