Chandrababu: చంద్రబాబుకు బిగ్ రిలీఫ్. సుప్రీంకోర్టులో ఆయనకు ఊరట దక్కింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలన్న సిఐడి ప్రయత్నానికి చెక్ పడింది. అది కుదిరే పని కాదని అత్యున్నత న్యాయస్థానం తేల్చేసింది. ఈ విషయంలో ఏపీ హైకోర్టు తీర్పును సమర్ధించింది. దీంతో ఏపీ సిఐడికి చుక్కెదురు అయ్యింది.ఎన్నికల ముంగిట చంద్రబాబుకు ఇబ్బందులు పెట్టాలన్న జగన్ సర్కార్ ప్రయత్నం విఫలమైంది.
అవినీతి కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో దాదాపు 52 రోజులు పాటు చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ఒక్క స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసే కాదు.. మరో మూడు కేసులను సిఐడి నమోదు చేసి కోర్టుకు నివేదించింది. అయితే అన్ని కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యింది. దీంతో ఏపీ సిఐడి పునరాలోచనలో పడింది. ముఖ్యంగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని ఏపీ సిఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు విచారణ కొనసాగుతున్నందున.. బెయిల్ పై బయట ఉన్న చంద్రబాబు ప్రభావితం చేస్తారని పేర్కొంది. దీనిపై ఉభయ వర్గాల వాదనను అత్యున్నత న్యాయస్థానం ఆలకించింది. ఈ కేసులో తుది తీర్పును ఈరోజు వెల్లడించింది. హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ నిర్ణయాన్ని సమర్థించింది. కేసు విచారణతో ముందస్తు బెయిల్ కు సంబంధం లేదని తేల్చేసింది.
అయితే ఎన్నికల ముంగిట చంద్రబాబుకు ఇది ఉపశమనం కలిగించే విషయం. ఇప్పటికే ఆయన రాజకీయ వ్యూహాలను అమలు చేస్తున్నారు. రాష్ట్ర పర్యటనలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. రా కదలిరా పేరుతో బహిరంగ సభలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఎన్నికల ముంగిట చంద్రబాబుకు ఎలాగైనా చెక్ చెప్పాలని జగన్ సర్కార్ భావించింది. అవినీతి కేసుల్లో ముందస్తు బెయిల్ ను రద్దు చేయించగలిగితే చంద్రబాబును అడ్డుకోవచ్చని అంచనా వేసింది. ఏపీ సిఐడి ద్వారా సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అయితే ఒకవేళ ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ రద్దు అయితే… మిగతా కేసుల్లో సైతం ఇదేవిధంగా వ్యవహరించాలని చూసింది. కానీ వారి అంచనాలకు విరుద్ధంగా తీర్పురావడంతో ఏపీ సర్కార్ షాక్ కు గురైంది. చంద్రబాబుకు మాత్రం భారీ ఊరట దక్కింది. ఆయన ఎన్నికల క్యాంపెయిన్ నిరభ్యంతరంగా సాగించుకునే అవకాశం దక్కించుకున్నారు.