ప్రస్తుతం బీజేపీ నాయకులు సందిగ్ధ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రాబోయే ఎన్నికల నాటికి ఓటు బ్యాంకుపై సమాలోచనలు చేస్తున్నారు. ఏ పార్టీకి మద్దతు ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై చర్చలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో చంద్రబాబుపై ఆధారపడడంతో నష్టపోయామని భావిస్తూ ఇప్పుడు జగన్ కు సపోర్టు చేస్తే ఎలా ఉంటుందనే దానిపై లెక్కలు వేసుకుంటున్నారు. రెండు ప్రభుత్వాల్లో పాలకులు బీజేపీ విషయంలో ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతారనే విషయాలపై కూలంకషంగా చర్చిస్తున్నారు.
చంద్రబాబుతో మూడేళ్లపాటు దోస్తీ కట్టినా ప్రయోజనం లేకుండా పోయింది. 2019 ఎన్నికలకు ముందు ఏడాదిన్నర రెండేళ్ల సమయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ కాలంలో టీడీపీ ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపే ప్రయత్నాలు చేయలేకపోయింది. కేవలం నలుగురు ఎమ్మెల్యేలతో సరిపెట్టుకున్నారు. బలహీన నాయకత్వం వల్ల ఆ సమయంలో టీడీపీకి పూర్తిగా సరెండర్ అయిపోయింది.
దీంతో బీజేపీ పుంజుకోలేకపోయింది. బీజేపీ నేతలు ఎక్కడ నోరు విప్పలేకపోయారు. టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించలేకపోయారు. ఇప్పుడు జగన్ విషయంలో కూడా బీజేపీ పెదవి విప్పలేకపోతోంది. బీజేపీకి జగన్ దగ్గర కావడమే దీనికి కారణంగా నాయకులు చెబుతున్నారు. దీంతో రాష్ర్ట నాయకులు ఎవరికి ఎస్ చెప్పాలో ఎవరికి నో చెప్పాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
కేంద్రం ఇస్తున్న నిధులతో జగన్ తన పేరును పెట్టుకుని ప్రచారం చేస్తున్నా బీజేపీ నాయకులు ఏమీ అనలేకపోతున్నారు. జగన్ సర్కారుతో మిలాఖత్ అయిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో నోరు విప్పేందుకు సాహసం చేయడం లేదు. దీంతో పార్టీ నాయకత్వం ఎవరిని చేరదీస్తోందో తెలియని సందిగ్ధ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి.