Puran Kumar Case: శాంతి భద్రతలను పర్యవేక్షించే బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంటుంది. అందువల్లే సమాజం పోలీస్ శాఖను భిన్నంగా చూస్తుంటుంది. పోలీస్ శాఖలో అంతర్గతంగా కుమ్ములాటలు దారుణంగా ఉంటాయి. ఇవి కింది స్థాయికి మాత్రమే పరిమితం కావు. పై స్థాయిలో ఇంకా అపరిమితంగా ఉంటాయి. కాకపోతే అవి అంతగా వెలుగులోకి రావు. కొన్ని సందర్భాల్లో వెలుగులోకి వచ్చిన తర్వాత ఆ సంఘటన తాలూకు దారుణాలు ఒక్కొక్కటిగా బయటపడుతుంటాయి. ఇప్పుడు హర్యానా రాష్ట్రంలో ఐపీఎస్ అధికారి పూరన్ వ్యవహారం కూడా ఇలాంటిదే.
తెలంగాణ ప్రాంతానికి చెందిన పూరన్ అనే వ్యక్తి ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్నారు. ఇటీవల పూరన్ ఆత్మహత్య చేసుకున్నారు. అతని ఆత్మహత్యకు కుల వివక్ష కారణమని ఆరోపణలు వినిపించాయి. దీంతో హర్యానా ప్రభుత్వం డీజీపీని, ఎస్పీని మార్చేసింది. పూరన్ ఆత్మహత్య చేసుకునే క్రమంలో డీజీపీకి, ఎస్పీకి ఫోన్ చేశారని.. వారు పట్టించుకోకపోవడం వల్లే ఆయన ఆధారానికి పాల్పడ్డారని పూరన్ భార్య కేసు పెట్టింది. ఈ విషయం రాజకీయంగా సంచలనంగా మారింది. దీనికి తోడు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్యానా వెళ్లారు. పూరన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. జరిగిన దారుణంపై విచారణ సాగించాలని డిమాండ్ చేశారు. రాజకీయంగా ఈ వ్యవహారం సంచలనం కావడంతో హర్యానా ప్రభుత్వం కూడా వెంటనే చర్యలకు ఉపక్రమించింది. అయితే పూరన్ వ్యవహారంలో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది..
పూరన్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఏఎస్ఐ సందీప్ కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో సందీప్ భార్య ఫిర్యాదు చేయడంతో
పూరన్ భార్య అమ్నీత్ (ఐఏఎస్), బావమరిది అమిత్ రట్టన్ (ఎమ్మెల్యే), సెక్యూరిటీ అధికారి సుశీల్, మరో అధికారి పై పోలీసులు కేసు నమోదు చేశారు. సందీప్ ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు సెల్ఫీ వీడియో, ఇతర పత్రాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. అతడు సంపాదించిన ఆస్తులపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. పూరన్ కుటుంబ సభ్యులపై కేసు పెట్టేంత వరకు సందీప్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించొద్దని అతని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. వారు ఆందోళన చేయడంతో పోలీసులు కూడా పూరన్ కుటుంబ సభ్యులపై కేసు పెట్టిన తర్వాతే.. సందీప్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించారు. సందీప్ ఆత్మహత్య తర్వాత పూరన్ కేసు ఒక్కసారిగా మారిపోయింది.
రోహ్ తక్ ఐజిగా పూరన్ కొనసాగుతున్నారు. ఆయనను పిటిసికి ఇటీవల బదిలీ చేశారు. దీంతో ఆయన సెలవు పెట్టి వ్యక్తిగత సెక్యూరిటీ అధికారి సుశీల్ తో కలిసి చండీగఢ్ బయలుదేరిపోయారు. మధ్యలో ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని ఏఎస్ఐ సందీప్ బృందం ఆపింది. సుశీల్ ను అదుపులోకి తీసుకుంది..ఆ సమయంలో అధికారుల బృందం పూరన్ ను బెదిరించినట్టు వార్తలు వచ్చాయి. మరోవైపు పూరన్ కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇవ్వాలని సుశీల్ మీద ఒత్తిడి తీసుకొచ్చింది. ఆ తర్వాత కొద్దిరోజులకు ఏసిబి కేసు పెట్టింది. ఇది జరిగిన కొద్ది రోజులకు ఏఎస్ఐ సందీప్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. సూసైడ్ లేఖ లో సందీప్ కీలక విషయాలను వెల్లడించాడు. “గ్యాంగ్ స్టర్ ఇంద్రజిత్ తో పూరన్ కు ఆర్థిక సంబంధాలున్నాయి. వారిద్దరి మధ్య లావాదేవీలు కూడా చోటుచేసుకున్నాయి. అందువల్లే ఇంత వ్యవహారం నడుస్తోంది. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని” సందీప్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. ఇటు పూరన్, అటు సందీప్ ఆత్మహత్యలు చేసుకోవడంతో ఈ కేసు కాస్త అత్యంత జటిలంగా మారింది. దీనిపై విచారణకు హర్యానా ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులను నియమించింది. ప్రస్తుతం వారు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.