రాజకీయం అంతిమ లక్ష్యం అధికారం. పార్టీ పరంగా చూసినప్పుడు అధి ప్రభుత్వాన్ని స్థాపిస్తే సరిపోతుంది. మరి నాయకుడిగా చూసినప్పుడు? ఆ ప్రభుత్వానికి అధినాయకుడు కావాలి. అప్పుడే రాజకీయ నాయకుడి లక్ష్యం నెరవేరినట్టు లెక్క. ప్రతీ నేత స్వప్నం ఇదే. కానీ.. అందరికీ సాధ్యం కాదు కదా! అందుకే.. ఉన్నవాళ్లను నెట్టేసి, తాము కుర్చీ ఎక్కాలని ఆరాటపడుతుంటారు. ఇది అన్ని పార్టీల్లోనూ ఉండే అత్యంత సహజ లక్షణం. అయితే.. ఈ పరిస్థితిని చక్కదిద్దకపోతే.. మొదటికే మోసం వస్తుంది. నాయకులు నాయకులు కొట్లాడుకొని పార్టీ పుట్టి ముంచే పరిస్థితి కూడా రావొచ్చు. కాంగ్రెస్ లో ఇప్పుడు సాగుతున్నది అదే. అయితే.. బీజేపీలోనూ ఈ పరిస్థితి తారస్థాయికి చేరుతుండడం కమలనాథులను కలవరానికి గురిచేస్తోంది.
ఉత్తరప్రదేశ్ లో ఏకంగా ప్రధానికి-ముఖ్యమంత్రికి మధ్యనే వార్ నడుస్తోందనే ప్రచారం సాగుతోంది. యోగీ పాలనపై మోదీ అసంతృప్తిగా ఉన్నారనే ప్రచారం కొంతకాలంగా నడుస్తోంది. వీరిద్దరూ అంటీ ముట్టనట్టుగానే ఉంటున్నారని అంటున్నారు. వచ్చే ఎన్నికల తర్వాత యోగీని పక్కన పెట్టాలని కూడా మోదీ భావిస్తున్నారట. దీనికి కొనసాగింపుగానే.. గుజరాత్ లో తన వద్ద పనిచేసిన ఐఏఎస్ ఆఫీసర్ ను ఉత్తరప్రదేశ్ బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమించారట. ఉన్నఫలంగా మండలికి నామినేట్ చేయించి మరీ ఈ పనిచేశారట మోదీ. ఇది యోగీకి నచ్చలేదని టాక్. వచ్చే మార్చిలో అక్కడ ఎన్నికలు జరగనున్నాయి. అసలే పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని పంచాయతీ ఎన్నికలు చాటిచెప్పాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దుస్థితి పార్టీ నేతలను గందరగోళానికి గురిచేస్తోంది.
మధ్యప్రదేశ్ లోనూ లుకలుకలు గట్టిగానే ఉన్నాయి. సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కు వ్యతిరేకంగా ఓ జట్టే తయారైంది. హోం మంత్రి మిశ్రా, మంత్రి వి.డి.శర్మ, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు నరేందర్ సింగ్ తోమర్, ధావర్ చంద్ గెహ్లాత్ వంటి వారు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా బలంగా పావులు కదుపుతున్నారు. కైలాస్ వర్గీయ కొత్త సీఎం అనే ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు.
ఇటు కర్నాటకలోనూ ఇదే పరిస్థితి. యడ్యూరప్పపై పార్టీలోని ప్రధాన నేతలు కత్తిగట్టారు. ఆయన్ను సీఎం పదవి నుంచి దించేయాలని చాలా కాలంగా లొల్లి చేస్తున్నారు. ఈశ్వరప్ప, బీ.ఎల్. సంతోష్ వంటి నేతల మద్దతుతో అసమ్మతి వర్గం మంటలు రేపుతోందని అంటున్నారు. అయితే.. తనను తొలగిస్తే పరిస్థితి వేరే తీరుగా ఉంటుందని సంకేతాలు ఇస్తున్నారు యెడ్డీ.
ఇటు త్రిపురలోనూ ఇదే గోల. కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోసి అధికారం సాధించినా.. సమర్థవంతంగా నిలబెట్టుకునే పరిస్థితి కనిపించట్లేదు. ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ పై.. ఏకంగా ఆరుగురు ఎమ్మెల్యే యుద్ధం ప్రకటించారు. సుదీప్ రాయ్ బర్మన్ నేతృత్వంలో జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసి ఫిర్యాదలు కూడా చేశారు. ఇక, మిగిలిన ఉత్తరాఖండ్, హిమాచల్, గుజరాత్ లోనూ పరిస్థితి అంత చక్కగా లేదు. మరి, ఇంత జరుగుతున్నా.. అధిష్టానం ఎందుకు చక్క దిద్దలేకపోతోందన్నది ప్రశ్న. దీనికి వినిపిస్తున్న సమాధానం.. పార్టీలో ట్రబుల్ షూటర్లు లేకపోవడమేనని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో అద్భుతమైన ట్రబుల్ షూటర్లుగా పేరు తెచ్చుకున్న ప్రణబ్, దిగ్విజయ్ వంటివారు కమలంలో లేకపోవడం వల్లే ఈ పరిస్థితి అంటున్నారు. మరి, బీజేపీ అధిష్టానం ఈ సమస్యను ఎలా అధిగమిస్తుందో చూడాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Bjp facing trouble shooters problems
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com