https://oktelugu.com/

BJP ads : గూగుల్ ను గుత్తకు పట్టిన బీజేపీ.. ఎన్నికల యాడ్స్ కు ఎన్ని కోట్లు ఇచ్చిందో తెలుసా?

అయితే ఈ సంస్థ సైట్ల కు చెల్లించే డబ్బు విషయంలో శీత కన్ను ప్రదర్శిస్తోందనే ఆరోపణలున్నాయి. కొన్ని మీడియా సంస్థలు అప్పట్లో గూగుల్ కు వ్యతిరేకంగా కోర్టుకు కూడా వెళ్లాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు గూగుల్ కు భారీగానే జరిమానా విధించింది.

Written By:
  • NARESH
  • , Updated On : April 26, 2024 8:54 pm
    ఎండ మండుతోంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

    ఎండ మండుతోంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

    Follow us on

    BJP ads : “స్మశానం ముందు ముగ్గు.. రాజకీయ నాయకులకు సిగ్గు.. ఉండవని” అప్పట్లో విడుదలైన ఓ తెలుగు సినిమాలో ఓ డైలాగు చాలా పాపులర్. ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ఇది సరిగ్గా సరిపోతుంది. పేరుకు నీతులు చెప్తారు, నియమాలు వివరిస్తారు, నిబంధనలు పాటించాలని అంటారు. కానీ వాస్తవ పరిస్థితికి వచ్చేసరికి ఎవరూ పట్టించుకోరు. అంతా బభ్రజమానం భజగోవిందం. ప్రస్తుతం దేశంలో ఎన్నికల వాతావరణం తారాస్థాయికి చేరిన నేపథ్యంలో.. రాజకీయ పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నాయి. ఒక పార్టీపై మరొక పార్టీ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. ఇది సరిపోదన్నట్టుగా సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం సాగిస్తున్నాయి.

    ఇక ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ వినియోగం పెరిగిపోయిన నేపథ్యంలో.. ప్రధాన మీడియా కంటే డిజిటల్ మీడియా హవా విపరీతంగా ఉంది. డిజిటల్ మీడియాలో గూగుల్ దే గుత్తాధిపత్యం. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఎన్నికలను పురస్కరించుకొని ఆ కంపెనీకి యాడ్స్ రూపంలో భారీగా కట్టబెట్టాయి. అందులో భారతీయ జనతా పార్టీది ప్రధాన వాటా. గత పదేళ్లు అధికారంలో ఉన్న ఆ పార్టీ.. ప్రస్తుత ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే అందివచ్చిన ఏ అవకాశాన్ని కూడా వదులుకోవడం లేదు. ఇప్పటికే మీడియాలో విపరీతంగా ప్రకటనలు ఇస్తోంది. డిజిటల్ మీడియాలోనూ అదే ఒరవడి కొనసాగిస్తోంది. కేవలం గూగుల్, యూట్యూబ్ సంస్థలకే 101 కోట్లు ఖర్చు చేసిందని నివేదికల ద్వారా తెలుస్తోంది. గత పది సంవత్సరాలలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ చేపట్టిన పథకాలు, సాధించిన విజయాలు, తీసుకొచ్చిన కొత్త చట్టాలు, రద్దుచేసిన చట్టాలను ప్రముఖంగా ప్రస్తావిస్తూ బిజెపి ప్రచారం చేస్తోంది. ఇక భారతీయ జనతా పార్టీ తర్వాత కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే, ఐపాక్ వంటి సంస్థలు ఇదే స్థాయిలో ఖర్చు చేశాయట. ఇవి మూడు చేసిన ఖర్చుకు.. బిజెపి చేసిన ఖర్చు సమానమట. 2018 మే 31 నుంచి 2024 ఏప్రిల్ 25 మధ్య పబ్లిష్ అయిన గూగుల్ యాడ్స్ లో బిజెపి వాటా 26% గా ఉంది. ఈ యాడ్స్ కోసం కాంగ్రెస్ 45 కోట్లు, డీఎంకే 42 కోట్లు, ఐ ప్యాక్ 24 కోట్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది.

    ఇక అప్పట్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి కూడా భారీగానే ఖర్చు చేసింది. ఎంత ఖర్చు చేసిందనే వివరాలు బయటికి రాకపోయినప్పటికీ.. అది కూడా దాదాపు 45 నుంచి 50 కోట్ల వరకు గూగుల్ కు యాడ్స్ రూపంలో చెల్లించిందని వార్తలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు 30 నుంచి 35 కోట్ల వరకు వెచ్చించిందని సమాచారం. భారతీయ జనతా పార్టీ కూడా 40 కోట్ల వరకు ఖర్చు పెట్టిందని తెలుస్తోంది. స్థూలంగా ఎన్నికలవేళ గూగుల్ సంస్థ యాడ్స్ రూపంలో భారీగానే దండుకుంటున్నది. అయితే ఈ సంస్థ సైట్ల కు చెల్లించే డబ్బు విషయంలో శీత కన్ను ప్రదర్శిస్తోందనే ఆరోపణలున్నాయి. కొన్ని మీడియా సంస్థలు అప్పట్లో గూగుల్ కు వ్యతిరేకంగా కోర్టుకు కూడా వెళ్లాయి. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు గూగుల్ కు భారీగానే జరిమానా విధించింది.