JP Nadda Bjp KCR: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడినే అరెస్ట్ చేయించిన తెలంగాణ సీఎం కేసీఆర్ కు సెగ తగిలింది. ఏకంగా ఢిల్లీ నుంచి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డానే కదిలివచ్చి షాక్ ఇచ్చాడు. అంతేకాదు కేసీఆర్ హైదరాబాద్ లో ర్యాలీకి అనుమతి ఇవ్వకున్నా కూడా జేపీ నడ్డా తన పంతం నెగ్గించుకున్నాడు. పోలీసుల ఆంక్షల నడుమే శంషాబాద్ నుంచి సికింద్రాబాద్ చేరుకున్నారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులర్పించారు. నడ్డా వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తరుణ్ చుగ్ ఉన్నారు.

ఇక ఈరోజు ఉదయమే కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ స్వయంగా కరీంనగర్ జైలుకెళ్లి పరామర్శించి భరోసా కల్పించారు. ఈ క్రమంలోనే ఢిల్లీ నుంచి జేపీ నడ్డా దిగాడు. కేసీఆర్ ను ఇక ఎంత మాత్రం వదిలిపెట్టేది లేదని బీజేపీ డిసైడ్ అయినట్టు ఉంది.
జేపీ నడ్డా, కిషన్ రెడ్డి సహా నేతలు నిరసన ర్యాలీ తీసిన అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇక కేసీఆర్ తో ధర్మయుద్ధం చేస్తామని జేపీ నడ్డా సంచలన ప్రకటన చేశారు. ఉద్యోగులు, ప్రజల పక్షాన బీజేపీ పోరాడుతుందని అన్నారు. ఉద్యోగులకు మద్దతిచ్చేందుకే హైదరాబాద్ వచ్చినట్టు తెలిపారు. జీవో 317 ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉందన్నారు.
బండి సంజయ్ శాంతియుత నిరసన తెలిపితే పోలీసులు బీజేపీ ఆఫీసులోకి చొచ్చుకెళ్లి అరెస్ట్ చేస్తారా? అని జేపీ నడ్డా ఖండించారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం లేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ నియంతృత్వ పాలన కొనసాగుతోందన్నారు. వినాశకాలే విపరీత బుద్ది అని కేసీఆర్ పాలనకు చరమగీతం పాడుతామని హెచ్చరించారు.
ఇక కేసీఆర్ తో ధర్మయుద్ధాన్ని నిర్ణయాత్మక దశకు తీసుకెళుతామని.. జాతీయ పార్టీగా కేసీఆర్ ముసుగు తొలగిస్తామని.. టీఆర్ఎస్ ను ఓడించి చూపిస్తామంటూ జేపీ నడ్డా శపథం చేశారు.
బండి సంజయ్ అరెస్ట్ తో తెలంగాణలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బండి సంజయ్ ను అరెస్ట్ చేసి కేసీఆర్ పెద్ద తప్పు చేశాడా? అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జేపీ నడ్డా తెలంగాణ రాష్ట్ర పర్యటనకు ప్రాధాన్యత చోటు చేసుకుంది. ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్ అయితే జాతీయ అధ్యక్షుడు రావడంతో ఇది ఖచ్చితంగా టీఆర్ఎస్ సర్కార్ కు ఎసరేనని బీజేపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. కేసీఆర్ ను, కేటీఆర్ ఇక ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాన్ని బీజేపీ అవలంభించనుందని అన్నారు.