రెండు తెలుగు రాష్ట్రాలను పోల్చి చూసినప్పుడు.. ఏపీలో అనుకున్నంత ప్రభావం చూపలేకపోతున్నామనే భావనలో ఉంది బీజేపీ అధిష్టానం. సాధ్యమైనంత త్వరగా ఈ పరిస్థితిని అధిగమించాలని నిర్ణయించుకుంది. అందుకు తిరుపతి ఉప ఎన్నికే సరైన మార్గంగా ఎంచుకుంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయం అని చాటి చెప్పాలని డిసైడ్ అయ్యింది. మిత్రపక్షం జనసేనకు అవకాశం ఇవ్వకుండా బీజేపీ అభ్యర్థిని నిలపడంలో కూడా వ్యూహం ఇదే.
స్థానిక సంస్థల ఎన్నికలతో ప్రధాన ప్రతిపక్షం పూర్తిస్థాయిలో డీలాపడిపోయిన వేళ.. మోడీ వేవ్ తో తిరుపతి లోక్ సభ స్థానంలో జెండా ఎగరేయాలని ఆశించింది. కానీ.. ఫలితాలు మాత్రం అంచనాలకు అర కిలోమీటరు దూరంలో మిగిలిపోయాయి. ఇప్పటి వరకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే.. అధికార వైసీపీ అభ్యర్థి గురుమూర్తి 2 లక్షల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి రెండో స్థానంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు వైసీపీకి 4 లక్షల 61 వేలకుపైగా ఓట్లు రాగా.. టీడీపికి 2 లక్షల 55 వేలకు పైగా వచ్చాయి. బీజేపీకి మాత్రం కేవలం 43 వేల ఓట్లు పోలయ్యాయి. దీంతో.. బీజేపీకి రెండో స్థానం కూడా రాదని తేలిపోయింది.
ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతీపార్టీ మొదటి ప్రాధాన్యం విజయమే అనడంలో సందేహం లేదు. బీజేపీ కూడా అదే లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే.. విజయం సాధ్యం కాని పక్షంలో రెండో స్థానంలో నిలవాలన్నది ఆ పార్టీ టార్గెట్. తద్వారా.. ప్రధాన ప్రతిపక్షాన్ని వెనక్కి నెట్టామని, అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామే అని చాటి చెప్పాలన్నది ఆ పార్టీ లక్ష్యం. కానీ.. అది కూడా సాధ్యం కాదన్నది తేలిపోయింది. రెండో స్థానంలో టీడీపీ కొనసాగుతుండగా.. ఆ పార్టీకి సైతం దరిదాపుల్లో లేకపోవడం బీజేపీని ఆందోళనకు గురిచేసే అంశం.
మరి, ఈ పరిస్థితి కారణం ఏంటనే అంశం తెరపైకి వచ్చినప్పుడు అన్నీ వేళ్లూ ఒకే వ్యక్తివైపు చూపిస్తున్నాయి. ఆయనే బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జ్ సునీల్ దియోథర్. తిరుపతి ఉప ఎన్నికల బాధ్యతలు తీసుకున్న ఆయన.. రాష్ట్రంలోనే ఉండి పార్టీని ముందుకు నడిపించారు. అయితే.. ఎక్కడా స్థానిక నేతలకు ఆయన అవకాశం ఇవ్వలేదన్నది ప్రధాన అభియోగం. చివరకు రాష్ట్ర అధ్యక్షుడు సోమూ వీర్రాజును సైతం పూర్తిగా కార్నర్ చేసిన ఆయన.. ఫోకస్ మొత్తం తనపైనే ఉండేలా చూసుకున్నారనే అభిప్రాయం వ్యక్తమైంది.
రాష్ట్రంలో ఏం జరుగుతోంది? స్థానిక పరిస్థితులు ఏంటీ? అన్నది ఇక్కడి నేతలకు పూర్తిగా అవగాహన ఉంటుంది. కానీ.. ఆయన రాష్ట్ర నేతలకు అవకాశం ఇవ్వకుండా.. పార్టీ పగ్గాలను తన చేతిలో పెట్టుకొని తిరుపతి సమరంలో ముందుకు సాగారనే విమర్శ ఉంది. చివరకు రాష్ట్ర అధ్యక్షుడికి సైతం సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై ఎన్నికల ప్రచారం సమయంలోనే విమర్శలు వచ్చాయి. కానీ.. ఆయన రాష్ట్ర ఇన్ ఛార్జ్ కావడం ఒకెత్తయితే.. ఎన్నికల ముంగిట వివాదాలు, విభేదాలు సరికాదని మౌనంగా ఉన్నారు.
చివరకు ఫలితం ఏంటనేది ఓట్ల లెక్కింపే తేల్చేసింది. కనీసం రెండో స్థానంలో నిలవాలని ఆశిస్తే.. అత్యల్ప ఓట్లతో మూడో స్థానానికి పడిపోవడం గమనించాల్సిన అంశం. మరి, ఈ ఫలితాలపై రాష్ట్ర ఇన్ చార్జ్ గా సునీల్ దియోథర్ ప్రజలకు ఎలాంటి సమాధానం చెబుతారు? అధిష్టానికి ఎలాంటి నివేదిక ఇస్తారు? అన్నది ఆసక్తికరంగా మారింది.