Bengaluru Techie Dies: మన అదృష్టం బాగోలేకపోతే.. భూమ్మీద నూకలు లేకపోతే తాడు పామై కరుస్తుంది అంటారు. పాపం ఈ సామెత ఇతడి జీవితంలో నిజమైంది. అసలే అతడు 2016లో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చావు చివరి అంచుదాక వెళ్లి వచ్చాడు. కుటుంబ సభ్యులు భారీగా ఖర్చుపెట్టి అతన్ని బతికించుకున్నారు. అతడు బతికి బట్ట కట్టినప్పటికీ.. రోడ్డు ప్రమాద తీవ్రత వల్ల కాలు స్పర్శ కోల్పోయింది. అప్పటినుంచి అతడు ఇబ్బంది పడుకుంటూనే జీవిస్తున్నాడు. ఉన్నత చదువులు చదివిన నేపథ్యంలో ఐటి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాలు స్పర్శ కోల్పోయినప్పటికీ.. ఐటీ ఉద్యోగిగా పని చేస్తూ తన బతుకు తాను బతుకుతున్నాడు. అయితే ఇంతలోనే పాము రూపంలో అతడికి ప్రమాదం ఎదురైంది. చివరికి అతడి ప్రాణాన్ని కూడా తీసింది. ఈ దారుణం బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది.
బెంగళూరు నగరానికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తి టిసిఎస్ కంపెనీలో పని చేస్తున్నారు. ఆయన బెంగళూరు నగరంలోని అనేకల్ తాలూకా బన్నేరుఘట్ట సమీపంలోని రంగనాథ లేఅవుట్లో కుటుంబంతో నివసిస్తున్నారు. పని ఉండడంతో బయటికి వెళ్లడానికి చెప్పులు వేసుకున్నారు. అయితే అందులో పాము పిల్ల ఉన్న విషయాన్ని గుర్తించలేకపోయారు. ఆ పాము పిల్ల అతడి బొటనవేలును కాటు వేసింది. అయితే ఆ కాలికి స్పర్శ లేకపోవడంతో ఆ విషయం అతనికి తెలియలేదు. కాటు వేసిన తర్వాత సుమారు 45 నిమిషాల పాటు ఆ పాము చెప్పులోనే ఉంది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తి చెప్పులను విడిచాడు. ఇంట్లో కి వెళ్లిపోయాడు. అదే సమయంలో వారింటికి ఒక వ్యక్తి వచ్చాడు. ప్రకాష్ విడిచిన చెప్పుల్లో పాముపిల్లను చూశాడు. ఆ విషయాన్ని ప్రకాష్ కుటుంబ సభ్యులకు చెప్పాడు. అప్పటికే ప్రకాష్ తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు. అతని నోటి నుంచి నురగ వచ్చింది. కంగారు పడిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. దీంతో ప్రకాష్ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రస్తుతం ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాలు పోతున్నాయి. ప్రకాష్ తో పాటు పనిచేస్తున్న వారందరి ఉద్యోగాలు పోయాయి. అయితే ఇతడికి మెరిట్స్ ఉండడంతో యాజమాన్యం కొనసాగిస్తున్నది. చిన్నప్పటి నుంచి ప్రకాష్ చదువులో చురుకు. అంతేకాదు తన పని చేస్తున్న కంపెనీలో కూడా అద్భుతమైన ప్రతిభ చూపిస్తున్న ఘనుడు. అయితే అటువంటి వ్యక్తి పాముకాటు వల్ల చనిపోవడాన్ని స్నేహితులు జీర్ణించుకోలేకపోతున్నారు. అతడి కాలికి గనక స్పర్శ జ్ఞానం ఉంటే కచ్చితంగా బతికేవాడని చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ ఘటన ప్రకాష్ కుటుంబాన్ని తీవ్ర విషాదంలో నింపింది.