Herbal Eggs: నేటి కాలంలో పీల్చే గాలి, తాగే నీరు, తినే తిండి కలుషితమవుతున్నాయి, కల్తీ మయవుతున్నాయి. వాటి వల్ల మనుషుల ఆరోగ్యాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. కొన్ని సందర్భాలలో రోగాలు కూడా వ్యాపిస్తున్నాయి. వాటికి సరైన సమయంలో చికిత్స చేయకపోతే మరణాలు చోటు చేసుకుంటున్నాయ్. అందువల్లే చాలామంది తినే తిండి విషయంలో జాగ్రత్త పడుతున్నారు.. తినే తిండి విషయంలో జాగ్రత్తలు పెరుగుతున్న కొద్దీ కొత్త కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి.
ప్రస్తుతం మార్కెట్లో హెర్బల్ ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉంది. ముఖ్యంగా తృణధాన్యాలు, సంప్రదాయ విధానంలో తయారుచేసిన ఆహార ఉత్పత్తులకు విపరీతమైన గిరాకీ ఉంది. వీటి మార్కెట్ అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో కొత్త కొత్త సంస్థలు వస్తున్నాయి. కొంతమంది ఔత్సాహిక వ్యాపారులు కూడా ఈ రంగంలోకి వస్తున్నారు. రకరకాల ప్రయోగాలు చేసి కల్తీ రహిత ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. లాభసాటి ధరలకు విక్రయిస్తున్నారు. అయితే ఇంతవరకు గుడ్ల ఉత్పత్తిలో సంప్రదాయ విధానమనేది అందుబాటులోకి రాలేదు. అయితే దీన్ని ఈ వ్యక్తి చేసి చూపించాడు. పైగా గుడ్లలో రకరకాల ఫ్లేవర్లను అందుబాటులోకి తీసుకొచ్చాడు. వాస్తవానికి గుడ్లు అనేవి కోడి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉంటాయి. అంతే తప్ప అందులో రకరకాల ఫ్లేవర్లు అంటూ ఉండవు. కానీ ఈ వ్యక్తి మాత్రం దానిని చేసి నిరూపించాడు.
అతని పేరు ఆదిత్య గుప్త. ఇతడు ఉండేది గురు గ్రామ్ ప్రాంతంలో. ఉన్నత చదువులు చదివిన ఆదిత్య కొత్త కాలం పేరుపొందిన ప్రైవేట్ కంపెనీలలో పనిచేశాడు. ఆ తర్వాత తానే సొంతంగా ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలానికి గుడ్ల వ్యాపారం లోకి వచ్చాడు. రొటీన్ గుడ్ల వ్యాపారం చేస్తే వర్కౌట్ అవదని భావించిన అతడు.. డిఫరెంట్ గా ప్రయత్నించాడు. హెర్బల్ ఎగ్స్ పేరుతో సరికొత్త వ్యాపారాన్ని మొదలుపెట్టాడు. లేయర్ కోళ్లను పెంచుతూ.. వాటికి ఆహారంలో పుదీనా, అశ్వగంధ, కొత్తిమీర, తులసి, సేజ్, స్పిరూలినా, పసులు ఇవ్వడం మొదలుపెట్టాడు. దాదాపు 250 మూలికలను కోళ్ల ఆహారంలో ఇవ్వడం ద్వారా వాటి గుడ్లు కూడా అదే ఫ్లేవర్లలో రావడం మొదలు పెట్టాయి. ఈ గుడ్లు పూర్తిగా హెర్బల్ ఉత్పత్తులుగా రూపాంతరం చెందాయి. తద్వారా మార్కెట్లో ఆదిత్య కు తిరుగులేకుండా పోయింది. తనకున్న పరిచయాల ద్వారా గుడ్లను మార్కెట్ చేసుకున్నాడు ఆదిత్య.
గురు గ్రామ్ మాత్రమే కాకుండా, బోపాల్ నగరానికి కూడా తన వ్యాపారాన్ని విస్తరించాడు. గుడ్ల రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఎదిగాడు. ప్రస్తుతం అతని టర్నోవర్ కోట్లకు చేరుకుంది. మొదట్లో అది లక్షల్లోనే ఉండేది. వ్యాపారం ఇప్పుడు అంతకంతకు పెరిగిపోవడంతో అతడు తన సామ్రాజ్యాన్ని మరింత విస్తరించే పనిలో ఉన్నాడు. ఇతర ప్రాంతాలలో కూడా కోళ్ల ఫారాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంతో ఉన్నాడు. ” గుడ్ల వ్యాపారంలో ఇప్పటికీ సాంప్రదాయ విధానాలు కొనసాగుతున్నాయి. లేయర్ కోళ్ళకు రకరకాల ఆహార పదార్థాలను ఇస్తున్నారు. అందులో చాలావరకు రసాయనాలతో కూడి ఉంటున్నాయి. ఇవన్నీ కూడా మనుషుల ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాంటి వాటి నుంచి మెరుగైన ఉత్పత్తులు రావాలని ఉద్దేశంతోనే ఈ హెర్బల్ ఎగ్స్ తయారీకి శ్రీకారం చుట్టామని” ఆదిత్య పేర్కొంటున్నాడు.