CM Jagan: నాయకుడు అన్నాక విశాల దృక్పథం అవసరం. అందునా రాష్ట్రానికి సీఎం అంటే మరింత బాధ్యత ఉంటుంది. ప్రతీ నిర్ణయం అచీతూచీ ఆలోచించి తీసుకోవాలి. కానీ మొన్నటి ప్రభుత్వాల వరకూ అదే జరిగేది. రాజకీయ లబ్ధితో నిర్ణయాలు తీసుకోవడం సహజమే అయినా.. అన్నివర్గాలకు సమ ప్రాధాన్యమిస్తూ తీసుకోవాల్సి అవసరం పాలకులపై ఉంది. అయితే ఈ విషయంలో తాను అతీతుడిగా జగన్ భావిస్తున్నారు. నలుగురికీ నచ్చినది.. నాకు అస్సలు నచ్చదన్నట్టు వ్యవహరిస్తున్నారు. నాదారి రహదారి డోంట్ కమిన్ మై వే అన్న డైలాగును గుర్తుచేస్తూ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ నవ్వులపాలవుతున్నారు. ఇప్పటివరకూ పాలనా పరంగా తీసుకున్న ఏ నిర్ణయమూ సక్సెస్ కాలేదు. డెసిసన్ తీసుకున్నప్పుడు ఒకలా కనిపిస్తున్న జగన్.. తరువాత అమలుచేస్తున్నప్పుడు ప్రజలకు అపరిచితుడిగా దర్శనమిస్తున్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఉన్నారు. కానీ తాను రెడ్డి సామాజికవర్గానికి మాత్రమే సీఎంనన్నట్టు వ్యవహరిస్తున్నారు. రాజకీయ పదవుల నుంచి ప్రభుత్వ బ్యూరోక్రసీ వ్యవస్థను వారితోనే నింపేశారు. ఇప్పుడు పోలీస్ బాస్ నుంచి కింది స్తాయి హోంగార్టు వరకూ తన సామాజికవర్గాన్ని నింపే ప్రయత్నంలో ఉండడం ఆందోళన కలిగిస్తోంది,

రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి, కీలక మంత్రులు రెడ్డి, సలహాదారులు రెడ్డి, నాలుగు ప్రాంతాల్లో పార్టీ సమన్వయకర్తలు రెడ్డి సామాజికవర్గం వారే. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత ఉంది. పోనీ సిన్సియర్ అధికారులు, పోలీస్ ఆఫీసర్లు లేరా? అంటే కొదువ లేదు. కానీ వారంతా అప్రాధాన్యత పోస్టులకే పరిమితమయ్యారు. కాదు కాదు అలా చేసేశారు. అన్ని శాఖల్లోనూ రెడ్డిలతో నింపేశారు. చివరకు నామినేటెడ్ పోస్టుల్లో సైతం వారిదే అగ్రస్థానం. మిగతా వారికి పేరుకే పదవులు కానీ.. రెడ్డి సామాజికవర్గానికి చెందిన అస్మదీయులకు పవర్ కట్టబెట్టేశారు. పోనీ జనాభా పరంగా రాష్ట్రంలో పావు భాగమైనా లేరు. ఉంటే గింటే ఓ ఆరు శాతం ఉంటారు. కానీ అన్ని శాఖల్లో సగానికిపైగా ఉండేది వీరే. అందులో విభాగాధిపతులే అధికం. పోనీ ఈ ఆరేడు శాతం రెడ్లు తనకు ఏకపక్షంగా ఓటేశారని భావిస్తే.. మిగతా 43 శాతం ఓటర్లు ఎవరు? అన్నది కూడా తెలుసుకోవాలి కదా. వాస్తవానికి జగన్ విజయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీలదే కీలక భూమిక. కానీ వారిని పక్కన పెట్టేందుకు కూడా జగన్ సాహసించడం లేదు. అందుకే వారిని పక్కనపెట్టి మరీ సొంత సామాజికవర్గాన్ని దగ్గర చేసుకుంటున్నారు. వివాదాస్పద నిర్ణయాలతో సతమతమవుతున్నారు.

వాస్తవానికి రెడ్డి సామాజికవర్గం వారు ఉద్యోగవర్గాలు చాలా తక్కువ. వారు ఎక్కువగా వ్యాపారాలు వైపే మొగ్గుచూపుతారు. అయినా ఉన్న తక్కువ మంది ఉద్యోగులను దొడ్డిదారిన అందలం ఎక్కిస్తున్నారు. కీలక పదవులు కట్టబెడుతున్నారు. పక్క రాష్ట్రాల్లో ఉండే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఏరికోరి తెచ్చి కీలక విభాగాల్లో నియమిస్తున్నారు. టీడీడీ ఈవో ఈక్రమంలో వచ్చిన వారే. అయితే ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఇతర వర్గాల అధికారులకు మాత్రం రిక్తహస్తమే ఎదురవుతోంది. అప్రాధాన్యత పోస్టుల్లో కొనసాగాల్సి వస్తోంది. జగన్ రాజకీయ పరిధి పెరిగింది తప్ప తన మనసును విశాలపరచుకుంటున్నారు. ఒక కులంపై బాహటంగానే తన వ్యతిరేకతను వ్యక్తపరుస్తున్నారు. మరో కులం తీరుపై పెదవివిరుస్తుంటారు. ఇతర వెనుకబడిన కులాలను నమ్మలేకపోతున్నారు. అలాగని రెడ్డి సామాజికవర్గం వారంతటికీ న్యాయం జరుగుతుందా అంటే అదీ లేదని ఆ వర్గం నుంచి కూడా ఆవేదన కనిపిస్తోంది. అస్మదీయులైన నలుగురైదుగురు రెడ్లు, పదుల సంఖ్యలో అధికారులు ఇంతో కొంత లబ్ధిపొందుతున్నారు. అటు ఇతర కులాలను ఆదరించక.. సొంత కులంలో మెజార్టీ వర్గాల అభిమానాన్ని చూరగొనలేకపోతున్న జగన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.