BJP- Janasena
BJP- Janasena: ఏపీలో అసలు బీజేపీ వ్యూహం ఏమిటి? జనసేనతో బంధం కొనసాగుతుందా? వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీతో కలిసి వెళుతుందా? లేకంటే కటీఫ్ చెబుతుందా? అసలు ఈ అనిశ్చితికి ఏపీ బీజేపీలో ఉన్న గ్రూపులే కారణమా? దీనిపై స్ఫష్టత ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఏపీలో అంతటా ఇదే హాట్ టాపిక్. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం బీజేపీ, జనసేన పొత్తుల వ్యవహారం, టీడీపీతో కలిసి నడిచే విషయంలో నేతల విభిన్న ప్రకటనలు కాషాయదళంలో కలవరపాటుకు కారణమవుతున్నాయి. అటు హైకమాండ్ సైతం దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళం కొనసాగుతోంది. దీనిపై స్పష్టమైన ప్రకటన చేయాలన్న బీజేపీ హార్ట్ కోర్ ఫ్యాన్స్ అభిమతాన్ని సైతం పెద్దలు పట్టించుకోవడం లేదు. ఏపీ బీజేపీకి దిశా నిర్దేశం చేయడం లేదు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో అంతర్మథనం…
ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అనూహ్య విజయాలను సొంతం చేసుకుంది. ఇప్పటివరకూ బీజేపీ ప్రాపకం కోసం ప్రయత్నించిన చంద్రబాబు వ్యూహం మార్చారు. బీజేపీని డిఫెన్స్ లో పడేశారు. అదే సమయంలో జనసేన, బీజేపీ మధ్య ఉన్న బంధానికి ఒక్క అడుగు ముందుకు పడలేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కనీస డిపాజిట్లు రాకపోవడంతో పార్టీలో అంతర్మథనం ప్రారంభమైంది. దీనికి జనసేన సహాయ నిరాకరణ కారణమన్న వాదన తెరపైకి వచ్చింది. తాము ఆశించిన స్థాయిలో జనసేన సపోర్టు చేయలేదన్న అసంతృప్తిని కొంతమంది నాయకులు వెళ్లగక్కారు. ఈ క్రమంలో ఒక్కొక్కరూ విభిన్న ప్రకటనలు చేశారు. కొందరు రాష్ట్ర నాయకత్వాన్ని తప్పుపట్టడం ద్వారా టీడీపీతో వెళ్లాలన్న భావన వచ్చేలా మాట్లాడారు. మరికొందరు జనసేనను కలుపుకొని వెళ్లడంలో రాష్ట్ర నాయకత్వం ఫెయిలైందన్న ఆరోపణలు చేశారు. మరికొందరైతే కలిసి వస్తే జనసేనతో, లేకుంటే ఒంటరిగా పోటీచేయాలన్న స్థిర నిర్ణయంతో పనిచేస్తున్నారు.
కాషాయ దళంలో కలుపు మొక్కలు..
ఏపీ బీజేపీలో మూడు వర్గాలున్నాయన్నది ప్రచారమే కాదు వాస్తవం కూడా. ఒక వర్గం టీడీపీ అనుకూలం. మరో వర్గం వైసీపీకి ఫేవర్ గా పనిచేస్తోంది. మరోవర్గం మాత్రం బీజేపీ సొంత కాలిపై ఎదగాలని కోరుకుంటోంది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో టీడీపీ ఇచ్చే సీట్లను తీసుకుంటే మంచిదని ఆ పార్టీ అనుకూలవర్గం భావిస్తోంది. అయితే మరోవర్గం మాత్రం చంద్రబాబు గతంలో చేసిన మిత్ర ద్రోహాన్ని గుర్తుచేసి వద్దంటోంది. మూడో వర్గం మాత్రం వస్తే జనసేనతో.. లేకుంటే ఒంటరిగా వెళదామని భావిస్తోంది. అయితే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం బీజేపీ సొంతగా ఎదగాలనే కోరుకుంటున్నారు. దీనినే సాకుగా చూపి.. టీడీపీతోపొత్తుకు సోము అడ్డంగా నిలుస్తున్నారని.. అది వైసీపీకి లాభం చేకూర్చేందుకేనని.. ఆయనపై వైసీపీ ముద్రపడేలా ప్రచారం చేస్తున్నారు. విష్ణుకుమార్ రాజు, పీవీఎన్ మాధవ్ లాంటి వారు మాత్రం టీడీపతో వెళితే వచ్చే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలతో సరిపెట్టుకోవాలని చూస్తున్నారు. దీంతో బీజేపీ శ్రేణులు చేస్తున్న విభిన్న ప్రకటనలతో కేడర్ అయోమయానికి గురవుతోంది,
BJP- Janasena
ఎవరి ఆలోచన వారిదే..
అయితే ఇదే చాన్స్ గా బీజేపీ, జనసేన మైత్రిని విడగొట్టాలన్న ప్లాన్ లో ఇతర పక్షాలు ఉన్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కడితే స్వీప్ చేస్తాయని జగన్ భయపడుతున్నారు. అది జరగకూడదని బలంగా భావిస్తున్నారు. టీడీపీ, జనసేన కూటమి కట్టినా తనకు ప్రతికూల ఫలితాలు వస్తాయని భావిస్తున్నారు. అదే జరిగితే బీజేపీ సాయం తన వైపు తిప్పుకోవాలన్నది జగన్ భావన, అటు చంద్రబాబు వ్యూహం కూడా అలానే ఉంది. కుదిరితే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి.. లేకుంటే బీజేపీ నుంచి జనసేనను దూరం చేసి తనలో కలుపుకోవాలన్నది వ్యూహం. ఈ పరిణామ క్రమంలో అటు వైసీపీ, ఇటు టీడీపీ అనుకూల బీజేపీ నేతలు తమ మాటలతో హీటెక్కిస్తున్నారు. బీజేపీ, జనసేన మైత్రిపై తీవ్ర ప్రభావం చూపుతున్నారు.