Etela Rajender: ఈటల రాజేందర్‌ను ఒంటరి చేసేందుకు అధికార టీఆర్‌ఎస్‌తోపాటు కులసంఘాలు, ఇతర సంస్థలు టీఆర్‌ఎస్‌కు వంతపాడుతూ ఊహించని విధంగా మద్దతునిస్తున్నాయి. తాజాగా బీసీ సంఘాలు కూడా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు వ్యతిరేకంగా ప్రచారంలోకి దిగాయి. ఉప ఎన్నిక దగ్గర పడుతున్నా కొద్దీ ఈటల టార్గెట్ అవుతున్నారు. ఎలాగైనా గెల్లు శ్రీనివాస్‌ను గెలిపించుకునేందుకు టీఆర్‌ఎస్ కలిసివచ్చే అన్ని సంఘాలను, సంస్థలను ఈటలపైకి ఉసిగొల్పుతోంది.

ఈటల రాజేందర్ ఇప్పటికే తాను బీసీ బిడ్డనని, ముదిరాజుల బిడ్డనని, తనను తన బీసీలే కాపాడుకుంటారని ప్రచారంలో చెబుతూ వచ్చారు. అయితే బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలోని బీసీ సంఘాలు మాత్రం ఈటలతో దోస్తీని కట్ చేస్తున్నట్టు ప్రకటించాయి. ఇటీవల హైదరాబాద్‌లోని ఓ హౌటల్‌లో సమావేశమైన బీసీ సంఘాల జేఏసీ నేతలు టీఆర్‌ఎస్‌కు సపోర్ట్ చేయాలని నిర్ణయించుకున్నాయి. ఈ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కి మద్దతు తెలుపుతూ కీలక నిర్ణయం తీసుకున్నాయి.
ఆ వెంటనే ఈటల చేరిన బీజేపీ పైనా, ఈటలపైనా విమర్శలు గుప్పిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ప్రచారంలోకి రంగప్రవేశం చేశారు. బీసీ కులగణన చేయని బీజేపీకి ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. బీసీల కోసం బీజేపీ ఏం చేసిందని ప్రశ్నించారు. బీజేపీ చరిత్ర మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు వ్యతిరేకమేనని మండిపడ్డారు. బీసీ కులగణన చేయకపోతే ఎందుకు ఓటేయాలని ఆయన సూటిగా ప్రశ్నించారు. బీసీల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క హాస్టల్ పెట్టలేదని చెప్పుకొచ్చారు.
అయితే కేసీఆర్ మాత్రం బీసీలు అడగ్గానే విద్యార్థుల కోసం గురుకులాలు పెట్టారని, కల్యాణలక్ష్మి పథకం ఇచ్చారని చెప్పారు. అయితే బీజేపీ కొంతకాలంగా తమను సంప్రదించి టీఆర్‌ఎస్ వ్యతిరేకంగా మాట్లాడాలని ఒత్తిడి తేస్తున్నారని చెప్పటం కొసమెరుపు. అయితే కేసీఆర్ త్వరలో బీసీ బంధు కూడా పెడతారనే ధీమాలో బీసీ నేతలున్నారు. ఆ మేరకు కేసీఆర్ వద్ద మాట తీసుకున్నామని చెబుతున్నారు. ఈటల రాజేందర్ ఇన్ని రోజులు బీసీ బిడ్డగా ఉండి బీసీలకు ఏం చేశారని ఆర్.కృష్ణయ్య ప్రశ్నిస్తున్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ ఓడిపోతేనే బీసీలు బాగుపడతారని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా సాధారణ టీఆర్‌ఎస్ కార్యకర్తల్లా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచారని బీసీ జేఏసీ నేతలు బీజేపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటల రాజేందర్ 18 ఏళ్లు పదవి అనుభవించారని.. ఇంకా చాలదా ఆయనకు అని నిలదీశారు. ఈ రెండేళ్లు గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కి అవకాశమిచ్చి గెలిపించుకోవాలన్నారు. ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్న బీజేపీకి ఓటు వేయొద్దని పిలుపునిచ్చారు. అనూహ్య పరిణామంతో రాజకీయ ముఖచిత్రం ఎలా మారుతుందో వేచిచూడాల్సి ఉంది.
Also Read: Huzurabad: హుజూరాబాద్ లో డబ్బుల పంపిణీ వీడియో హల్ చల్..