
మొత్తం ప్రపంచం అంతా కరోనా మహమ్మారిని కట్టడం చేయడంపై దృష్టి సారిస్తూ ఉండగా ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి మాత్రం తన దృష్టి మొత్తాన్ని ఈ వైరస్ కారణంగా గత నెలలో రాష్త్ర ఎన్నికల కమీషనర్ రమేష్ కుమార్ ఆరు నెలలపాటు వాయిదా వేసిన స్థానిక సంస్థల ఎన్నికలను హడావుడిగా పూర్తి చేయడం పైననే దృష్టి సారిస్తున్నట్లు కనబడుతున్నది.
కరోనా పేరుతో ఆయన ప్రభుత్వం చేస్తున్న ప్రతి పని కూడా ఈ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే చేస్తున్నట్లు స్పష్టం అవుతున్నది. ఒక వంక రాష్ట్రంలో వైరస్ తీవ్రత తక్కువగా ఉన్నదని లేదా తగ్గుముఖం పట్టినదనే అభిప్రాయం కలిగించడం ద్వారా ఎన్నికలకు సానుకూల వాతావరణం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవంక ఎన్నికల నిర్వహణకు అడ్డంకిగా ఉన్న రమేష్ కుమార్ ను ఆ పదవి నుండి తొలగించారు. వాస్తవానికి ఆయన స్థానంలో ఎన్నికల కమీషనర్ గా నియమించిన జస్టిస్ కనగరాజ్ ను ఆర్డినెన్సు జారీ చేయడానికి నాలుగు రోజుల ముందే చెన్నై నుండి విజయవాడకు ఒక కారులో తీసుకు వచ్చారు. ఆయనను విజయవాడలో ఒక స్టార్ హోటల్ లో ఉంచి, ముందుగానే గవర్నర్ ను కూడా సంప్రదించి పగడ్బందీగా వ్యూహం రూపొందించారు.
ఆఘమేఘాల మేడం మొత్తం వ్యవహారం కొద్దీ గంటలలో పూర్తయ్యే విధంగా చేయడం ద్వారా ముందే రమేష్ కుమార్ కోర్ట్ ను ఆశ్రయించి స్టే తీసుకు రాకుండా చేయగలిగారు. ఇప్పుడు కూడా ఆర్డినెన్సు పై కోర్ట్ నుండి స్టే తీసుకు వచ్చే లోగానే ఎన్నికల పక్రియ పూర్తిచేసే ఆలోచనలు చేస్తున్నారు.
వైసిపి అభ్యర్థుల ద్వారా ఇంటింటికి నగదు, బియ్యం పంపిణి చేయించడం గాని, ఇప్పుడు ఇంటికి మూడు మాస్క్ ల పంపిణి గాని అన్నిన్నిట్నీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే చేస్తున్నారు.
గత ఎన్నికల కమీషనర్ ఎన్నికలను వాయిదా వేయడమే గాని రద్దు చేయక పోవడంతో ఇప్పుడు వారం రోజుల వ్యవధిలో మొత్తం పక్రియను పూర్తి చేయవచ్చని భావిస్తున్నారు. అయితే అందుకు ప్రధాన అడ్డంకిగా ఉన్న లాక్ డౌన్ సడలింపుకు జగన్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు.
సాధారణంగా స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎక్కువగా అధికార పక్షాలకే అనుకూలంగా ఉంటుంది. జగన్ ఎందుకని ఇంతగా ఖంగారు పడుతున్నారో అర్ధం కావడం లేదు. ఇప్పుడు కమీషనర్ మార్పుపై హై కోర్ట్ జోక్యం చేసుకొంటే తప్పా పది రోజులలో ఎన్నికల పక్రియను పూర్తి చేయడానికి నూతన కమీషనర్ కార్యాచరణకు దిగే అవకాశం ఉంది.