https://oktelugu.com/

China Sparrow War : కాకలు తీరిన అమెరికా కూడా చైనాను ఏం చేయలేకపోయింది.. ఓ పిచ్చుక మాత్రం గుణపాఠం నేర్పింది

ప్రకృతితో మనిషి అనేవాడు మమేకం కావాలి. అంతే తప్పించి ప్రకృతి మీద పెత్తనం చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. వీచే గాలి, పెరిగే వృక్షం, వికసించే పుష్పం, కాచే కాయ, పక్వానికి వచ్చిన ఫలం, ఎగిరే పక్షి, సయ్యాటలాడే తూనీగ.. ఇలా ప్రతి ఒక్కటీ మనిషి మనగడకు అవసరమే.

Written By:
  • NARESH
  • , Updated On : April 26, 2024 / 08:33 PM IST

    China Sparrow War

    Follow us on

    China Sparrow War : ఆకాశాన్ని తాకే భవంతులు.. అంతకుమించి అనేలాగా రహదారులు.. ఐఫోన్ నుంచి మొదలు పెడితే ఆట వస్తువుల వరకు తయారీ కేంద్రాలు.. అపారమైన మానవ వనరులు. బుల్లెట్ ట్రైన్ లు.. ఇలా చెప్పుకుంటూ పోతే చైనా గురించి చాలానే ఉంది. ఇతర దేశాలను ఇబ్బంది పెడుతుంది, సరిహద్దులను కబలిస్తుంది, ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేస్తుంది.. ఇలా ఎన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ.. అమెరికాను సవాల్ చేసే ఆర్థిక వ్యవస్థ.. సాధన సంపత్తి చైనా సొంతం. రష్యా వల్ల కానిది, జర్మనీ సాధించలేనిది, ఇంగ్లాండ్ ఒడిసి పట్టుకోలేనిది, అరబ్ దేశాలకు చేతకానిది డ్రాగన్ వల్ల అయింది. అందుకే చైనా అంటేనే అమెరికా మండిపడుతుంది. ఆ దేశంపై కారాలు మిరియాలు నూరుతుంది. మరి అంతటి దేశాన్ని అమెరికా ఏం చేయలేకపోయింది. కానీ, ఓ పిచ్చుక మాత్రం గుణపాఠం నేర్పింది. ఇంతకీ ఏం జరిగిందంటే..

    సరిగ్గా 66 సంవత్సరాల క్రితం చైనా దేశం పిచ్చుకలపై యుద్ధాన్ని ప్రకటించింది. ఇందుకు కారణమేంటంటే.. చైనాలో జనాభా అధికంగా ఉంటుంది. వారి అవసరాల తగ్గట్టుగా ఆహార ధాన్యాలు అవసరం. లేకుంటే దేశంలో ఆకలి చావులు తప్పవు. అప్పట్లో చైనాలో ఒక స్థాయిలో మాత్రమే పంటలు పండేవి. హైబ్రిడ్ వంగడాలపై అప్పుడప్పుడే పరిశోధనలు జరుగుతున్నాయి.. ఇంకా వాటి ఫలాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులో రాలేదు. అప్పట్లో చైనాలో పిచ్చుకలు విపరీతంగా ఉండేవి. అవి ఎక్కువగా వరి, సజ్జలు, రాగులు, మొక్కజొన్న వంటి ధాన్యపు జాతికి చెందిన పంటలపై విపరీతంగా వాలేవి. ఆ ధాన్యాన్ని తినేవి. ఇలా ఒక సంవత్సరంలో ఒక పిచ్చుక 6.5 కిలోల ధాన్యాన్ని తింటున్నదని అక్కడి పాలకులకు అధికారులు ఒక నివేదిక అందించారు. ఈ ధాన్యాన్ని కాపాడితే సుమారు 60,000 మందిని క్షుద్బాధ నుంచి తప్పించవచ్చనేది చైనా ప్రభుత్వం ఆలోచన. ఇంకేముంది ఆపరేషన్ మొదలైంది. చైనా ప్రభుత్వం చిన్న ప్రాణిపై యుద్ధాన్ని ప్రకటించింది. అలా 30 లక్షల పిచ్చుకలను చంపించింది. పిచ్చుకలు చెట్లపై వాలకుండా డబ్బాలతో కొట్టి వాటిని పారదోలింది. వాటి గుడ్లను పగలగొట్టింది. ఇలా పిచ్చుకలను చంపడంతో పంటలకు పురుగు పట్టింది. చీడపీడలు పంట మొక్కలను సర్వనాశనం చేశాయి. ఫలితంగా దిగుబడి గణనీయంగా తగ్గింది. దీంతో ఆ దేశంలో తీవ్రమైన కరువు ఏర్పడింది. ఎన్ని రకాల రసాయనాలు వాడినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. సుమారు 4.5 కోట్ల మంది ఆకలితో చనిపోయారు.

    దీంతో పిచ్చుక ఉపయోగం ఏంటో చైనాకు తెలిసొచ్చింది. పిచ్చుకలను చంపితే ఆ ప్రభావం పంటలపై ఏవిధంగా పడుతుందో.. అది అంతిమంగా దేశాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తోందో అర్థమైంది. గత్యంతరం లేక.. మరో మార్గం తెలియక.. రష్యా శరణుజొచ్చింది. ఆ దేశం నుంచి ప్రత్యేక విమానాల ద్వారా కొన్ని వేల పిచ్చుకలను దిగుమతి చేసుకుంది. కొన్ని అక్కడి వాతావరణం తట్టుకోలేక చనిపోతే.. ప్రత్యేకమైన ఇంక్యుబేటర్లు ఏర్పాటు చేసి పిచ్చుకల జాతిని పరిరక్షించింది. ఫలితంగా పంటలపై చీడపీడల ఉధృతి తగ్గింది. పురుగుల బెడద నిలిచిపోయింది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు పిచ్చుకల జోలికి చైనా వెళ్లలేదు. అందుకే అభివృద్ధి ఒక్కటే తారక మంత్రం కాదు. ప్రకృతితో మనిషి అనేవాడు మమేకం కావాలి. అంతే తప్పించి ప్రకృతి మీద పెత్తనం చేస్తే పరిస్థితి ఇలాగే ఉంటుంది. వీచే గాలి, పెరిగే వృక్షం, వికసించే పుష్పం, కాచే కాయ, పక్వానికి వచ్చిన ఫలం, ఎగిరే పక్షి, సయ్యాటలాడే తూనీగ.. ఇలా ప్రతి ఒక్కటీ మనిషి మనగడకు అవసరమే.