Janasena BJP Alliance: తెలంగాణ ఎన్నికల్లో కూకట్ పల్లి నియోజకవర్గం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఇక్కడ జనసేన బరిలో నిలవడమే అందుకు కారణం. ఈ నియోజకవర్గంలో సెటిలర్స్ అధికం. వారు ఎటువైపు మొగ్గు చూపుతారో వారిదే విజయం. అందుకే సెటిలర్స్ ను ఆకట్టుకునేందుకు అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ శత విధాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ జనసేన విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ స్థాయిలో ప్రచారం కనిపించడం లేదు. బిజెపి నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో జనసైనికులు, పవన్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో జనసేన ఎనిమిది చోట్ల పోటీ చేస్తోంది. కానీ గ్రేటర్ పరిధిలో కూకట్ పల్లి సీటు దక్కడంతో అక్కడ గెలుపు పక్కా అన్న విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ సీటు వదులుకునేందుకు బిజెపి ముందుగా ఇష్టపడలేదు. కానీ జనసేన పట్టుబడడంతో తప్పనిసరి పరిస్థితుల్లో విడిచిపెట్టింది. అయితే బిజెపి గతం మాదిరిగా ఇక్కడ గెలుపు కోసం ప్రయత్నాలు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది.ఇక్కడ మన పార్టీ అభ్యర్థి బరిలో లేరు కదా? అన్న నిర్లిప్తత బిజెపిలో కనిపిస్తోంది. అది జనసేన అభ్యర్థికి మైనస్ గా మారుతోంది.
పదేళ్లుగా ఈ నియోజకవర్గానికి మాధవరం కృష్ణారావు ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బండి రమేష్ బరిలో దిగారు. గత రెండు ఎన్నికల్లో కృష్ణారావుకు సామాజిక వర్గంతో పాటు సెటిలర్స్ బలం లభించింది. అయితే ఏపీలో మారిన రాజకీయ పరిస్థితులతో ఆ రెండు వర్గాల్లో చేంజ్ కనిపిస్తోంది. ఇటువంటి సమయంలో జనసేన యాక్టివ్ అయితే.. ఆ రెండు వర్గాల సపోర్టు లభించే అవకాశం ఉంది. కానీ బిజెపి నుంచి సహాయ నిరాకరణ ఎదురు కావడంతో… ఆ రెండు వర్గాల ఓట్లు కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యాయి.
గ్రేటర్ లో మిగతా నియోజకవర్గాలపై బిజెపి నాయకులు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. కానీ కూకట్ పల్లి విషయంలో మాత్రం పెద్దగా ఫోకస్ చేయడం లేదు. అటు పవన్ పర్యటన సైతం ఖరారు కాలేదు. దీంతో ఇక్కడ బరిలో దిగిన ప్రేమ్ కుమార్ కాస్త ఆందోళనకు గురవుతున్నారు. ఇక్కడ కానీ పవన్ తో పాటు బీజేపీ అగ్రనేతలు, ఏపీ నేతలు ప్రచారం చేస్తే సానుకూల ఫలితం వస్తుందని జనసేన నేతలు ఆశిస్తున్నారు. పైగా జనసేన అభ్యర్థి ప్రేమ్ కుమార్ పూర్వాశ్రమంలో బిజెపి నాయకుడు. అక్కడ కిందిస్థాయి క్యాడర్ సహకారం అందిస్తున్నా.. కీలక నాయకులు మాత్రం ముఖం చాటేస్తున్నారు. జనసేనకు గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నా బిజెపి సహాయ నిరాకరణ ఇబ్బందికరంగా మారుతోంది. ఇదే విషయమై పవన్ కు వివరిస్తామని జనసైనికులు చెబుతున్నారు. ఇంకా ప్రచారానికి పది రోజుల వ్యవధి ఉంది. పవన్ తో పాటు బిజెపి నేతలు ఎంటర్ అయితే సీన్ మారుతుందన్న ఆశలు జనసేన నేతలు ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.