Bharathi Cements: ఏపీ సీఎం జగన్ కు మరో ఝలక్ తగిలింది. జగన్ అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్ ఫిక్సిడ్ డిపాజిట్లపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. భారతి సిమెంట్స్ కి చెందిన రూ.150 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లను ఈడి విడుదల చేయాలంటూ తెలంగాణ హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చింది. దీనిపై ఈడి సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానం దీనిపై తీర్పు చెప్పింది.
జగన్ అక్రమాస్తుల కేసుల్లో భారతి సిమెంట్స్ పై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈడి భారతి సిమెంట్స్ కి చెందిన రూ.150 కోట్లు అటాచ్ చేసింది. అయితే అందులో ఫిక్సిడ్ డిపాజిట్లు ఉన్నాయని.. వాటిని విడుదల చేయాలని భారతి సిమెంట్స్ తెలంగాణ హైకోర్టులో ప్రత్యేక పిటిషన్ దాఖలు వచ్చేసింది. దీనిపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఎఫ్డి లను విడుదల చేయాలని ఈడిని ఆదేశించింది. అయితే అటాచ్ చేసిన ఆస్తులను తిరిగి ఇచ్చేందుకు ఈడి సమ్మతించలేదు. దీనిని సవాల్ చేస్తూ ఈడి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈడి వాదనతో ఏకీభవించిన జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం శుక్రవారం తీర్పునిచ్చింది. తీర్పును పునః పరిశీలించాలని తెలంగాణ హైకోర్టుకు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది.
ఫిక్సిడ్ డిపాజిట్లకు బదులుగా బ్యాంక్ గ్యారంటీలను తీసుకున్న తర్వాత కూడా.. ఫిక్సిడ్ డిపాజిట్ల జప్తు జరిగిందని భారతి సిమెంట్స్ తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహద్గీ వాదించారు. ఎఫ్ డిలను జప్తు చేసినా దానిపై వచ్చిన వడ్డీ నైనా విడుదల చేయాలంటూ భారతి సిమెంట్స్ మరో పిటిషన్ దాఖలు చేసింది. దీనిని కూడా అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఎఫ్ డీలను విడుదల చేయాలన్న తీర్పునే పునః పరిశీలించాలన్నప్పుడు వడ్డీ ఎలా వస్తుందని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. హైకోర్టులో తేల్చుకోవాలని సూచించింది. దీంతో భారతి సిమెంట్స్ విషయంలో జగన్ కు మరోసారి ఎదురు దెబ్బ తగిలినట్లు అయ్యింది.