ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడ లాడిస్తుంటే రాష్ట్రంలో మాత్రం రాజకీయ వేడి రగిలింది. ఇందుకు కారణం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ తొలగింపు, ఆయన స్థానంలో కె.కనగరాజ్ ను నియమించడమే. ఆ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం పాత్రతో పాటు రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ పాత్ర కీలకంగా ఉంది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలం కుదింపు ఆర్డినెన్స్ కు ఆమోదం తెలిపిన గవర్నర్ అధికార పార్టీ మినహా మిగిలిన అన్ని పార్టీల విమర్శలు ఎదుర్కొంటున్నారు.
సొంత పార్టీ బీజేపీ నాయకులు సైతం గవర్నర్ తీరును తప్పు పట్టారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బిశ్వ భూషణ్ తీరుపై బహిరంగంగానే విమర్శలు ఎక్కుపెట్టారు. గవర్నర్ గా బీజేపీ సీనియర్ నాయకుణ్ని కేంద్రం నియమిచడంతో తొలుత ఆ పార్టీ రాష్ట్ర నాయకులు సంతోషించారు. రాష్ట్రంలో తమకు అండగా ఉంటాడని భావించారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం కుదిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్ను వెంటనే ఆమోదించి పంపడాన్ని ఆ పార్టీ జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ అంశాన్ని పార్టీ జాతీయ నాయకుల దృష్టిలో పెట్టునున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ ఇది సరైన చర్య కాదంటుంది. ఈ మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా గవర్నర్ కు లేఖ రాశారు. ప్రభుత్వం పొరపాటు చేసినా ఉన్నత స్థానంలో ఉన్న గవర్నర్ దానిని సరిదిద్దాలే తప్ప ఇటువంటి నిర్ణయాలను వెంటనే ఆమోదించడం తగదంటున్నారు. సీపీఐ ఈ విషయంలో గవర్నర్ తీరును తప్పు పట్టింది.
రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ నిస్పాక్షికంగా వ్యవహరించ కుండా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విపక్షాలు ముక్తకంఠంతో చెబుతున్నాయి. గతంలో నరసింహన్ గవర్నర్ గా ఉన్న సమయంలో ఏపీ ప్రభుత్వం చుక్కల భూముల ఆర్డినెన్స్ పంపగా ఇది ప్రజల సమస్య పరిష్కారించే విధంగా లేదని తిరస్కరించారు. అదేవిధంగా జిల్లా స్థాయిలో ఎసైన్మెంట్ కమిటీల మార్పులను, ఇతర పలు అంశాలను ఆయన వ్యతిరేకించారు. ప్రభుత్వం పంపే అన్ని ఆర్డినెన్స్ లు గవర్నర్ ఆమోదించాల్సిన అవసరం లేదని, దాని వల్ల ప్రజలకు ఈమేరకు ప్రయోజనం కలుగుతుందనే అంశాన్ని పశీలించాల్సిన అవసరం ఉందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. ఎస్.ఈ. సీ ఆర్డినెన్స్ విషయంలో అలా జరగలేదని ఆరోపిస్తున్నాయి.