BJP Chief Somu Veerraju vs AP Police ఎప్పుడూ ప్రశాంతంగా నిగ్రహంగా ఉండే ఏపీ బీజేపీ చీఫ్ భగ్గుమన్నారు. తన సహజశైలికి భిన్నంగా పోలీసులపై విరుచుకుపడ్డారు. తన కారుకు అడ్డంగా భారీ వాహనాన్ని నిలిపి ఉంచి ఆపడంతో ఆయనలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. పరామర్శకు వెళుతున్నానన్నా వినని పోలీసులపై సోము వీర్రాజు శివతాండవం చేశారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును పోలీసులు అడ్డుకోవడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. పోలీసులపై సోము వీర్రాజు తిరగబడడంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఇటీవలే అల్లర్లు చెలరేగిన కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పర్యటనకు బయలుదేరిన సోము వీర్రాజును తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. సోము వీర్రాజు కారు ముందు ఓ భారీ వాహనాన్ని ఉంచారు. దీంతో పోలీసుల తీరుపై సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అమలాపురం అల్లర్లలో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకు వెళుతున్న తనను అడ్డుకోవడం ఏంటని సోము వీర్రాజు ప్రశ్నించారు. అల్లర్ల నేపథ్యంలో ఇంకా పోలీసులు ఆంక్షలు కొనసాగుతున్న అమలాపురంలో ప్రముఖుల పర్యటనలకు అనుమతించలేమని పోలీసులు ఆయనకు తేల్చిచెప్పారు.
అయితే తన కారును అడ్డుకోవడంపై సోము వీర్రాజు ఫైర్ అయ్యారు. అడ్డు వచ్చిన ఎస్సైని తోసేసిన సోము వీర్రాజు తనను అడ్డుకోవడానికి మీరెవరు అంటూ విరుచుకుపడ్డారు. కావాలనే తనను ఆపుతున్నారని ఫైర్ అయ్యారు. తాను జిల్లా ఎస్పీతో మాట్లాడానని.. తన కారును వదలాలన్నారు. కారు ముందు అడ్డుపెట్టిన భారీ వాహనం డ్రైవర్ పై ఫైర్ అయ్యారు. ‘నువ్వు ఎవడ్రా నన్ను ఆపడానికి.. ఇడియట్.. ముందు బండిని అడ్డు తియ్’ అంటూ వాహన డ్రైవర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మర్యాద లేదా? మీకు అంటూ సీరియస్ అయ్యారు.
రావులపాలెంలోని తమ పార్టీ నాయకుడి తల్లి ఇటీవలే మరణించారని.. కనీసం పరామర్శకు అయినా వెళ్లడానికి అనుమతించాలని వీర్రాజు కోరడంతో పోలీసులు అక్కడి వరకూ అనుమతించారు. దీంతో పరిస్థితి సద్దుమణిగింది.
[…] […]