Heavy Rainfall In Telugu States: మొన్నటిదాకా ఎండలు దంచి కొట్టాయి. కనీసం వర్షాలు కూడా కురవలేదు. చిన్నపాటి జల్లులు కూడా రాలేదు. ఎక్కడ కూడా వర్షాల కురిసిన దాఖలాలు కనిపించలేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. వరి నారుమడులు పోసిన రైతులు కాపాడుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు. ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెచ్చి నారుమడులను తడుపుకున్నారు.
రెండు రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మారిపోయింది. అంతకంటే ముందు ఎండలు కొట్టడం వెనక పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడిన ఎల్ నీనో కారణమని వాతావరణ నిపుణులు చెప్పారు. పసిఫిక్ మహాసముద్రంలో ఉపరితల జలాలు వేడిగా ఉన్న నేపథ్యంలో.. నైరుతి రుతుపవనాల విస్తరణకు అనుకూలమైన వాతావరణం ఏర్పడలేదు. దీంతో వర్షాలకు బదులుగా ఎండలు కొట్టాయి. ఎండా కాలాన్ని మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఎల్ నీనో వల్ల వర్షాలు కురిసే అవకాశం లేదని వాతావరణ శాఖ నిపుణులు చెప్పారు. బంగాళాఖాతంలో ఏదైనా అల్పపీడనం ఏర్పడితే తప్పా వర్షాలు కురిసే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చారు. అనుకున్నట్టుగానే ఇప్పుడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా మూడు రోజులపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ ప్రాంతాలలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ, మధ్య తెలంగాణ ప్రాంతాలలో మోస్తరు వర్షాలు కురవడానికి అవకాశం ఉంది.
వాయువ్య బంగాళాఖాతానికి సమీపంలో ఉన్న పశ్చిమ బెంగాల్.. ఉత్తర ఒడిషా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. ఇది మరి కొద్ది రోజుల్లో బలపడే అవకాశం ఉంది. గంటకు ఏకంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. వర్షాలు కూడా అదే స్థాయిలో కురుస్తాయి. శుక్రవారం ఇప్పటికే పశ్చిమగోదావరి.. తూర్పుగోదావరి జిల్లాలలో ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. పిడుగులు కూడా పడ్డాయి. మిగిలిన ప్రాంతాలలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అల్ప పీడనం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఫలితంగా విద్యుత్ డిమాండ్ కూడా పడిపోయింది.

