Banks Write Off Loans: సాధారణ ప్రజలు బ్యాంకు రుణాలను సకాలంలో కట్టకపోతే నోటీసులు, వేలంలు, జరిమానాలతో తెగ హడావుడి చేస్తారు. వారిని బ్లాక్ లీస్టులో పెట్టి మిగతా బ్యాంకులు, ప్రైవేటు వ్యక్తులు అప్పులు ఇవ్వకుండా చేస్తారు. కానీ లక్షల కోట్లు ఎగవేసిన వారికి మాత్రం ఎటువంటి దండన లేదు సరికదా వారి అప్పులను ఏకంగా రద్దుచేసి… రుణగ్రహీతల జాబితా నుంచి తొలగిస్తుండడాన్ని ఏమనాలి. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ రుణ ఎగవేతదారులకు సంబంధించి రూ.10 లక్షల కోట్ల రుణాలను రద్దు చేసినట్టు ప్రకటించడం విస్మయం గొలుపుతోంది. ఆదాయం విషయంలో ముందండే మోదీ సర్కారు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.
ముక్కుపిండీ పన్నుల వసూలు..
దైనందిన జీవితంలో ఉదయం నుంచి రాత్రి వరకూ కొనుగోలు చేసే ప్రతీ వస్తువు నుంచి జీఎస్టీ వసూలు చేస్తున్నారు. ముక్కుపిండి మరీ బాదేస్తున్నారు. పేద, ధనిక అన్న బేదం లేకుండా అవకాశం ఉన్నచోట ఆదాయాన్ని లాగేస్తున్నారు. అయితే ఇలా అధిక మొత్తంలో వస్తున్న ఆదాయం ఇలా రుణ ఎగవేతదారులకు ఇస్తున్నారన్న ప్రశ్న అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎదురవుతోంది. సాధరణ ప్రజలకు బ్యాంకు సకాలంలో రుణాలు కట్టనప్పుడు బ్యాంకర్లు తెగ హడావుడి చేస్తారు. సిబిల్ స్కోరు నాశనమైపోయితుందన్నట్టుగా.. భవిష్యత్ లో అప్పు పుట్టదంటూ ఆందోళనకు గురిచేస్తుంటారు. సామాన్యుల విషయంలో సవాలక్ష భయాలు పెట్టే బ్యాంకర్లు బడా బాబుల విషయంలో ఎందుకు చూపడం లేదన్న ప్రశ్నకు సమాధానం లేకుండా పోతోంది.
రూ.10 లక్షల కోట్ల బకాయిలు రద్దు..
గత ఐదేళ్లలో బ్యాంకులు దాదాపు రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగత్ పార్లమెంట్ లో వెల్లడించారు. గత నాలుగేళ్లలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల సంఖ్య 10,306కు చేరుకున్నట్టు ప్రకటించారు. ఇందులో అత్యధికంగా వజ్రల వ్యాపారి మెహూల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ రూ.7,110 కోట్లు, ఈరా ఇన్ ఫ్రా రూ.5,879 కోట్లు, కాన్ కాస్ట్ స్టీల్స్ లిమిటెడ్ రూ.4,107 కోట్లు బకాయి ఉన్నట్టు తెలిపారు. అయితే ఈ ప్రకటన వెలువడిన తరువాత సామాన్యుడిలో సైతం ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. సామాన్యులకు ఒక న్యాయం.. బడా బాబులకు మరో న్యాయమా అంటూ ప్రశ్నలపరంపర ఎదురవుతోంది. సామాన్యుల విషయంలో ష్యూరిటీలను పక్కగా చూసి రుణాలు అందించే బ్యాంకర్లు,రుణ ఎగేవతదారుల విషయంలో మాత్రం ఉదాసీనంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది.
విస్మయం గొలుపుతున్న నిర్ణయం..
ఏడాదికి లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దుచేసినట్టు కేంద్రం ప్రకటించడం విస్మయం గొలుపుతోంది.2021 ఏప్రిల్ నుంచి 2022 మార్చి 31 మధ్య రూ.1.57 లక్షల కోట్లు, అంతకు ముందు ఏడాది రూ.2.02 లక్షల కోట్లు, 201920లో రూ.2.34 లక్షల కోట్లు, 201819లో రూ.2.36 లక్షల కోట్లు మొండి అప్పులనురద్దుచేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వాలు, బ్యాంకర్ల ఉదాసీనతే దీనికి కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎవరో అప్పులు చేయడం ఏమిటి? వారు అప్పు కట్టకపోతే రద్దు చేయడం ఏమిటి? ప్రజల నుంచి పన్నుల రూపంలో వస్తున్న ఆదాయం మాటేమిటి అన్న ప్రశ్న ఇప్పుడు తొలుస్తోంది. ప్రభుత్వం కూడా ఉద్దేశపూర్వకంగా రుణ ఎగవేతదారుల పేర్లును బయటపెట్టినట్టు అనుమానాలున్నాయి. ఆదాయం విషయంలో మొండిగా వ్యవహరించే మోదీ సర్కారు.. అప్పులు ఇచ్చే విషయంలో మాత్రం శ్రద్ధ కనబరచకపోవడం ఏమిటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక తిరోగమన దిశలో దేశం ఉన్న దృష్ట్యా ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరమైతే మాత్రం ఉంది.