మున్సి‘పోరులో’ కనిపించని బీజేపీ అడ్రస్‌.. పొత్తుపై జనసేనాని దీర్ఘాలోచన

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన-–బీజేపీ పొత్తులో భాగంగా దాదాపు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో బరిలోకి దిగారు. అయితే.. ఇద్దరు మిత్రపక్షంగా పోటీలో నిలిచినా జనసేన చాలా చోట్లనే ఖాతా తెరిచింది. కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న అమలాపురం, నర్సాపురం లాంటి చోట్ల.. నాలుగైదు స్థానాలు గెల్చుకుని తన బలాన్ని చాటింది. కార్పొరేషన్లలోనూ ఖాతా తెరిచింది. అయితే.. బీజేపీ మాత్రం ఎక్కడా ఉనికి చాటుకోలేకపోయింది. విశాఖపట్నం కార్పొరేషన్‌లో జనసేన మద్దతుతో అతి కష్టం మీద ఒక […]

Written By: Srinivas, Updated On : March 15, 2021 2:11 pm
Follow us on


ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన-–బీజేపీ పొత్తులో భాగంగా దాదాపు అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, కార్పొరేషన్లలో బరిలోకి దిగారు. అయితే.. ఇద్దరు మిత్రపక్షంగా పోటీలో నిలిచినా జనసేన చాలా చోట్లనే ఖాతా తెరిచింది. కాపు సామాజికవర్గం అత్యధికంగా ఉన్న అమలాపురం, నర్సాపురం లాంటి చోట్ల.. నాలుగైదు స్థానాలు గెల్చుకుని తన బలాన్ని చాటింది. కార్పొరేషన్లలోనూ ఖాతా తెరిచింది. అయితే.. బీజేపీ మాత్రం ఎక్కడా ఉనికి చాటుకోలేకపోయింది. విశాఖపట్నం కార్పొరేషన్‌లో జనసేన మద్దతుతో అతి కష్టం మీద ఒక డివిజన్‌ను బీజేపీ గెలుచుకోలిగింది. ఇంకెక్కడా పార్టీ పెద్దగా ప్రభావం చూపలేదు.

బీజేపీకి పెద్దగా చెప్పుకోదగ్గ క్యాడర్‌‌ లేదు. దీంతో ఆ పార్టీ ఓటమికి ఓ కారణం అయితే.. పూర్తిగా జనసేన మీద ఆధారపడి వాటి ఓట్లను పొంది గెలుపొందుతామనే ప్రయత్నమే మరో కారణంగా కనిపిస్తోంది. అయితే.. జనసేన క్యాడర్ మాత్రం బీజేపీని నమ్మలేదు. ఆ విషయం ఓటింగ్‌లో తేలిపోయింది. ఇప్పుడు అది జనసేనకు ఇబ్బందికరంగా మారింది. బీజేపీని తమ భుజంపై మోసుకుని సీట్లు గెలిపించాల్సిన పరిస్థితి వస్తోందని జనసేన క్యాడర్ నిరాశలో నిండిపోయింది.

ఏపీ బీజేపీ నేతలు.. వైసీపీకి మద్దతుగా ఉంటుండటం.. వైసీపీ నేతలు జనసేనను దారుణంగా ట్రీట్ చేస్తుండటంతో పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఏపీలో బీజేపీతో పొత్తు విషయంపైనా పవన్ కల్యాణ్ పునరాలోచించుకోవాల్సిన పరిస్థితిని.. ఈ ఎన్నికలు సూచిస్తున్నాయని కొంత మంది విశ్లేషిస్తున్నారు. ఈ అంశంపై సీరియస్‌గా ఆలోచించాలని పార్టీ క్యాడర్‌ నుంచి జనసేన నాయకత్వానికి ఫీడ్ బ్యాక్ వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.

అందుకే.. ఇప్పుడు జనసేన అధినేత దీర్ఘాలోచనలో పడినట్లుగా తెలుస్తోంది. బీజేపీతో పొత్తు కొనసాగించడమా..? తప్పుకోవడమా..? అనేది తేల్చాల్సి ఉంది. అంతేకాదు.. ఒకవేళ బీజేపీతో పొత్తు వదులుకుంటే ఏంటి పరిస్థితి..? బీజేపీతో పొత్తు కొనసాగిస్తే పార్టీ భవితవ్యం ఏంటి..? అనే ఆలోచన ఇప్పుడు క్యాడర్‌‌ను సైతం వేధిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటోందో చూస్తున్న జనసేన లీడర్లు కూడా పొత్తు విషయమై పునరాలోచన చేయాలనే తమ అధినేత పవన్‌కు చెబుతున్నారట. దీనిపై పవన్ ఎలా స్పందిస్తారో చూడాలి మరి.