BJP Fights Over Congress Magazine: *ఈడి బోనులో రాహుల్, సోనియా
*బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఫిర్యాదుతో నే తెరపైకి నేషనల్ హెరాల్డ్ కేసు
*షేర్ లను యంగ్ ఇండియన్ కంపెనీకి బదలాయించడం తోనే అసలు సమస్య
వందలాది మంది ఉద్యోగులు.. దేశ వ్యాప్తంగా వేల కోట్ల ఆస్తులు.. దేశ స్వాతంత్ర పోరులో ఉద్యమ ఆకాంక్షను వెలుగెత్తి చాటిన ఘనత.. ఇది నేషనల్ హెరాల్డ్ పత్రిక చరిత. అంతటి ఘనకీర్తి ఉన్న పత్రిక ప్రస్తుతం చిక్కుల్లో పడింది. మనీ లాండరింగ్ ఆరోపణలతో ప్రస్తుతం ఈడీ ముందు రాహుల్ గాంధీ హాజరయ్యే స్థాయికి దిగజారింది. వాస్తవానికి ఈ కేసు ఈనాటిది కాదు.
జవహార్ లాల్ నెహ్రూ ఆధ్వర్యంలో ప్రారంభం

..
స్వాతంత్రం రాక ముందు ఉద్యమ ఆకాంక్షను ప్రజల్లో ప్రబలంగా చాటాలని ఐదు వేల మంది స్వాతంత్ర సమరయోధుల వద్ద నిధులను సమీకరించి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఏజేఎల్(అసోసియేట్ జర్నల్స్ లిమిటెడ్) పేరిట నేషనల్ హెరాల్డ్ పత్రిక ను “భారత కంపెనీల చట్టం-1913 ప్రకారం” 1937 నవంబరు 20న ప్రారంభించారు. ఈ పత్రికలో 5000 మంది స్వాతంత్ర సమరయోధులు షేర్ హోల్డర్లు గా ఉన్నారు. ఏజేఎల్ హిందీలో ‘నవజీవన్, ఉర్దూలో కౌమీ ఆవాజ్” పేరుతో పత్రికలను ప్రచురించింది. ఏజేఎల్ కంపెనీ కి ఢిల్లీ, యూపీ లో ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం రెండు వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి.
సోనియా, రాహుల్ కాజేశారా?

…
ఏజేఎల్ కంపెనీ ప్రచురించే అన్ని పత్రికలు నష్టాల్లో ఉన్నాయంటూ 2008 ఏప్రిల్లో ముద్రణను నిలిపివేశారు. అనంతరం సంస్థ ప్రధాన కార్యాలయాన్ని యూపీ నుంచి ఢిల్లీలోని నేషనల్ హౌస్ కు తరలించారు. ఈ సమయంలోనే ఏజేఎల్ కు కాంగ్రెస్ లోని అత్యున్నత స్థాయి కమిటీ ఎప్పటికప్పుడు రుణాలు ఇస్తూ వస్తోంది. ఈ రుణాలు 2010 నాటికి ₹ 90 కోట్లకు చేరాయి. అయితే ఈ రుణాల విషయంలో అప్పటి యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, ఆమె తనయుడు రాహుల్ గాంధీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఏజెఎల్ కంపెనీని దక్కించుకోవాలన్న ఉద్దేశంతోనే రుణాలు ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.
యంగ్ ఇండియాకు ఎందుకు బదిలీ చేశారు?
బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి రాహుల్ గాంధీ సోనియా గాంధీ పైన కేసు దాఖలు చేయడానికి ప్రధాన కారణం కూడా ఇదే. వాస్తవానికి ఏజేఎల్ కంపెనీ కి రుణాలు ఇచ్చింది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ. ఒకవేళ సదరు కంపెనీ రుణాలు చెల్లించని పక్షంలో భారత కంపెనీల చట్టం ప్రకారం ఆ సంస్థకు చెందిన ఆస్తులను ఏ ఐ సి సి జప్తు చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడే అసలు మతలబుకు తెరలేచింది. తనకు రావాల్సిన బకాయిలను వసూలు కోసం ఏఐసిసి 99.99 శాతం ఏ జే ఎల్ షేర్లను యంగ్ ఇండియా కంపెనీ కి 2010 ఏప్రిల్లో బదలాయించింది. ఇందుకు ప్రతిగా యంగ్ ఇండియన్ కంపెనీ ₹50 లక్షలు ఏఐసీసీకి చెల్లించింది. అంతకు ముందు మూడు రోజుల క్రితమే యంగ్ ఇండియా కంపెనీ సమావేశం నిర్వహించింది. ఈ కంపెనీలో రాహుల్గాంధీ డైరెక్టర్గా ఉండటం విశేషం.
ఆస్తుల విలువ ₹ఐదు వేల కోట్లు
ఏజేఎల్ కంపెనీ రియల్ ఎస్టేట్ ఆస్తుల విలువ ₹ఐదు వేల కోట్లు ఉంటుందని మార్కెట్ వర్గాల అంచనా. ఢిల్లీలోని 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు అంతస్తుల్లో హెరాల్డ్ హౌస్ ఉంది. దీంతోపాటు లక్నో, భోపాల్, ఇండోర్, ముంబాయ్, పాటియాలా, పంచకుల ప్రాంతాల్లో విలువైన ఆస్తులు ఉన్నాయి.
సుబ్రహ్మణ్య స్వామి కేస్ ఫైల్ చేయటంతో
ఏజేఎల్ కంపెనీకి చెందిన వేల కోట్ల ఆస్తులను కొట్టేయడానికి రాహుల్ గాంధీ సోనియా గాంధీ ప్లాన్ వేశారని, అందులో భాగంగానే ఏఐసీసీ కి చెందిన నిధులను సొంతానికి వాడుకున్నారని 2012లో బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఢిల్లీలో ఓ ప్రైవేటు కేసు ఫైల్ చేశారు. ఢిల్లీ, యూపీలోని ₹1600 కోట్ల విలువైన ఏజేఎల్ కంపెనీ ఆస్తులను దక్కించుకున్నారని ఆరోపించారు. షేర్ లన్ని యంగ్ ఇండియన్ కంపెనీ ద్వారా తీసుకోవడం పెద్ద దుమారాన్ని రేపుతోంది. అసలు ఈ కేసు ఇంత సంక్లిష్టంగా మారడానికి కూడా కారణం అదే. ఇందులో మనీలాండరింగ్ కు పాల్పడ్డట్టు ఆధారాలు కనిపించడంతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి సమన్లు జారీ చేసింది. ఇందులో భాగంగానే సోమవారం రాహుల్ గాంధీ విచారణకు హాజరయ్యారు.
ఏమిటీ ఈ యంగ్ ఇండియన్ కంపెనీ
యంగ్ ఇండియన్ కంపెనీ 2010లో ప్రారంభమైంది. ఈ కంపెనీ స్థాపన అనంతరమే నష్టాలు ఉన్నాయంటూ నేషనల్ హెరాల్డ్ హౌస్ ఆస్తులు అద్దెకు ఇవ్వడం ప్రారంభమైంది. ఇక యంగ్ ఇండియన్ కంపెనీలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లకు 76% తో సంయుక్త మెజారిటీ షేర్లు ఉన్నాయి.మిగిలిన 24% షేర్లు కాంగ్రెస్ నాయకులు మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెరనాండెజ్ పేరు మీద ఉన్నాయి. ఇక యంగ్ ఇండియన్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఢిల్లీలోని హెరాల్డ్ హౌస్ లోనే ఉంది. 2011లో ఏఐసిసి తన అప్పు వసూళ్ళలో భాగంగా నేషనల్ హెరాల్డ్ కు చెందిన షేర్ లను యంగ్ ఇండియన్ కంపెనీ కి బదలాయించింది.₹ 47, 513 విలువైన షేర్లను రాహుల్ గాంధీ, ₹2,62,411 విలువైన షేర్లను ప్రియాంక గాంధీ రతన దీపు ట్రస్ట్, జనహిత నిధి ద్వారా కొనుగోలు చేశారు. ఇందులో ఎక్కడా కూడా కంపెనీల నిబంధనలు పాటించ లేదు. ఏజేఎల్ ను దక్కించుకునేందుకు ఏఐసీసీ నిధులను వాడుకోవడం ఇప్పుడు దుమారాన్ని లేపుతోంది. ఏఐసిసికి చెల్లించాల్సిన బకాయిలకు గానూ ఏజేఎల్ సంస్థ యంగ్ ఇండియన్ కంపెనీకి 9 కోట్ల షేర్లను ₹ 10 ముఖ విలువతో ఇచ్చింది. వాణిజ్య అవసరాల కోసం రాజకీయ పార్టీ డబ్బును అప్పుగా ఇవ్వడం ప్రజాప్రాతినిధ్య చట్టం “1951 29- ఏ, బీ, సీ” సెక్షన్ ప్రకారం నేరం. ఆదాయ పన్నుల చట్టం 1961 సెక్షన్ 13 ఏ ప్రకారం అనైతికం. సరిగ్గా ఈ విషయాన్ని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి నొక్కి వక్కాణిస్తున్నారు. దీనికి కౌంటర్ ఇవ్వలేక కాంగ్రెస్ నాయకులు తలలు పట్టుకుంటున్నారు. సోమవారం కాంగ్రెస్ నాయకులు ఈడి కార్యాలయాల ఎదుట ధర్నా చేసిన పెద్దగా స్పందన రాలేదు. దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేకత ఏకం చేసి 2024లో అధికారంలోకి రావాలనే కాంగ్రెస్ ఆశలకు ఆదిలోనే బిజెపి గండి కొడుతోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్ ని బోనులో వేయాలని బిజెపి స్కెచ్ వేసింది. ఇందులో భాగంగానే నేషనల్ హెరాల్డ్ కేసును మరోసారి తెరపైకి తెచ్చింది. ఇందులో అన్ని లొసుగులు ఉండటంతో కాంగ్రెస్ కక్కలేక మింగలేక ఇబ్బంది పడుతోంది.