DSC Jobs 2025: ఏపీలో( Andhra Pradesh) ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. మెరిట్ లిస్టులో ఉన్న అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన కొనసాగుతోంది. దాదాపు ఉద్యోగానికి ఖరారు అయిన వారికే కాల్ లెటర్లు పంపిస్తున్నారు. వారి సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. జిల్లా సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతోంది. పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. కానీ భారీగా అవకతవకలు జరుగుతున్నాయని వైసిపి, దాని అనుబంధం మీడియా ప్రచారం చేస్తోంది. 80 మార్కులకు పైగా వచ్చిన వారికి పోస్టింగ్ రావడం లేదు కానీ.. 30కు పైగా మార్కులు వచ్చిన వారికి ఎలా ఉద్యోగాలు ఇస్తున్నారన్న ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా వినిపిస్తున్నాయి. అయితే ఇంతకుముందే ప్రభుత్వం దీనిపై స్పష్టమైన ప్రకటన చేసింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ట్రాప్ లో పడొద్దని సూచించింది. అయితే ఇప్పుడు అదే మాదిరిగా వైసిపి ఆధారాలు లేని ఆరోపణలు సోషల్ మీడియా వేదికగా చేయడం అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పారదర్శకం అంటున్న ప్రభుత్వం..
కూటమి ప్రభుత్వం( Alliance government ) 16347 ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లక్షలాదిమంది అభ్యర్థులు ఆన్లైన్లో పరీక్షలు రాశారు. తరువాత పాఠశాల విద్యాశాఖ ఫలితాలను ప్రకటించింది. మెరిట్ లిస్టు ను ఆన్లైన్లో ఉంచింది. రిజర్వేషన్లు, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ఎంపికైన అభ్యర్థులను.. ముందు వరుసలో ఉన్న వారిని సర్టిఫికెట్ల పరిశీలనకు పిలిచింది. ఎంపికైన వారి తుది జాబితాను సైతం విడుదల చేస్తామని చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతోంది. దాదాపు 15 వేల మందికి పైగా అభ్యర్థులకు అధికారులు కాల్ లెటర్లు పంపించారు. అయితే తాము మెరిట్ లిస్టులో ఉన్నా.. కాల్ లెటర్లు రాలేదని చాలామంది చెబుతున్నారు. దీనిపై ఆందోళన వ్యక్తం అవుతుండడంతో వైసిపి సరికొత్త అంశాన్ని తెరపైకి తెచ్చింది. 37 మార్కులకు వచ్చిన వారికి పోస్టింగ్ ఇచ్చారని.. 80 మార్కులకు పైబడి వచ్చిన ఇవ్వలేదన్నది దాని సారాంశం.
చిన్నపాటి గందరగోళం
అయితే డీఎస్సీ( DSC) నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని మెజారిటీ ప్రజల అభిప్రాయం. కానీ నియామక ప్రక్రియకు సంబంధించిన మార్గదర్శకాలు మారుతుండడం పై మాత్రం అనుమానాలు ఉన్నాయి. టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించడానికి ఎక్కువ మంది వ్యతిరేకిస్తున్నారు. చివరి నిమిషంలో ఇలా మార్పు చేయడంతో వేలాదిమంది అభ్యర్థులకు నష్టం జరిగింది. వాస్తవానికి టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో నాన్ లాంగ్వేజ్ సబ్జెక్టు లైన గణితం, బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్ పరీక్షలు రాసిన వారికి ఇంగ్లీష్ ప్రొఫెషియన్సీ టెస్ట్ అవసరం లేదని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. పైగా ఎస్ జి టి స్పెషల్ ఎడ్యుకేషన్ డీఎస్సీ సిలబస్, పరీక్ష విధానం, చివరికి హాల్ టికెట్లను ఇదే అంశాన్ని పొందుపరిచారు. ఈ క్రమంలో చాలామంది అభ్యర్థులు మంచి మార్కులతో అర్హత సాధించారు. అయితే కాల్ లెటర్లు పంపే సమయంలో.. టీజీటీ – స్పెషల్ ఎడ్యుకేషన్ అభ్యర్థులు ఈ పి టి పాస్ కాలేదని పేర్కొంటూ అనర్హులుగా ప్రకటించడం మాత్రం గందరగోళానికి దారితీసింది. అంతకుమించి ఇందులో లోపాలు కనిపించడం లేదు. పారదర్శకంగానే ఎంపిక ప్రక్రియ జరిగినట్లు స్పష్టం అవుతుంది. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి ప్రచారానికి దిగుతుండడం మాత్రం ప్రభుత్వానికి ఇబ్బందికరమే. దీనిని నివృత్తి చేయాల్సిన అవసరం ప్రభుత్వం పై ఉంది.
ఏపీ DSC-2025 నియామకాల్లో తీవ్ర అవకతవకలు ..
37 మార్కులకే DSC లో ఉద్యోగం ✅
85+ మార్కులు పైగా వచ్చిన అభ్యర్థులకు నో కాల్ లెటర్లు❌మెరిట్ లిస్ట్ ఇవ్వకుండా కాల్ లెటర్లు ఇచ్చి .. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కి పిలుస్తున్న ప్రభుత్వం
— వై.యస్.ఆర్ కుటుంబం™ (@_Ysrkutumbam) September 1, 2025