Chandrababu: వచ్చే ఎన్నికల్లో వ్యూహాలను అమలు చేసే పనిలో చంద్రబాబు ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ విషయంలో పెద్ద ఆలోచన చేస్తున్నారు. అసలు బిజెపి తనతో కలిసి వస్తే లాభం ఎంత? నష్టం ఉంటుందా? కలిసి వచ్చే అంశాలు ఏంటి? అని కూలంకుషంగా లెక్కలు వేసుకుంటున్నారు. ఒకవేళ కలిసి వచ్చిన సింహభాగం ప్రయోజనాలను దక్కించుకోవాలని భావిస్తున్నారు. బిజెపి విషయంలో ఆయన స్కెచ్ అంటూ లేదు. కానీ బిజెపి నుంచి ఆ స్థాయిలో స్పందన వస్తుందా? లేదా? అని మాత్రం తెలియడం లేదు. ఎన్నికల సమీపిస్తుండటంతో ఏదో ఒక నిర్ణయం చెప్పాల్సిన అనివార్య పరిస్థితి బీజేపీకి ఎదురైంది.
బిజెపి కలిసి వస్తే ఎన్నికల క్యాంపెయిన్ ఈజీ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నారు. ఎన్నికల కమిషన్ నుంచి కొన్ని రకాల మినహాయింపులు వస్తాయని.. వ్యవస్థలను వినియోగించుకోవచ్చని ఒక అంచనాకు వస్తున్నారు. గతసారి తాను అధికార పక్షంలో ఉండి ఎన్నికలను ఎదుర్కొన్నారు. అప్పట్లో బీజేపీని వ్యతిరేకించి మూల్యం చెల్లించుకున్నారు. ఎలక్షన్ కమిషన్ తో పాటు వ్యవస్థలు సైతం ప్రతికూల ప్రభావాన్ని చూపిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. అందుకే ఈసారి ఆ తప్పు జరగకూడదని భావిస్తున్నారు. బిజెపి తమతో కలిసి వస్తే కొన్ని రకాల ప్రయోజనాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. అదే సమయంలో మైనారిటీల ఓట్లు పోతాయని కూడా భయపడుతున్నారు.
ఒకవేళ బిజెపి కూటమిలో చేరితే ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయని భావిస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపి చేరికతో కూటమి బలం పెంచుకుంటుందని.. పారిశ్రామికవేత్తలతో పాటు చాలా రకాల కంపెనీల నుంచి ఫండింగ్ రూపంలో నగదు వస్తుందని ఆశిస్తున్నారు. గత ఎన్నికల్లో ఫండింగ్ విషయంలో చంద్రబాబు వెనుక పడ్డారు. అదే సమయంలో వైసీపీ నగదు పంపిణీ విషయంలో స్వేచ్ఛగా పనిచేసింది. ఇందుకు బిజెపి సహకరించింది. అక్కడే వైసీపీకి ప్లస్సు గా మారిందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే బిజెపి స్నేహం కోసం ప్రయత్నిస్తున్నారు. బిజెపి నుంచి సానుకూల ప్రకటన రాకున్నా అదేపనిగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అయితే ఎన్నికలు సమీపిస్తుండడంతో ఏదో ఒక నిర్ణయం బిజెపి తీసుకుంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అమిత్ షా నుంచి ఆమోదముద్ర వచ్చిందే తడువు పొత్తు ప్రకటన వస్తుందని బిజెపి రాష్ట్ర వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికైతే చంద్రబాబు తన స్కెచ్ లో బిజెపిని వీడకపోవడం విశేషం.