BRS: నీళ్లు.. నిధులు.. నియామకాలు.. ఇదీ తెలంగాణ ఉద్యమ నినాదం.. మా నీళ్లు మాకు కావాలని, మా నిధులు మా ప్రాంతంలోనే ఖర్చు చేయాలని, మా ఉద్యోగాలు మేమే చేసుకుంటామని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పసి బిడ్డ నుంచి పండు ముసలి వరకు ఉద్యమించారు. ఆత్మగౌరవ పోరాటంలో భాగస్వాములయ్యారు. పోరాటం ఫలించింది. 10 ఏళ్ల క్రితం స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరింది. కానీ ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని పాలిస్తానని గద్దెనెక్కిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చాక.. ఉద్యమ నినాదాన్ని మర్చిపోయారు. ఫక్కుత రాజకీయ నాయకుడిగా మారిపోయాడు. ఉద్యమ ద్రోహులను అందలం ఎక్కించాడు. మంత్రి పదవులు ఇచ్చారు. కాంట్రాక్టర్లు, టెండర్ల పేరుతో తెలంగాణ సంపదను ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు. ఇక నియామకాల విషయంలో అయితే కేసీఆర్‌కు నిరుద్యోగులు నూటికి 20 మార్కులు కూడా వేయడం లేదు. పదేళ్లలో ఒక్క టీఆర్టీ నోటిఫికేషన్.. 8 ఏళ్ల తర్వాత గ్రూప్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. పోలీస్ ఉద్యోగాల భర్తీ మినహా మిగతా శాఖల ఖాళీలను పట్టించుకోలేదు. దీంతో యావత్ తెలంగాణ యుత బీఆర్‌ఎస్ సర్కార్‌కు వ్యతిరేకంగా మారింది. ఎన్నికలు ఎప్పుడొచ్చినా గద్దె దించాలని డిసైడ్ అయింది.
నోటిఫికేషన్లు ఇచ్చానా వ్యతిరేకతే..
రాజకీయ చతురత ఉన్న కేసీఆర్ యువతలో వ్యతిరేకతను పసిగట్టారు. దీంతో ఎన్నికల ఏడాది నోటిఫికేషన్లు ఇచ్చారు. కానీ అన్ని పరీక్షలు ఒకేసారి నిర్వహిస్తూ చాటలో కుక్కలకు తవుడు పెట్టిన చందంగా ఉద్యోగా భర్తీ ప్రక్రియను మార్చేశాడు. దీంతో ఎన్నికల ఏడాదిలో నోటిఫికేషన్లు వస్తున్నా కేసీఆర్, బీఆర్‌ఎస్ పాలనపై వ్యతిరేకత యువతలో తగ్గడం లేదు. ఒకపైపు పోటీ పరీక్షలు రాస్తూనే ఉద్యమిస్తున్నారు.
మొదట కావాల్సింది ఉద్యోగాలే..
యూత్ ను టాకిల్ చేయటంలో తెలంగాణా ప్రభుత్వం విఫలమైందనే అనిపిస్తోంది. యూత్ కు మొదటగా కావాల్సింది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు. ఈ రెండు క్రియేట్ చేయలేకపోయినపుడు 2018 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లు కనీసం నిరుద్యోగ భృతి. ఉద్యోగాలను భర్తీ చేయటంలోనే కాదు పరీక్షలు నిర్వహించటంతోపాటు చివరకు నిరుద్యోగ భృతి కల్పించటంలో కూడా ప్రభుత్వం ఫెయిలైన విషయం అర్ధమవుతోంది. ఉద్యోగాల భర్తీ కోసమే ఏర్పాటుచేసిన టీఎస్సీఎస్సీని నూరుశాతం వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఉద్యోగాలు భర్తీ చేయకుండా చాలా కాలం తాత్సారం చేసిన కేసీఆర్ ప్రభుత్వం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొన్ని గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలను భర్తీ చేయాలని ప్లాన్ చేసింది. దీనికి అనుగుణంగానే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు జారీచేసింది. ఎప్పుడైతే నోటిఫికేషన్ల ద్వారా పరీక్షల నిర్వహణకు రెడీ అయ్యిందో వెంటనే ప్రశ్నపత్రాల లీకేజీలు మొదలయ్యాయి. దీంతో పరీక్షల నిర్వహణ, అభ్యర్ధుల ఎంపిక, ఉద్యోగాల భర్తీ పెద్ద ప్రహసనంగా మారిపోయింది.
కోర్టు కేసులతో సతమతం..
కోర్టుల్లో కేసులతో సతమతమవుతున్న సమయంలో టీఎస్సీపీఎస్సీని ప్రక్షాళనచేసింది. కొత్త బోర్డు ఏమిచేసిందంటే నిర్వహించబోయే పరీక్షలన్నింటినీ వెంటవెంటనే నిర్వహించేస్తోంది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయాన్ని కూడా అభ్యర్ధులకు ఇవ్వకపోవటంతో వాళ్లంతా మండిపోతున్నారు. నాలుగు రోజుల క్రితం టీఎస్పీఎస్సీపై దండయాత్ర చేశారు. గురువారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వందలాదిమంది విద్యార్ధులు, పరీక్షలు రాయబోతున్న వాళ్లు టీఎస్పీఎస్సీ కార్యాలయం వద్ద నానా గోలచేశారు. ఇప్పటికే ప్రభుత్వంపై నిరుద్యోగులు, ఉద్యోగాలు రానివాళ్లు, విద్యార్ధులంతా మండిపోతున్నారు.
నిరుద్యోగ భృతి గతమే..
అప్పుడెప్పుడో ఇచ్చిన హామీ ప్రకారం కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వటంలేదు. దాంతో యూత్ లో అత్యధికం కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారయ్యారని మంత్రులు, ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరిగిపోతోంది. రేపు ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు ఎలాంటి పరిస్ధితులు ఉంటాయో అనే ఆందోళన పెరిగిపోతోంది. యూత్ ఫ్యాక్టర్‌ను ప్రతిపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ ఎక్కువగా అడ్వాంటేజ్ తీసుకుంటోంది. గ్రూప్ 2 పరీక్షల తేదీలను రీ షెడ్యూల్ చేయటానికి ప్రభుత్వం ప్రిస్టేజ్‌గా పోతోంది. చేయకపోతే నిరుద్యోగులు, పరీక్షలు రాసేవాళ్లు ఊరుకోవటంలేదు. రీషెడ్యూల్ చేస్తే ప్రభుత్వం అవమానంగా భావిస్తోంది. మరీ సమస్యకు కోర్టు అయినా పరిష్కారం చూపుతుందో లేదో చూడాలి.