Balineni Resigned to YSRCP : జగన్ కు బాలినేని షాక్.. పదవికి రాజీనామా..

వివాదం సద్దుమణిగిందన్న తరుణంలో ఏకంగా రిజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకొని పార్టీ హైకమాండ్ కు షాకిచ్చారు.

Written By: Dharma, Updated On : April 29, 2023 4:18 pm
Follow us on

Balineni Resigned to YSRCP : ఏపీ సీఎం జగన్ కు మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనవాస్ రెడ్డి ఝలక్ ఇచ్చారు. కీలక బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. గత కొంతకాలంలగా బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లాలో తనను రాజకీయంగా దెబ్బకొట్టేందుకు పార్టీలో కుట్ర జరుగుతోందని గత కొద్దిరోజులుగా ఆయన ఆరోపిస్తూ వస్తున్నారు. సొంత పార్టీ మనుషులే వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారంటూ హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. అయినా సరే హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు దిగకపోవడంతో పార్టీ అప్పగించిన బాధ్యతల నుంచి తప్పుకున్నారు.. చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేశారు.

ఆధినేత వెంటే..
బాలినేని పొలిటికల్ గా సీనియర్. ఐదారుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కీలక పోర్టుపోలియోలు నిర్వహించారు. వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట నడిచారు. గత రెండు ఎన్నికల్లో వైసీపీ తరుపున విజయం సాధించారు. జగన్ తొలి కేబినెట్ లోకి తీసుకున్నారు. ఇటీవల పునర్విభజనలో మంత్రివర్గం నుంచి తప్పించారు. వద్దని వారించినా జగన్ వినలేదు. తనకంటే జూనియర్లను కొనసాగించి.. తనను మాత్రం తొలగించడంపై కీనుక వహించారు. కొద్దిరోజుల పాటు అసంతృప్తి బాట పట్టారు. దీంతో జగన్ పిలిపించి మాట్లాడడంతో తిరిగి యాక్టివ్ అయ్యారు.

మనస్తాపంతోనే..
అయితే జగన్ బాబాయ్ వైవీ సుబ్బారెడ్డితో బాలినేనికి పొసగడం లేదు. బాలినేనికి వ్యతిరేకంగా సుబ్బారెడ్డి పావులు కదుపుతున్నారు. అందుకే బాలినేనికి మంత్రివర్గం నుంచి తప్పించారన్న టాక్ నడిచింది. సీనియర్లుగా ఉన్న బొత్స, పెద్దిరెడ్డి, తన జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్ ను కొనసాగించినా.. తనను మాత్రం తొలగించడం వెనుక వైవీసుబ్బారెడ్డి హస్తం ఉందని బాలినేని అనుమానించారు. అటు ఈసారి టిక్కెట్ కూడా దక్కదని పార్టీలో ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఇటీవల సీఎం జగన్ పర్యటనలో సైతం బాలినేనికి అవమానం జరిగింది. ఆయన వాహనాన్ని భద్రతా సిబ్బంది అడ్డుకోవడంతో మనస్తాపంతో వెనుదిరిగారు. అయితే వివాదం సద్దుమణిగిందన్న తరుణంలో ఏకంగా రిజనల్ కోఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకొని పార్టీ హైకమాండ్ కు షాకిచ్చారు. మరి అధినేత జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరీ.