Venkaiah Naidu: భారతీయ జనతా పార్టీలో సీనియర్లు ఒక్కొక్కరూ ఇంటి బాట పడుతున్నారు. లాల్ కృష్ణ అద్వాని, మురళీ మనోహర్ జోషిలాంటి నేతలను మోదీ షా ద్వయం ఇంటిబాట పట్టింది. ఇప్పుడు తాజాగా వెంకయ్యనాయుడు వంతు వచ్చింది. రాష్ట్రపతిగా మొండిచేయి చూపినా.. కనీసం ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడ్ని కొనసాగిస్తారని అంతా భావించారు. కానీ ప్రధాని మోదీ ఆ చాన్స్ కూడా ఇవ్వలేదు. వెంకయ్య పేరును పరిగణలోకి తీసుకోకుండా పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ దన్ ఖడ్ ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేశారు. దీంతో వెంకయ్యనాయుడు శకం దాదాపు ముగిసినట్టేనని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తద్వారా అటు పార్టీతో పాటు ప్రభుత్వంలో అసలు పదవులు లేకుండా వెంకయ్యకు ద్వారాలు మూసినట్టేనని భావిస్తున్నారు. వాస్తవానికి గతసారి ఉప రాష్ట్రపతి ఎంపిక సమయంలోనే వెంకయ్య ఆసక్తికనబరచలేదు. కానీ కేంద్ర పెద్దలు మాత్రం తదుపరి రాష్ట్రపతి మీరేనంటూ సంకేతాలివ్వడంతో అయిష్టతగానే ఉప రాష్ట్రపతి పదవిని తీసుకున్నారు. ఐదేళ్ల పాటు ఎగువ సభ నడిపేందుకు ఆపసోపాలు పడ్డారు. రాజ్యసభలో ఎన్డీఏకు సంఖ్యాబలం లేకున్నా.. తనకున్న సమర్థతతో ప్రభుత్వాన్ని కీలక ఘటనల సమయంలో గట్టెక్కించారు. అటు విపక్షాల అభిమానాన్ని చూరగొన్నారు. ఒక విధంగా చెప్పాలంటే పెద్దల సభను నడపడడం కత్తిమీద సామే. కానీ వెంకయ్యనాయుడు ఇబ్బందుల నడుమ బాగానే విధులు నిర్వహించారు. కానీ ఆయన కృషిని మాత్రం ప్రభుత్వం గుర్తించలేదు. రాష్ట్రపతి ఎంపికలోనూ మొండిచేయి చూపారు.. ఇప్పుడు ఉప రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో సైతం ముఖం చాటేశారు. దీంతో ఆయన ఇంటిబాట తప్పదన్న రీతిలో బీజేపీ పెద్దలు గట్టి సందేశమే ఇచ్చారు. ఎల్ కే అద్వాని, మురళీమనోహర్ జోషి బాటలో నడవక తప్పదని భావించిన వెంకయ్యనాయుడు ముందే తన షరంజామాను సిద్ధం చేసుకున్నారు.
బీజేపీలో సుదీర్ఘ ప్రయాణం…
బీజేపీలో వెంకయ్యనాయుడుది సుదీర్ఘ ప్రయాణం. 1993 వరకూ రాష్ట్ర రాజకీయాల్లో ఉన్న వెంకయ్యనాయుడు తరువాత ఢిల్లీ రాజకీయాల వైపు అడుగులేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా హస్తినా రాజకీయాల్లో అడుగు పెట్టారు. తన వాగ్ధాటి, అంకిత భావంతో అధిష్టానానికి, బీజేపీ శ్రేణులకు ఇష్టుడైన నాయకుడిగా మారిపోయారు. పార్టీ అధికార ప్రతినిధిగా బీజేపీ స్టాండ్ను గట్టిగానే చాటేవారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషిచేశారు.
Also Read: KCR On Cloud Bursting: కేసీఆర్ ఆరోపించినట్టు క్లౌడ్ బరెస్టింగ్ సాధ్యమేనా?
బీజేపీ పార్లమెంటరీ బోర్డు, బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ కార్యదర్శి వంటి పదవుల్లో రాణించారు. రాజ్యసభలో విపక్షాలను అడ్డుకట్ట వేయడంలో కీ రోల్ ప్లే చేసేవారు. 2002లో బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నాలుగుసార్లు రాజ్యసభకు ఎన్నికైన ఏకైక బీజేపీ నాయకుడిగా ఖ్యాతికెక్కారు. వాజుపేయి ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు. గ్రామీణాభివృద్ధి శాఖ నిర్వహించినప్పుడు ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది వెంకయ్యనాయుడే. పట్టణాభివృద్ది, గృహనిర్మాణం, పేదరిక నిర్మూలన, పార్లమెంటరీ వ్యవహారాలు, సమాచార శాఖలను నిర్వర్తించి శాఖల్లో పురోగతి సాధించారు. అయితే ఉపరాష్ట్రపతి పదవిని కట్టబెట్టి వెంకయ్యను కట్టడి చేశారన్న టాక్ అప్పట్లోనే నడిచింది. మొత్తానికి మోదీ షా ద్వయం అడ్వాని గ్రూపులో ఒక్కొక్కర్నీ ఇంటిబాట పట్టించారని టాక్ నడుస్తోంది. అటు ఇంటా.. ఇటు బయట తమ మార్కు రాజకీయం చూపిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
నాడు అండగా నిలిచినా…
అయితే ప్రధాని మోదీ ఇంతటి ఉన్నత స్థానంలో రాణించడానికి కీలక నేతలు వేసిన పునాదులే కారణం. కానీ వారినే వదిలించుకోవడాలని చూస్తుండడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. గుజరాత్ లో అల్లర్లు జరిగినప్పడు ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ ఉన్నారు. నాటి ప్రధాని వాజపేయ్ మోదీపై చర్యలు తీసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఎల్ కే అద్వాని, వెంకయ్యనాయుడు అడ్డుకున్నారు. ఒక విధంగా చెప్పాలంటే రిస్కు చేసి కాపాడారు. రాజకీయ ఉన్నతికి కారణమయ్యారు. కానీ అవేవీ ప్రధాని మోదీకి గుర్తులేవని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ కు తగ్టట్టు, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితులకు తగ్గట్టు నిర్ణయాలు తీసుకోవడ ప్రధానికి అలవాటు. అందుకే రాజకీయ మైలేజ్ వస్తుందనుకొని బహుశా రాజస్థాన్ జాట్ వర్గానికి చెందిన జగదీప్ ధన్ ఖడ్ ను ఉప రాష్ట్రపతిగా ఎంపిక చేశారు. అయితే ముందే విషయాన్ని గ్రహించిన వెంకయ్యనాయుడు తన నిష్కృమణ ఖాయమని గుర్తించారు. ముందుగానే తన అధికారిక నివాసం ఖాళీ చేసుకునే పనిలో పడ్డారు.
Also Read:Virat Kohli: 1000 సమీపిస్తోంది 100 ఏది? విరాట్ కోహ్లీ చివరి శతకానికి 967 రోజులు