‘‘ఇండియా పేద దేశం కాదు.. ఇండియన్స్ మాత్రమే పేదవాళ్లు’’ అనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్న మాట. మరోసారి ఇది వాస్తవం అని కరోనా పరిస్థితులు చాటి చెబుతున్నాయి. కరోనా చికిత్స చేయించుకోలేక ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో తెలిసిందే. దాదాపు కోటి మందికి పైగా తాము చేస్తున్న ఉద్యోగాలు కోల్పోయారు. కోట్లాది మంది ఆదాయం భారీగా పడిపోయింది. లక్షలాది మంది కరోనా చికిత్స చేయించుకొని డబ్బులతోపాటు ప్రాణాలు కూడా కోల్పోయారు. మరికొందరు ప్రాణాలు నిలుపుకొని, వట్టి చేతులతో రోడ్డుమీదకు వచ్చేశారు. ఇలా దేశంలో కోట్లాది మంది మూడు పూటలా తిండి తినలేక దరిద్రపు జీవితాలను అనుభవిస్తున్నారు. ఇదీ.. ఇండియా అనే కాయిన్ కు ఒకవైపు.
మరోవైపు.. కోట్లాది రూపాయలు విలువ చేసే కార్లు, వాహనాలు కొనుగోలు చేసేందుకు ధనవంతులు పోటీ పడుతున్నారు. మార్కెట్లోకి వచ్చీ రాగానే.. అయిపోతున్నాయి. ఈ సమయంలోనే గుజరాత్ పారిశ్రామిక వేత్త గౌతమ్ ఆదనీ ఆస్తుల విలువ 43 బిలియన్ డాలర్లకు చేరింది. ముఖేష్ అంబానీ ఆసియాలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. ముంబైకి చెందిన బిలియనీర్ దమానీ 137 మిలియన్ డాలర్లు ఖర్చుపెట్టి.. అత్యంత ఖరీదైన భవనాన్ని కొనుగోలు చేశారు. విదేశాల్లో టూర్లకు వెళ్లేవారు.. ఫారెన్ లో షాపింగ్ చేసేవాళ్లకు కొదవే లేదు. ఇదీ.. రెండో వైపు భారతం.
ఈ కరోనా కండీషన్లో ఎంతో మంది మధ్యతరగతి జనం దారిద్ర రేఖ కిందకు జారిపోయారు. కష్టపడి దాచుకున్న కొద్ది సొమ్ము కాస్తా.. కొవిడ్ దెబ్బకు కరిగిపోయింది. కరోనా బారి నుంచి తమను, తమవాళ్లను కాపాడుకునేందుకు ఆస్తులను తెగనమ్ముకున్న వాల్లకు లెక్కే లేదు. ఉన్న ఇంటిని అమ్ముకొని అద్దె గదులు వెతుక్కుంటూ వెళ్లిపోయినవాళ్లు కూడా లక్షల్లో ఉన్నారు. ఈ విధంగా.. కరోనాతో ప్రాణాల కోసం పోరాటం చేసినవాళ్లంతా.. ఇప్పుడు బతుకు కోసం పోరాడుతున్నారు. ఆకలి కోసం పోరాడుతున్నారు.
ధనికుల పరిస్థితి అలా ఎందుకు ఉంది? పేదల పరిస్థితి ఇలా ఎందుకు ఉంది? ఈ పరిస్థితి కారణం ఎవరు? అని ఆలోచించే పరిస్థితిలో కూడా చాలా మంది జనం లేరు. కనీస అవగాహన లేని జనం కొందరైతే.. తమ పొట్ట నిండితే చాలు అనుకునేవారు మరికొందరు. వీళ్ల అవసరాలను, అవగాహనా రాహిత్యాన్ని ఆసరాగా చేసుకొని అందలం ఎక్కుతున్న ప్రభుత్వాలు.. కార్పొరేట్ పెద్దలకు ఊడిగం చేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ భారతం ఎప్పుడు మారుతుందో? ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ప్రజలు నిజాన్ని ఎప్పుడు గుర్తిస్తారో ఎవ్వరికీ అర్థం కాని దుస్థితి.