Bandi Sanjay: అధ్యక్షుడి నుంచి తప్పించారు… ఇక మనకు ఊరట లభించినట్లే.. ఈ ఆ పార్టీలో దూకుడు ఉండదు.. వచ్చే ఎన్నికల్లో పెద్ద ఆటంకం మనకు తప్పినట్లే.. అనుకున్నారు బీఆర్‌ఎస్ నాయకులు. కానీ బీఆర్‌ఎస్ విషయంలో తగ్గేదేలే అంటున్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. అధ్యక్షుడిగా రాష్ట్రంలోనే కేసీఆర్, బీఆర్‌ఎస్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టిన సంజయ్.. ఇప్పుడు పార్లమెంట్ వేదికగా ఆ పార్టీని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చెడుగుడు ఆడుకున్నారు. కేసీఆర్ కుటుంబ పాలనను జాతీయస్థాయిలో ఎండగట్టారు. కేంద్రం నిధులను రాష్ట్రం ఎలా దారిమళ్లిస్తుందో వివరించారు. కేంద్రం నిధులతో చేపట్టే పనులను కూడా రాష్ట్రం తామే చేస్తున్నట్లు ఎలా ప్రచారం చేసుకుంటుందో ఏకరువు పెట్టారు. నాలుగున్నరేళ్ల ఎంపీ పదవీ కాలంలో ఎన్నడూ లేనివిధంగా లోక్‌సభలో బండి సంజయ్ చేసిన ప్రసంగం కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వ తెలంగాణకు చేస్తున్న అన్యాయానికి అద్దం పడుతోంది. టీవీల్లో బండి ప్రసంగం విన్న తెలంగాణ ప్రజానీకం ఆశ్చర్యానికి గురైంది. ప్రసంగం మిస్ అయినవారు, మళ్లీ మళ్లీ వినాలనుకునేవారు యూట్యూబ్‌లో వెతికి మరీ వింటున్నారు.
అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా మాట్లాడే చాన్స్..
లోక్‌సభలో ఎన్డీఏ ప్రభుత్వంపై విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బండి సంజయ్‌కు మాట్లాడే అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా అవినీతి యూపీఏ కూటమి.. ఇండియాగా ఎలా మారిందో.. కుటుంబ పార్టీ టీఆర్‌ఎస్ కూడా బీఆర్‌ఎస్‌గా మారిందన్నారు. బీఆర్‌ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షస సమితి అని చురకలంటించారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ అంటే ఖాసిం చంద్రశేఖర్ రిజ్వీ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కల్వకుంట్ల కుటుంబం దోచుకుంటోందని.. అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కుమారుడి ఆస్తులు 400 రెట్లు పెరిగాయని ఆరోపించారు. సీఎం భార్య ఆస్తులు 1,800 శాతం పెరిగాయని వెల్లడించారు. తెలంగాణ రైతుల సగటు ఆదాయం రూ.1,12,236 అయితే.. సీఎం కేసీఆర్‌కు వ్యవసాయం ద్వారా ఆదాయం రూ.కోటి. కుమారుడి వ్యవసాయ ఆదాయం రూ.59,85,000 ఆదాయం అర్జించారని చెప్పారు. తెలంగాణ రైతుల ఆదాయం పెరగలేదు కానీ.. ముఖ్యమంత్రి కుటుంబం ఆదాయం మాత్రం గణనీయంగా పెరిగిందని ఆరోపించారు.
కేంద్ర నిధులను దోచుకుంటోంది..
కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింద విడుదల చేస్తున్న నిధులను తెలంగాణ ప్రభుత్వం దోచుకుంటోందని బండి సంజయ్ ఆరోపించారు. పీఎంఏవై పథకం కింద ఇంటి నిర్మాణం కోసం రూ. 2.50 లక్షల చొప్పున కేంద్ర ప్రభుత్వం అందిస్తే… డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. జల్‌జీవన్ మిషన్ కింద కేంద్రం ఇచ్చే నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం సహకరించలేదన్నారు. మణిపుర్‌కు ప్రధాని వెళ్లలేదంటూ గగ్గోలు పెడుతున్న బీఆర్‌ఎస్ ఎంపీలు.. మరి .. తెలంగాణ రైతులు, యువత, ఆర్టీసీ కార్మికులు, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే సీఎం కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదని… గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య సిబ్బంది జీతాల కోసం ఆందోళన చేస్తున్నారని వివరించారు.
మూడు పార్టీలు కుమ్మక్కు..
ఇక తెలంగాణలో కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్‌ఎస్ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. బీజేపీను నిక్కర్ పార్టీ అని కాంగ్రెస్ విమర్శించడం దారుణమన్నారు. లిక్కర్ పార్టీతో కాంగ్రెస్ కలిసిపోయిందని… ఢిల్లీలో విడివిడిగా ఉన్నట్టు నటిస్తూ.. తెలంగాణలో మాత్రం కలిసిపోతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన 12 మంది ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో చేరారని.. కాంగ్రెస్‌కు ఓటేస్తే బీఆర్‌ఎస్‌కు వేసినట్టే అని బండి సంజయ్ పేర్కొన్నారు.
వీళ్లతో ఏమీ కాదు..
మోదీ సర్కారుపై ‘అవిశ్వాసం ఎందుకు ప్రవేశపెట్టారో విపక్షాలకే క్లారిటీ లేదని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ వ్యవహారం చూసి ప్రపంచమంతా నవ్వుకుంటోందన్నారు. ముద్దులు పెడతారు.. ఫ్లయింగ్ కిస్‌లు ఇస్తారు.. మరోసారి కౌగిలించుకుంటారు… ఒకసారి కన్ను కొడతారు. ఆయన వ్యవహార శైలి చూస్తే గజినీ గుర్తొస్తాడని చురకలంటించారు.
భరతమాత వైపు కన్నెత్తి చూస్తే..
ఇక రాహుల్ మణిపూర్‌లో భరత మాతను హత్య చేశారని చేసిన వాఖ్యలపై బండి భావోద్వేగానికి లోనయ్యారు. నా భరత మాత ఎన్నటికీ హత్యకు గురికాదన్నారు. భరతమాతను హత్య చేశారంటున్నారని…. భరతమాత వైపు కన్నెత్తి చూస్తే.. కళ్లు పీకి బొందపెట్టే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఉన్నారని హెచ్చరించారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వారే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే ప్రజలు సహించే స్థితిలో లేరన్నారు. ఏ కాంగీ, బెంగాల్ కా దీదీ, దిల్లీ కా కేజీ, బిహార్ కా జేడీ, తెలంగాణ కా కేడీ… వీళ్లతోని ఏమీ కాదని మండిపడ్డారు.
పార్లమెంట్‌ను దేవాలంతో పోచ్చిన బండి..
ఇక బండి సంజయ్ పార్లమెంట్‌ను దేవాలయంలో పోల్చారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన దేవాలయం ఈ పార్లమెంట్ అని బండి సంజయ్ భావోద్వేగానికి గురయ్యారు. నీళ్లు, నిధులు, నియామకాలు, మా పాలన మాకు కావాలని 1,400 మంది బలిదానం అయిన తర్వాత సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే తెలంగాణ కోసం 1,400 మంది అమరులయ్యారని… రివాల్వర్‌తో కాల్చుకున్నారని చెప్పారు. రైలు వస్తుంటే…. జై తెలంగాణ అని ఎదురెళ్లి ఆత్మబలిదానం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా కాంగ్రెస్…. తెలంగాణ ఇవ్వలేదని… ఇదే లోక్‌సభ వేదికగా తెలంగాణ చిన్నమ్మ స్వర్గీయ సుష్మాస్వరాజ్.. తెలంగాణ యువకులారా ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిచ్చారని గుర్తు చేశారు. ఆ సమయంలో తెలంగాణ ప్రజలు కోరుకున్న రాష్ట్రాన్ని ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామని సుష్మాస్వరాజ్ ప్రకటించారని.. కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇస్తాం అని ప్రకటించారని గుర్తు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ బిల్లుపెడితే బీజేపీ మద్దతుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు.
మొత్తంగా ఎంపీగా లోక్‌సభలో గతంలో కొన్నిసార్లు సంజయ్ మాట్లాడినా.. అవిశ్వాసం సందర్భంగా ఆయన స్పీచ్ తెలంగాణనే కాదు యావత్ దేశ ప్రజలను ఆలోచింపజేసింది. సంఘ్ పరివార్ గీతం నమస్తే సదా.. అటూ పాడడంతో లోక్‌సభ కరచాల ధ్వనులతో మార్మోగింది.
