BRS: తెలంగాణలో ఎన్నికల సమయంలో భారత రాష్ట్ర సమితికి భారీ షాక్ తగిలింది. సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. ఆ పార్టీ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. కారు గుర్తు పోలిన సింబల్స్‌ను మరొకరికి కేటాయించవద్దని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్‌ను కొట్టేసింది.
ఫ్రీ సింబల్స్ జాబితాలో…
బీఆర్ఎస్ కారును పోలిన గుర్తులు కేటాయించకుండా ఆదేశించాలని మొదట ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేసింది. కానీ, తర్వాత దానిని ఉపసంహరించుకుని సుప్రీం కోర్టుకు వెళ్లింది. కారును పోలిన గుర్తులతోపాటు ఫ్రీ సింబల్స్ జాబితాలో కారు గుర్తును తొలగించాలని కూడా కోరింది. అయితే ఈ పిటీషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పిటీషన్‌ను డిస్మిస్ చేసింది. దీంతో ఎన్నికల వేళ బీఆర్ఎస్కు ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఏ గుర్తులను ఎవరికి కేటాయిస్తుందన్న దానిపై పార్టీలో టెన్షన్ నెలకొంది.
ఈసీకి పలుమార్లు వినతి..
ఎన్నికలు జరిగిన ప్రతీసారి బీఆర్ఎస్ పార్టీ తమ పార్టీ గుర్తు కారును పోలిన కొన్ని గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని కోరుతోంది. ఈమేరకు ఎన్నికల సంఘానికి విన్నవిస్తోంది. బీఆర్ఎస్ విజ్ఞప్తి మేరకు 2011లో రోడ్డు రోలర్ గుర్తును తొలగించినప్పటికీ తర్వాత ఎన్నికల నుంచి స్వతంత్ర అభ్యర్థులకు కేటాయిస్తూ వస్తోంది. బీఆర్ఎస్ నేతలు ఆ గుర్తును తొలగించాలని కోరుతున్నారు.
ఇబ్బందిగామారిన గుర్తులు ఇవీ..
కారును పోలిన రోడ్డు రోలర్‌తోపాటు కెమెరా, చపాతి రోలర్, సోప్‌డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, ఓడ, ఆటోరిక్షా, ట్రక్ వంటి గుర్తులు బీఆర్ఎస్కు ఇబ్బందిగా మారుతున్నాయి. ఈ గుర్తుల కారణంగా కారుకు పడాల్సిన ఓట్లు ఆయా గుర్తులకు పడుతున్నట్లు బీఆర్ఎస్ పేర్కొంటోంది. ఆ గుర్తులను రాబోయే ఎన్నికల్లో ఎవరికీ కేటాయించొద్దని కోరుతోంది.