Somu Veerraju: తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేసేందుకు చేయని ప్రయత్నమంటూ లేదు. అందివచ్చిన ఏ అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు సంఖ్యాబలంలో ముందున్నాయే తప్ప అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొన లేకపోతున్నాయి. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీది వింత పరిస్థితి. ప్రజాక్షేత్రంలో అధికార పార్టీతో తలపడాల్సిన ప్రతీసారి ఏదో కుంటి సాకుతో తప్పించుకుంటోంది. రకరకాల కారణాలు చెప్పి పోటీ నుంచి తప్పుకుంటోంది. చివరకు స్థానిక సంస్థల్లో ఆయువు పట్టుగా నిలిచే ఎంపీటీసీ ఎన్నికలకు సైతం టీడీపీ దూరంగా జరిగిపోయింది. అసలు తాము ప్రతిపక్షమే కాదన్నట్టుగా వ్యవహరిస్తోంది. ఇటువంటి సమయంలో భారతీయ జనతా పార్టీ ప్రజా క్షేత్రంలో అధికార వైసీపీకి ధీటుగా ఎదురెళ్లుతోంది.
స్థానిక సంస్థల ఎన్నికల నుంచి ఉప ఎన్నికల వరకూ దేనినీ విడిచిపెట్టడం లేదు. మిత్ర పక్ష జనసేన సాయంతో ఎన్నికల యద్ధంలో దిగుతోంది. ఈ విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మొండిగా ముందుకు సాగుతున్నారు. తన శక్తియుక్తుల్ని వినియోగిస్తున్నారు. బీజేపీ ఉనికిని చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయంలో సఫలీక్రుతులయ్యారు కూడా. తొలిసారిగా బద్వేలు అసెంబ్లీ, తరువాత తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నికలో అధికార పార్టీకి వ్యతిరేకంగా బీజేపీ అభ్యర్థిని నిలపగలిగారు. ఇప్పుడు మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అకాల మరణంతో జరగనున్న ఉప ఎన్నికలో కూడా అభ్యర్థిని నిలబెట్టేందుకు `గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. తిరుపతి ఉపఎన్నికల్లో చనిపోయిన ఎంపీ బల్లిదుర్గా ప్రసాదరావు కుటుంబ సభ్యులకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో అన్ని రాజకీయ పార్టీలు పోటీ చేశాయి. కానీ బద్వేలులో మాత్రం చనిపోయిన ఎమ్మెల్యే భార్యకే అవకాశం కల్పించడంతో అన్ని రాజకీయ పార్టీలు పోటీకి దూరంగా ఉన్నాయి. కానీ బీజేపీ మాత్రం పోటీ చేసింది.
Also Read: KCR- Early Elections: కేసీఆర్ ‘ముందస్తు ఎన్నికల’పై ఎందుకు వెనక్కి తగ్గాడు? ఆ మతలబేంటి?
ఇరవై వేల ఓట్ల వరకూ సాధించింది. ఎవరూ పోటీ చేయని ఎన్నికలో ఇరవై వేల ఓట్లు సాధించి మెరుగైన ఫలితాలనే సాధించింది. ఇప్పుడు ఆత్మకూరులోనే అదే పద్దతి పాటించాలని అనుకుంటున్నారు. గౌతంరెడ్డి కుటుంబీకులే అక్కడ పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అక్కడి రాజకీయ పరిస్థితులను బట్టి చూసినా… విపక్షాలు ఎన్నికల్లో పోటీ చేయడం కష్టమే. ఈ పరిస్థితిని మరోసారి ఓట్లుగా మల్చుకోవాలని సోము వీర్రాజు డిసైడయ్యారు.
ఆది నుంచి సోము వీర్రాజు విషయంలో ఆయన వ్యతిరేకులు రకరకాల ప్రచారాలు మొదలు పెట్టారు. ఆయన వైసీసీకి సిక్రేట్ స్నేహితుడని కూడా ఆరోపించారు. పచ్చ నేతలైతే ఒక అడుగు ముందుకేసి జగన్ తొత్తుగా అభివర్ణిస్తారు. బీజేపీ కేంద్ర నాయకత్వంతో కలవకుండా సోము వీర్రాజే టీడీపీని అడ్డుకుంటున్నారని ఆక్రోషిస్తారు. సోము ఉంటే తమ పప్పులుడకవని బీజేపీలో ఉండే పూర్వపు పసుపు నేతలతో కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదులిప్పిస్తుంటారు. ఎన్నికల నాటికి సోము వీర్రాజును అధ్యక్ష పదవి నుంచి తొలగించడమే ధ్యేయంగా పావులు కదుపుతుంటారు. కానీ సోము వీర్రాజు ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను పూర్తి చేస్తుంటారు. పార్టీని బలోపేతం చేయడంపైనే ద్రుష్టిపెట్టారు. అధికార వైసీపీ పైనే పోరాట పటిమ సాగిస్తున్నారు. ఇప్పుడు అత్మకూరులో పార్టీ అభ్యర్థిని బరిలో దింపి గౌరవప్రదమైన ఓట్లు పొందేందుకు అస్త్ర శస్త్రాలు సిద్ధం చేస్తున్నారు.
Also Read:AP Power Cuts: ఏపీలో విద్యుత్ సంక్షోభం.. పరిశ్రమలకు పవర్ హాలీడే పొడిగింపు