spot_img
Homeజాతీయ వార్తలుBJP Vs Congress: బీజేపీ గట్టునుంటావా...? కాంగ్రెస్‌ గట్టునా..?

BJP Vs Congress: బీజేపీ గట్టునుంటావా…? కాంగ్రెస్‌ గట్టునా..?

BJP Vs Congress: తెలంగాణ ఎన్నికలకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. వ్యూహాలు రచిస్తున్నాయి. ఎజెండాలు సిద్ధం చేసుకుంటున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ కొడతామంటుంటే.. బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం తామేనని.. అధికార పార్టీని గద్దె దించుతామని పేర్కొంటున్నారు. ఒక దశలో కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి.. బీఆర్‌ఎస్‌కు బీజేపీ ప్రత్యామ్నాయం అనేలా తెలంగాణలో పరిస్థితులు మారిపోయాయి. మూడేళ్లుగా వచ్చిన ఊపు మొత్తం.. కర్ణాక ఎన్నికల ఫలితాల తర్వాత క్రమంగా పడిపోతూ వస్తోంది. చేరికలు ఆగిపోయాయి. మరోవైపు కాంగ్రెస్‌ తరహా పరిస్థితి బీజేపీలో ఏర్పడింది. ఎవరికి వారు ప్రెస్‌మీట్లు పెట్టడం.. అధ్యక్షుడి మార్చాలని అధిష్టానంపై ఒత్తిడి తేవడం. సొంత పార్టీ నేతలపై విమర్శలు చేయడం వంటి ఘటనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో పడిపోయిన గ్రాఫ్‌ను మళ్లీ నిలపెట్టేందుకు తెలంగాణలో పార్టీకి మళ్లీ ఊపు తెచ్చేందుకు అధిష్టానం చర్యలు చేపట్టింది. నూతన అధ్యక్షుడిని నియమించింది. కొత్త ఇన్‌చార్జీలను నియమించింది. అయినా, బీజేపీలో కొంతమంది నేతలు పక్కచూపులు చూస్తున్నారు.

బీఆర్‌ఎస్‌తో దోస్తీపై అనుమానాలు..
బీజేపీతో ఢీ అంటే ఢీ అన్న బీఆర్‌ఎస్‌ ఇప్పుడు ఒక్క మాట అనడం లేదు. ప్రధాని నరేంద్రమోదీ వచ్చి కేసీఆర్‌ను, ఆయన కుటుంబాన్ని తిట్టిపోయినా కేసీఆర్, కేటీఆర్, కవిత మౌనంగా ఉన్నారు. కొంతమంది విమర్శించినా అవి పెద్దగా లెక్కలోకి రావు. ఇక బీజేపీ కూడా బీఆర్‌ఎస్‌పై మెతక వైకరి అవలంబిస్తోందన్న అనుమానాలు సొంత పార్టీలోనే వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ను దెబ్బకొట్టాలని బీజేపీలో చేరిన నేతలు ఇప్పుడు పార్టీ వీడేందుకు సమాయత్తమవుతున్నారు.

మోదీ విమర్శలతో పునరాలోచన..
మరోవైపు ఇటీవల వరంగల్‌కు వచ్చిన ప్రధాని మోదీ.. బీఆర్‌ఎస్‌ సర్కార్, కేసీఆర్‌ కుటుంబం, కవిత స్కాంల గురించి నేరుగా విమర్శలు చేశారు. తొమ్మిదేళ్లలో ఎన్నడూ కేసీఆర్‌ పేరు ఎత్తి విమర్శించలేదు. వరంగల్‌లో కేసీఆర్‌ను నేరుగా టార్గెట్‌ చేశారు. దీంతో బీజేపీ, బీఆర్‌ఎస్‌ మధ్య అవగాహన ఉందన్న అభిప్రాయం తొలగించే ప్రయత్నం చేశారు. అయినా.. కేసీఆర్‌ను గద్దె దించాలని బీజేపీలో చేరిన నేతల్లో పూర్తి నమ్మకం కలుగడం లేదు.

అమిత్‌షా రాక..
ఈనెలలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తెలంగాణకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు బీజేపీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీని వీడాలనుకుంటున్న నేతలు కాస్త ఆగాలని నిర్ణయించుకున్నారు. షా పర్యటన తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌వైపు చూపు..
బీజేపీలో ఉన్న నేతల్లో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వివేక్‌ వెంకటస్వామి, బూర నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి వీరంతా గతంలో ఎంపీలుగా పనిచేశారు. వివిధ పార్టీల నుంచి ఎంపీలుగా గెలిచినా.. తర్వాత పరిణామాలతో బీజేపీలో చేరారు. డీకే అరుణ, విజయశాంతి లాంటి నేతలు కూడా పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా టికెట్‌ ఆశించి వచ్చిన వారు కూడా బీజేపీ గ్రాఫ్‌ పడిపోతుండడంతో కాంగ్రెస్‌వైపు చూస్తున్నారు. కొంతమంది బీఆర్‌ఎస్‌లో చేరాలని కూడా ప్రయత్నిస్తున్నారు. దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు కూడా బీఆర్‌ఎస్‌వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి నుంచి బీజేపీలో ఉన్న నేతలు మాత్రమే ఇప్పుడు మౌనంగా ఉన్నారు. ఏది ఏమైనా ఈ నెలాఖరు నాటికి కొంత మంది పార్టీని వీడతారని కమలం పార్టీలో చర్చ జరుగుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version