Bengaluru Central Jail : తాగేవాళ్లు తాగుతున్నారు. తూగే వాళ్ళు తూగుతున్నారు. ఖరీదైన మద్యం సీసాలు.. తినడానికి పండ్లు.. ఎండు ఫలాలు.. ఇలా చెప్పుకుంటూ పోతే అక్కడ ఎన్నో ఉన్నాయి.. అలాగని ఇదేదో ఖరీదైన వ్యక్తులు ఇచ్చిన పార్టీ కాదు.. సెలబ్రిటీలు చేసుకున్న దావత్ అంతకన్నా కాదు. ఖైదీలు చేసుకున్న పార్టీ ఇది. సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తూ.. హాయిగా మందు కొడుతూ వారు ఎంజాయ్ చేశారు. వాస్తవానికి ఎంతో కట్టుదిట్టమైన భద్రత ఉండే సెంట్రల్ జైల్లో ఇలాంటి ఘనకార్యం జరగడం నిజంగా యావత్ దేశాన్ని ముక్కున వేలేసుకునే విధంగా చేస్తోంది.
మనదేశంలో ఉన్న అతిపెద్ద కారాగారాలలో బెంగళూరు సెంట్రల్ జైలు ఒకటి. ఇందులో అత్యంత కరుడుగట్టిన నేరస్తులు శిక్ష అనుభవిస్తున్నారు. అందులో ఐసిస్ ఉగ్రవాది జుమైమ్ షకీల్ మున్నా, అనేక అత్యాచారాలకు పాల్పడిన ఉమేశ్ రెడ్డి, తన అభిమానిని దారుణంగా చంపేసిన దర్శన్.. ఇంకా చాలామంది నేరస్తులు ఈ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.. దర్శన్ ఆ మధ్య టీ తాగుతూ.. పేపర్ చదువుతూ.. హాయిగా బెడ్ మీద సేద తీరుతూ కనిపించాడు. ఐసిస్ ఉగ్రవాది జుమైమ్ షకీల్ మున్నా టీ తాగుతూ, ఫోన్ సర్ఫింగ్ చేస్తూ దర్శనమిచ్చాడు. ఉమేష్ రెడ్డి కూడా స్వేచ్ఛగా జైలు పరిసరాలలో తిరుగుతూ.. బెడ్ మీద హాయిగా కునుకుతీస్తూ కనిపించాడు.
వాస్తవానికి కారాగారాలలో ఖైదీలకు కఠినమైన శిక్షను అమలు చేస్తారు. అవసరమైతే వారికి ఎటువంటి సౌకర్యాలు అందకుండా శిక్ష విధిస్తారు. కానీ బెంగళూరు సెంట్రల్ జైల్లో ఏకంగా కరుడుగట్టిన నేరస్తులు మందు పార్టీ చేసుకుంటున్నారు అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. పైగా వారు మందు పార్టీ చేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. అసలు జైల్లో ఉన్న ఖైదీలకు మందు ఎవరు సప్లై చేశారు.. వారు తినడానికి పండ్లు.. ఎండుఫలాలు ఎవరు అందించారు.. బార్ లో మాదిరిగా తాగుతూ.. ఖైదీలు ఎంజాయ్ చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు.. ఇదంతా కూడా వీడియోల రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పడేదాకా పోలీసులు నిద్రపోతున్నారా? ఇప్పుడు ఇదే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ వీడియోలు బయటికి రావడంతో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది. వెంటనే సంబంధిత సిబ్బందిపై విచారణ మొదలుపెట్టింది. ఎంతో కరుడుగట్టిన నేరస్తులు శిక్ష అనుభవిస్తున్న ఈ జైల్లో భద్రత లోపం ఈ స్థాయిలో ఉండడం పట్ల విస్మయం వ్యక్తమౌతోంది.