
రాష్ట్ర విభజన తర్వాత రెండు రాష్ట్రాల మధ్య నీటి పంచాయితీ ఏ స్థాయిలో కొనసాగిందో అందరికీ తెలిసిందే. చంద్రబాబు ఉన్నంత వరకూ కొనసాగిన ఈ వివాదం.. జగన్ వచ్చిన తర్వాత చల్లారింది. అయితే.. ఇప్పుడు ఉన్నట్టుండి ఈ వివాదం తెరపైకి వచ్చింది.
నిబంధనలు తుంగలో తొక్కి రాయలసీమ ఎత్తిపోతల, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను చేపడుతోందని ఏపీపై తెలంగాణ సర్కారు ఫైర్ అయ్యింది. ఈ మేరకు మంత్రి ప్రతాప్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్, జగన్ నీటి గంజదొంగలు అని తీవ్రంగా విమర్శించారు. దీంతో.. ఈ వ్యవహారం ఒక్కసారిగా వేడెక్కింది. అటు ఏపీలోని వైసీపీ, బీజేపీ కూడా స్పందించాయి. అయితే.. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎత్తుకున్న ఈ జల జగడంలో.. రాజకీయ కోణం కూడా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత వరుసగా రెండు సార్లు టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే.. 2023లో జరగబోయే మూడో దఫా ఎన్నికలు అంత సానుకూలంగా ఉండకపోవచ్చే ఆలోచనలోకి కేసీఆర్ వచ్చినట్టు చెబుతున్నారు విశ్లేషకులు. సహజ వ్యతిరేకతకు తోడు, వచ్చే ఎన్నికల్లో అధికారం తమదేనని చెబుతోంది బీజేపీ. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శనతో.. ఇక, రాష్ట్రంలో అధికారానికి అడుగు దూరంలోనే ఉన్నట్టు చెబుతున్నారు కాషాయ నేతలు.
ఇటు కాంగ్రెస్ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణ ఇచ్చిన పార్టీ తమదేనని ఈ సారి బలంగా వాణి వినిపించేందుకు ప్రయత్నిస్తోంది. పీసీసీ చీఫ్ ఎంపికలోనూ ఇంత జాప్యానికి కారణం ఇదేనని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జరగబోయే ఎన్నికలను ఎదుర్కోవడం అంత ఈజీ కాదనే.. ఇప్పటి నుంచే అస్త్రాలను బయటకి తీస్తున్నారని అంటున్నారు.
ఇప్పటి నుంచే ఈ జల జగడాన్ని చర్చలోకి తేవడం ద్వారా.. 2023 నాటికి ఎన్నికల ఆయుధంగా ఉపయోగపడుతుందని కేసీఆర్ భావిస్తున్నారట. తద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని చూస్తున్నారట. ఈ రాష్ట్రం కోసం నిజాయితీగా పనిచేసేది టీఆర్ఎస్ మాత్రమేనని చాటి చెప్పడంతోపాటు.. నీటి కేటాయింపుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా.. కేంద్రంలోని బీజేపీ ఏమీ చేయట్లేదని నిరూపించొచ్చని చూస్తున్నారట.
ఈ విధంగా.. మరోసారి సెంటిమెంట్ అస్త్రాన్ని ఉపయోగించుకోవడం ద్వారా హ్యాట్రిక్ సాధించాలని చూస్తున్నారనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని అస్త్రాలు వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మరి, ఈ సెంటిమెంట్ మూడోసారి వర్కవుట్ అవుతుందా? కేసీఆర్ ఇంకా ఎలాంటి వ్యూహాలను రచించబోతున్నారనేది తెలియడానికి వెయిట్ చేయాల్సిందే.