https://oktelugu.com/

Summer : ఎండ మండుతోంది.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..

ఇలాంటి సమయంలో కచ్చితంగా వారిని చల్లని ప్రాంతానికి తీసుకెళ్లాలి. కాటన్ దుస్తులు వేయాలి. వాంతులు చేసుకుంటుంటే పక్కకు పడుకోబెట్టాలి. ఫ్యాన్ లేదా కూలర్ వంటివి వేసి శరీరాన్ని చల్లపరచాలి. తడి దుస్తులతో వారి శరీరాన్ని తుడిస్తే ఉష్ణోగ్రత తగ్గుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : April 26, 2024 / 08:57 PM IST

    Precautions in summer

    Follow us on

    Summer : ఎండలు మండుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి సూర్యుడు నిప్పు కణికలాగా సెగలు కక్కుతున్నాడు. దేశం మొత్తం ఇదే తీరుగా వాతావరణం ఉంది.. 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవుతోంది.. కొన్నిచోట్ల 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది.. దీనిని హీట్ వేవ్ అని పిలుస్తుంటారు. సాధారణంగా మైదాన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు మించిపోతే దానిని హీట్ వేవ్ అని పిలుస్తారు. మనదేశంలో హిమాలయ పర్వతాల పరిధిలో ఉన్న రాష్ట్రాలు కూడా హీట్ వేవ్ పరిస్థితులకు గురవుతున్నాయంటే వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వాతావరణం వల్ల డిహైడ్రేషన్, హీట్ క్రాంప్స్, హీట్ స్ట్రోక్ ల వంటివి చోటుచేసుకుంటాయి.

    హీట్ క్రాంప్స్

    ఎడెర్నా వాపు, మూర్చ వంటి లక్షణాలు కనిపిస్తాయి. జ్వరం 102 డిగ్రీల కంటే తక్కువగానే ఉంటుంది. రోగిలో నిసత్తువ కనిపిస్తుంది. నీరసం ఉంటుంది. కనీసం లేచి అడుగు తీసి అడుగు కూడా వేయలేరు.

    హీట్ ఎగ్జాషన్

    ఎండ ప్రభావానికి గురైన వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. అలసట ఉంటుంది. శరీరం బలహీనతకు గురవుతుంది. తల తిరుగుతుంది. భరించలేని తలనొప్పి ఇబ్బంది పెడుతుంది. ఏది తిన్నా వికారం, వాంతులవుతుంటాయి. కండరాలు తిమ్మిరి పడుతుంటాయి. విపరీతంగా చెమటలు వస్తుంటాయి.

    హీట్ స్ట్రోక్

    ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ అంటే 104 డిగ్రీల ఫారన్ హీట్ లేదా అంతకంటే ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మతిమరుపు లక్షణాలు కనిపిస్తాయి. మూర్చ లేదా కోమ వంటివి సంభవిస్తాయి. ఇది ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. సకాలంలో ఆసుపత్రికి వెళ్ళకుంటే ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది.

    పై మూడింటికి గురైనప్పుడు.. దాహం వేయకపోయినప్పటికీ తగినంత నీరు తాగాలి. ముఖ్యంగా మధ్యాహ్నం 11 గంటల నుంచి సాయంత్రం మూడున్నర వరకు బయటకు వెళ్ళకూడదు. ఎటువంటి పనీ చేయకూడదు. మధ్యాహ్నం రెండు నుంచి నాలుగు మధ్య వంటలు చేయకూడదు. కాలినడకన బయటికి వెళ్లకూడదు. తేలికైన లేదా లేత రంగు, వదులుగా ఉన్న దుస్తులను ధరించాలి. వేడి ఎక్కువగా ఉన్నప్పుడు కఠినమైన పనులు చేయకూడదు. ప్రయాణాలు చేసేటప్పుడు వాటర్ బాటిల్ పక్కన ఉంచుకోవాలి. ఆల్కహాల్, టీ, కాఫీలు, కూల్ డ్రింక్స్ కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి కార్బోనేటెడ్ శీతల పానీయాలు. ఇవి శరీరాన్ని త్వరగా డీహైడ్రేట్ చేస్తాయి. బయటకు వెళ్ళేటప్పుడు టోపీ లేదా గొడుగు తప్పక ఉపయోగించాలి. తల, మెడ, ఇతర శరీర భాగాలపై తడి వస్త్రాన్ని ఉంచుకుంటే వేడి నుంచి కొంతలో కొంత ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ, నిమ్మరసం, ఇతర పండ్ల రసాలను తీసుకుంటే శరీరానికి సత్వర శక్తి లభిస్తుంది.

    చిన్నపిల్లల్లో..

    ఎండ వల్ల చిన్న పిల్లలు తీవ్రంగా ఇబ్బంది పడతారు. బయటికి చెప్పలేరు గాని.. వారిలో తీవ్రమైన అలసట ఉంటుంది. కండరాలు నొప్పులు పెడుతుంటాయి. ఎక్కువగా చెమటలు పోస్తుంటాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటారు. తలనొప్పి, తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాంతులు కూడా చేసుకుంటారు. ఇలాంటి సమయంలో కచ్చితంగా వారిని చల్లని ప్రాంతానికి తీసుకెళ్లాలి. కాటన్ దుస్తులు వేయాలి. వాంతులు చేసుకుంటుంటే పక్కకు పడుకోబెట్టాలి. ఫ్యాన్ లేదా కూలర్ వంటివి వేసి శరీరాన్ని చల్లపరచాలి. తడి దుస్తులతో వారి శరీరాన్ని తుడిస్తే ఉష్ణోగ్రత తగ్గుతుంది.