Bandi VS CP: బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ పట్ల కరీంనగర్ సీపీ సత్యనారాయణ ఇటీవల దురుసుగా ప్రవర్తించడం వివాదానికి దారితీసింది. గల్లీలో మొదలైన ఈ వివాదం కాస్తా నేడు ఢిల్లీలోని ప్రివిలేజ్ కమిటీ ముందుకు చేరింది. శుక్రవారం సంజయ్ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఎదుట హాజరై తన వాదనలు బలంగా విన్పించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ సర్కార్ జారీ చేసిన 317 జీవోను సవరించాలని కోరుతూ ఈనెల 2న బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టగా పోలీసులు బీజేపీ కార్యాలయం తలుపులు బద్దలుకొట్టి మరీ ఆయన కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లారని ఆరోపించారు. ఈ విషయాన్నే ఆయన పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేసి సీపీ సత్యనారాయణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ ఇష్యూకు సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు, వార్తా క్లిప్పింగులను బండి సంజయ్ ఫైల్ రూపంలో కమిటీకి సంజయ్ సమర్పించారు. తనపై అకారణంగా పోలీసులు దాడి చేశారని, అరెస్టు సందర్భంగా దురుసుగా ప్రవర్తించారని ఆయన ఆరోపిస్తుంచారు. గతంలోనూ కరీంనగర్ పోలీసులు ఇలానే ప్రవర్తించారని వివరించారు.
బండి సంజయ్ ఇచ్చిన ఆధారాలను పరిశీలించాక ఆరోపణలు ఎదుర్కొంటున్న సీపీతోపాటు మరో ముగ్గురు పోలీస్ అధికారులకు కమిటీ నోటీసులు జారీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. కరీంనగర్ పోలీసులపై బండి సంజయ్ పార్లమెంటుకు ఫిర్యాదు చేయడం ఇది రెండోసారి. అది కూడా ప్రస్తుత సీపీ సత్యనారాయణపైనే.
2019లో ఆర్టీసీ సమ్మె సమయంలో ఓ ఆర్టీసీ కార్మికుడి శవయాత్రలో బండి సంజయ్ పాల్గొన్నాడు. నాడు పోలీసులు ఆయనతో అసభ్యంగా ప్రవర్తించారు. అయితే ఆ సమయంలో అప్పటి సీపీ కమలాసన్‌రెడ్డి సెలవులో ఉండగా రామగుండం సీపీగా ఉన్న సత్యనారాయణ కరీంనగర్‌కు ఇన్‌చార్జి సీపీగా వ్యవహరించారు. నాడు పోలీసులు సంజయ్‌ను అదుపులోకి తీసుకున్న తీరు వివాదాస్పదంగా మారింది.
ఇదిలా ఉంటే ఈనెల 2న బండి సంజయ్ జాగరణ దీక్షను భగ్నం చేసిన ఘటనలో సీపీ సత్యనారాయణ గురువారం జాతీయ బీసీ కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇచ్చారు. ఎంపీ సంజయ్ కరోనా నిబంధనలు ఉల్లంఘించి భారీ జన సమీకరణతో దీక్ష తలపెట్టిన నేపథ్యంలోనే ఆయనను అరెస్టు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చారు.
మరోవైపు కేంద్రం ప్రభుత్వం ఈ ఇష్యూను సిరియస్ గా తీసుకుంది. పార్లమెంట్ ప్రివిలేజెస్ కమిటీ సత్యనారాయణపై చర్య తీసుకోవాలని సిఫారసు చేస్తే ఆయనకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం కన్పిస్తోంది. ఢిల్లీ పెద్దలు అతడిని ఛత్తీస్ ఘడ్ లేదంటే బీహార్ రాష్ట్ర క్యాడర్ కు పంపించే అవకాశాలు కన్పిస్తున్నాయి.
కేంద్రం నుంచి బండికి ఫుల్ సపోర్టు ఉండటంతో ఈ విషయంలో సీపీకి బీజేపీ నేతలు చుక్కలు చూపించడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో కరీంనగర్ సీపీ సత్యనారాయణ ముఠాముల్లె సర్దుకోవాల్సిందేననే కామెంట్స్ సర్వత్రా విన్పిస్తున్నాయి.