Barrelakka: బర్రెలక్క ముందంజ.. ప్రశ్నించే గొంతుకకు కొల్లాపూర్ జై

పట్టభద్రురాలు అయినప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో.. నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ వాటిని నెరవేర్చకపోవడంతో.. తాను పోటీ చేస్తున్నట్టు శిరీష ప్రకటించింది. అనుకున్నట్టుగానే ఆమెకు సమాజం మద్దతు లభించింది.

Written By: Anabothula Bhaskar, Updated On : December 3, 2023 11:57 am

Barrelakka

Follow us on

Barrelakka: రాజకీయాలు డబ్బుమయం అయిపోయాయి. కార్పొరేట్లు రాజకీయాలను శాసిస్తున్నారు. పార్టీలు డబ్బులను ఇష్టానుసారంగా వెదజల్లుతున్నాయి.. ఇలాంటి వార్తలను మనం తరుచూ చదువుతూనే ఉంటాం.. ప్రస్తుత తెలంగాణ ఎన్నికల్లో ప్రత్యక్షంగా చూశాం. కానీ గంజాయి వనంలో తులసి మొక్క పుట్టినట్టు.. నిస్తేజంగా మారిన సమాజంలో ప్రశ్నించే గొంతుక ఉద్భవించినట్టు.. బర్రెలక్క అలియాస్ శిరీష రూపంలో ఒక ప్రశ్నించే తత్వం ఉన్న యువతి తెరపైకి వచ్చింది. అంతకుముందు తెలంగాణ రాష్ట్రంలో నెలకొని ఉన్న నిరుద్యోగాన్ని ప్రశ్నించి ప్రభుత్వం తీరు పట్ల ఒక వ్యంగ్యమైన వీడియోను రూపొందించి ఆమె సోషల్ మీడియాలో పెట్టింది. ఆ వీడియోతో ఆమె ఒక్కసారిగా పాపులర్ అయిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులపాటు తన బతుకేదో తాను బతికింది. కానీ అనూహ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ ఇవ్వడం.. బర్రెలక్క అలియాస్ శిరీష కొల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేయడం వెంట వెంటనే జరిగిపోయాయి.

సమాజం మద్దతుగా నిలిచింది

తాను పట్టభద్రురాలు అయినప్పటికీ ఉద్యోగం రాకపోవడంతో.. నీళ్లు నిధులు నియామకాలు అనే పేరుతో అధికారంలోకి వచ్చిన పార్టీ వాటిని నెరవేర్చకపోవడంతో.. తాను పోటీ చేస్తున్నట్టు శిరీష ప్రకటించింది. అనుకున్నట్టుగానే ఆమెకు సమాజం మద్దతు లభించింది. సోషల్ మీడియా అయితే ఆమెను నెత్తిన పెట్టుకుంది. చాలామంది ఆమెకు విరాళాలు ఇచ్చారు. ప్రచారంలో ఆమె వెంట ఉండి నడిచారు. ఇదే సమయంలో ఆమెకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను కొంతమంది బయటకు లాగారు. అది సహజంగానే శిరీష కు లాభాన్ని చేకూర్చి పెట్టింది. ప్రధాన మీడియా కూడా ఆమెను ఫోకస్ చేయడంతో వార్తల్లో వ్యక్తి అయిపోయింది. రాష్ట్రంలో కెసిఆర్, రేవంత్ రెడ్డి కంటే ఎక్కువగా ఆమె ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఆమె అఫిడవిట్ ను ఏకంగా 30 వేల మంది డౌన్లోడ్ చేసుకుని చూశారంటే ఆమెకు ఉన్న క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

ప్రశ్నించే గొంతుకగా..

ప్రశ్నించే గొంతుకగా తాను నిరుద్యోగుల వెంట ఉంటానని శిరీష ప్రకటించింది. అన్నట్టుగానే తాను నిర్వహించిన ప్రతి ఎన్నికల సభలోనూ అదే తీరుగా మాట్లాడింది. ఫలితంగా ఆమె మాట్లాడే ప్రతి మాట కొల్లాపూర్ నియోజకవర్గం లో ఒక తీవ్రమైన చర్చకు దారితీసింది.. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా ప్రచారం చేయడంతో ఇది ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఇబ్బందికరంగా మారింది. వెలమలు, రెడ్లు అధికంగా ఉండే కొల్లాపూర్ నియోజక వర్గంలో ఒక దళిత యువతి ఈ స్థాయిలో పేరు తెచ్చుకోవడం సహజంగానే కిందిస్థాయి సామాజిక వర్గాలలో ఒక ఆలోచన రేకెత్తడానికి కారణమైంది. ఇది అంతిమంగా శిరీష వైపు జనం నడిచేలా చేసింది. ప్రస్తుతం జరుగుతున్న ఓట్ల లెక్కింపులో జూపల్లి కృష్ణారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డి, అల్లిని సుధాకర్ రావు వంటి వారిని కాదని.. బర్రెలక్క ముందంజలో కొనసాగుతోంది. రౌండ్ రౌండ్ కు తన లీడ్ పెంచుకుంటూ పోతుంది. ఒకవేళ చివరి రౌండ్ వరకు ఇదే ఫలితం కొనసాగితే కచ్చితంగా శిరీష 2023 తెలంగాణ ఎన్నికల్లో ఒక పెను సంచలనం అవుతుంది. డబ్బుతో కూడిన రాజకీయాల్లో ప్రజాస్వామ్యం బతికే ఉందని నిరూపించిన యువతి అవుతుంది