Bharat Jodo Yatra: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా.. 5 నెలలు, 12 రాష్ట్రాలు, 3,570 కిలోమీటర్లు దూరం.. దాని పేరు భారత్ జోడో యాత్ర. చేస్తోంది రాహుల్ గాంధీ.. ఇటీవలే తమిళనాడులో ప్రారంభమైంది. యాత్ర ప్రారంభమైన రెండు రోజులకే రాహుల్ గాంధీ వేసుకున్న టీ షర్టుపై, ఒక పాస్టర్ తో జరిపిన సంభాషణ.. తీవ్ర చర్చనీయాంశమైంది. రాజకీయం అంటేనే ఆరోపణలు ప్రత్యారోపణలు కాబట్టి ఆ విషయాలన్నీ వదిలేస్తే.. రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రలో ఇంట్రెస్టింగ్ గా అనిపించే విషయం ఒకటి ఉంది. అవే కంటెయినర్లు.

రాజకీయమంటేనే అధికారం. ఆ అధికారం కోసం పార్టీలు ఏమైనా చేస్తాయి. కెసిఆర్ భాషలో చెప్పాలంటే రాజకీయ పార్టీలు నీతి వాక్యాలు బోధించే మఠాలు కావు. అవి ఫక్తు రాజకీయాలే చేస్తాయి. దేశంలో చిన్నా చితకా రాజకీయ నాయకులే పాదయాత్రల పేరుతో నడిచేస్తున్నారు. కొడిగడుతున్న పార్టీని కాపాడుకునేందుకు రాహుల్ గాంధీ భారత్ జోడో పేరుతో పాదయాత్ర ప్రారంభించారు. అసలు పాదయాత్ర అంటేనే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందునా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండే రాహుల్ గాంధీ పాదయాత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. తన చుట్టూ 118 మంది లీడర్లు, వ్యక్తిగత సిబ్బంది, వంట వండే వాళ్ళు… ఎలా లెక్కించినా 200 మందికి పైగానే ఉంటారు. వీరందరికీ సౌకర్యాలు అప్పటికప్పుడు సమకూర్చాలంటే పెద్ద టాస్క్. అందుకే రాహుల్ గాంధీ టీం ముందుగానే ప్రత్యేకమైన కంటైనర్లు సిద్ధం చేసింది. మొత్తం 59 కంటైనర్లు ట్రక్కుల మీద బిగించి ఉంటాయి. అవన్నీ ఎక్కడ ఆగితే అక్కడ 59 ఊళ్లు వెలిసినట్టు లెక్క. ఒకవేళ భారీ వర్షాలు కురిస్తే టెంట్లు, గుడారాలు కూలిపోతాయి. కానీ కంటైనర్లు అలా కాదు.
విలాసవంతమైన సౌకర్యాలు
200 మందికి తక్కువ కాకుండా ఉంటారు కాబట్టి ప్రతి కంటైనర్ కి ఒక కోడ్ ఏర్పాటు చేశారు. ఒక కంటైనర్ లో ఏసీలు, కాన్ఫరెన్స్ రూమ్ లు, బాత్రూంలు ఉంటాయి. అయితే వంట వండే సిబ్బందికి మాత్రం కామన్ బాత్రూంలు ఉంటాయి. రాహుల్ గాంధీ వాడే కంటైనర్ కు బుల్లెట్ ప్రూఫ్ సౌకర్యం ఉంటుంది. దీంతోపాటు ఏసీ చాంబర్, అత్యాధునిక వైఫై ఉంటాయి. అప్పటికప్పుడు 20 మందితో కాన్ఫరెన్స్ నిర్వహించేలా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక రాహుల్ కంటైనర్ కు ఒకటో నెంబర్, ఆయన సెక్యూరిటీ ఉండే కంటైనర్ కు రెండో నెంబర్, అతని వ్యక్తిగత సిబ్బంది అలంకార్ సహయ్, వంశి చంద్, బైజు ఉండే కంటైనర్ కు మూడో నెంబర్ కేటాయించారు. మిగతా నాయకుల స్థాయి ఆధారంగా వారికి కంటైనర్ నెంబర్లు కేటాయించారు. రాహుల్ గాంధీ కంటైనర్ ను ఆరెంజ్ జోన్లో ఉంచుతారు. రెండు అప్పర్ బెర్త్ లు, రెండు లోయర్ బెర్తులు ఉండే పింక్ కంటైనర్లను మహిళల కోసం కేటాయించారు. ఎవరైనా సరే కంటైనర్ లో తినొద్దు. బయట నుంచి ఆహారం తీసుకురావద్దు. మద్యం తాగడం, పొగ తాగటం పూర్తి నిషిద్ధం.

నిజంగా జనాల బాధలు తెలుసుకుంటారా
కాంగ్రెస్ పార్టీ నానాటికి పలుచన అవుతున్నది. కీలకమైన నాయకులు పార్టీని విడిపోతున్నారు. వెళ్తూ వెళ్తూ రాహుల్ గాంధీ నాయకత్వం పై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా బిజెపి అంతకంతకు విస్తరిస్తున్నది. ఈ క్రమంలో పార్టీని కాపాడుకోవాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వాస్తవానికి దేశంలో కాంగ్రెస్ ఉండాలి. బలమైన ప్రతిపక్షం లేకుంటే ప్రజాస్వామ్యం అనేది ఉండదు. ఇప్పటికిప్పుడు రాహుల్ గాంధీ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ బలపడుతుందా లేదా అనేది పక్కన పెడితే.. బావి భారత దేశానికి కాబోయే ప్రధానమంత్రిగా అనుకుంటున్న రాహుల్ గాంధీ గోధుమపిండిని లీటర్లలో కాకుండా కిలోల్లో కొలుస్తారని, బియ్యం సూపర్ మార్కెట్లలో కాకుండా పొలంలో పండే ధాన్యాన్ని మర ఆడిస్తే వస్తాయని తెలుసుకుంటారా? జనాల బాధలు, దేశంలోని భిన్న ప్రాంతాల పరిస్థితుల పై అవగాహన కలుగుతుందా? కాంగ్రెస్ పార్టీకి సీనియర్ల పీడ విరగడవుతుందా? పార్టీకి రాహుల్ గాంధీ అధ్యక్షుడు అవుతారా? ఆ స్థానంలో మరొకరు వస్తారా? అనే సంక్లిష్ట ప్రశ్నలకు ఈ యాత్ర ద్వారా సమాధానం వస్తుందని కాంగ్రెస్ లోని యువ నాయకులు అంటున్నారు. బిజెపి అధికారంలో ఉండవచ్చు గాక.. అధికారం అనేది ఎప్పుడూ శాశ్వతం కాదు 2024లో ఓటర్లు ఎటువైపు మొగ్గుతారో వారే అధికారంలోకి వస్తారు. కానీ కేంద్రంలో అధికార పార్టీకి బలమైన ప్రతిపక్షం ఉండాలి. గతంలో ప్రాంతీయ పార్టీలు మద్దతు ఇస్తే ఏర్పడిన సంకీర్ణ ప్రభుత్వాల వల్ల దేశం ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొందో చూశాం కదా! బిజెపి అయినా కాంగ్రెస్ అయినా అధికార ప్రతిపక్షంలో ఉండాలి. అలా ఉంటేనే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మన గలుగుతుంది.