KCR Vs BJP And Congress: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రానికి విల్‌గా చూపేందుకు.. ఆయన కారణంగానే రాష్ట్రం నష్టపోతుందని నిరూపించేందుకు రాష్ట్రంలో విపక్ష బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ‘కేసీఆర్ బూచి’ అని నమ్మిస్తే.. ఆ తర్వాత.. బూచితోలోపాయికారీ పొత్తు పెట్టుకున్నారనే.. మరొక రాజకీయ ప్రత్యర్థిని కూడా బద్నాం చేయవచ్చుననేది వారి వ్యూహం. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలుఇదే వ్యూహంతో పనిచేస్తున్నాయి.
త్రిముఖ పోరేనా..
తెలంగాణ రాజకీయాల్లో ప్రముఖంగా త్రిముఖపోరు కనిపిస్తోంది. ప్రతీ పార్టీ కూడా మిగిలిన రెండు పార్టీలను స్నేహితులుగా ముడిపెట్టి విమర్శలు చేస్తోంది. మేము తప్ప మిగిలిన ఇద్దరూ పరిపాలనకు పనికిరారు అని చెప్పడం వరకు.. త్రిముఖ పోటీలో సర్వసాధారణంగా జరిగే సంగతి. అయితే, ‘నేను తప్ప మిగిలిన ఇద్దరూ లోపాయికారీ ఒప్పందాలను కుదుర్చుకుని, మమ్మల్ని ఓడించడానికి కుట్ర చేస్తున్నారు’ అనే ప్రచారం మూడు పార్టీలు చేస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ– భారత రాష్ట్ర సమితి మధ్య అపవిత్రమైన అప్రకటిత లోపాయికారి పొత్తు ఉన్నదని కాంగ్రెస్ తొలి నుంచి ఆరోపిస్తూనే ఉంది. మోదీ∙వ్యూహం మేరకే కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పావులు కదుపుతున్నారనేది కాంగ్రెస్ ఆరోపణ. జాతీయస్థాయిలో మోదీని గద్దెదించటానికి ఏర్పాటు అయిన విపక్ష కూటమిలోకి బీఆర్‌ఎస్‌ను రానివ్వబోమని, కూటమిలోకి కేసీఆర్ ను ఆహ్వానిస్తే కాంగ్రెస్ పార్టీ ఆ కూటమికి దూరంగా ఉంటుందని, తాము ముందే హెచ్చరించామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తాజాగా ఖమ్మం సభలో కూడా ప్రకటించారు. అదే సమయంలో, బీఆర్‌ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నాయి అంటూ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాను కూడా కల్వకుంట్ల చంద్రశేఖర రావే ఫైనలైజ్ చేస్తారని, ఎందుకంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత వారిని బీఆర్‌ఎస్ లో చేర్చుకుంటారని విమర్శిస్తోంది.
బీఆర్‌ఎస్‌పైనే నిందలు..
బీజేపీ– కాంగ్రెస్ రెండూ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని.. ఆ ఇద్దరూ తమను ఓడించడానికే అక్రమసంబంధం పెట్టుకున్నారనే మాట మాత్రం బీఆర్‌ఎస్ నుంచి రావడం లేదు. విపక్ష కాంగ్రెస్, బీజేపీ రెండు బీఆర్‌ఎస్‌ను టార్గెట్ చేస్తున్నాయి. ఆ పార్టీపైనే నిందలు వేస్తున్నాయి. కుమ్మకు రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయి. వీటిని తిప్పి కొట్టేందుకు తాము ఎవరికీ ఏ టీం కాదు.. బీ టీం కాదని బీఆర్‌ఎస్ నేతలు అంటున్నారు. తాము తెలంగాణ ప్రజలకు మాత్రమే ఏ టీం అని పేర్కొంటున్నారు. అంతేకాకుండా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఒకే తాను ముక్కలు అన్న విమర్శలు చేస్తూ రెండు పార్టీల పాలనతో దేశంలో అభివృద్ధి శూన్యమని పేర్కొంటున్నారు.