Yarlagadda Venkata Rao: గన్నవరం నియోజకవర్గంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇక్కడ ఎమ్మెల్యేగా వల్లభనేని వంశీ మోహన్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో టిడిపి నుంచి గెలిచిన ఆయన పార్టీ ఫిరాయించారు. వైసిపి అనుబంధం సభ్యుడిగా కొనసాగుతున్నారు. టిడిపిని దెబ్బతీయాలని వంశీని వైసీపీలో చేర్చుకున్నారు జగన్. కానీ ఆ వ్యూహం ఇప్పుడు ఫెయిల్ అయినట్టు కనిపిస్తోంది.
గత ఎన్నికల్లో వంశీ పై వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేశారు. దాదాపు ఓడించేంత పని చేశారు. తక్కువ ఓట్లతోనే వంశీ గట్టెక్కారు. కానీ ఎన్నికల అనంతరం వంశీ వైసిపి గూటికి వచ్చారు. దీంతో పార్టీలో యార్లగడ్డ వెంకట్రావు పాత్ర ప్రశ్నార్ధకంగా మారింది. వైసిపి హై కమాండ్ సైతం వంశీ వైపే మొగ్గుచూపుతుండడంతో.. యార్లగడ్డ వెంకట్రావు పునరాలోచనలో పడ్డారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.
ఎక్కడో అమెరికాలో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు ను జగన్ పిలిచి మరీ పార్టీలో చేర్పించుకున్నారు. ఇప్పుడు తనని నడివీధిలో విడిచిపెట్టారు అన్న బాధ వెంకట్రావుకు వెంటాడుతోంది. అటు జగన్ తో పాటు వల్లభనేని వంశీ పై వెంకట్రావు ఆగ్రహం గా ఉన్నారు. టిడిపిలో చేరి తన సత్తా చాటాలని భావిస్తున్నారు. చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో టిడిపిలో చేరేందుకు దాదాపు డిసైడ్ అయ్యారు. ఇప్పటికే టిడిపి క్యాడర్ వంశీ వెంట వెళ్ళింది. మిగతా క్యాడర్ సరైన నాయకత్వం కోసం ఎదురుచూస్తోంది. నియోజకవర్గ ఇన్చార్జిగా బచ్చుల అర్జునుడు ఉండేవారు. ఆయన మరణంతో నాయకత్వం లోటు కనిపిస్తోంది. దానిని యార్లగడ్డ వెంకట్రావు తో భర్తీ చేస్తారని సమాచారం.
ప్రస్తుతం లోకేష్ యువగళం పాదయాత్ర గుంటూరులో కొనసాగుతోంది.కొద్ది రోజుల్లో కృష్ణా జిల్లాలో అడుగుపెట్టనుంది. లోకేష్ సమక్షంలో యార్లగడ్డ వెంకట్రావు టిడిపిలో చేరతారని తెలుస్తోంది. అటు వైసీపీలో వంశీ పరిస్థితి ఏమంత ఆశాజనకంగా లేదు. అక్కడ దుట్టా రామచంద్ర రావు వర్గం వంశీతో విభేదిస్తోంది. వచ్చే ఎన్నికల్లో వంశీకి టికెట్ ఇస్తే పనిచేయమని స్పష్టం చేస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు పావులు కదుపుతున్నారు. వంశీని ఓడించేందుకు అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెస్తున్నారు. దీంతో గన్నవరం రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.