Assembly Fight: మంథనిలో మారుతున్న రాజకీయం

చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం నుంచి ఒకసారి పోటీ చేసి ఓటమి పాలై, 2014లో బీఆర్‌ఎస్‌ తరుఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు పుట్ట మధు. అయితే 2018లో బీఆర్‌ఎస్‌ హవాలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీధర్‌బాబు చేతిలో ఓడిపోయారు.

Written By: Raj Shekar, Updated On : August 11, 2023 12:48 pm

Assembly Fight

Follow us on

Assembly Fight: మంథని నియోజకవర్గం దేశంలో, రాష్ట్రంలో రాజకీయంగా పేరు పొందిన ఘనత మంథని నియోజకవర్గానికి ఉంది. దేశ ప్రధానిగా పీవీ.నర్సింహారావు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో శాసన సభ స్పీకర్‌గా దుద్దిళ్ల శ్రీపాదరావులు, మంత్రిగా శ్రీధర్‌బాబు ప్రాతినిత్యం వహించినది మంథని నియోజకవర్గం. 1957 నుంచి ఇప్పటి వరకు 15 సార్లు జరిగిన శాసనసభ ఎన్నికల్లో పీవీ.నర్సింహారావు, సి.నారాయణరెడ్డి, శ్రీరాం, శ్రీపాదరావు, రాంరెడ్డి, శ్రీధర్‌బాబు, పుట్ట మధు ఎమ్మెల్యేలుగా ప్రాతినిత్యం వహించారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ నియోజకర్గంలో పోటీ చేయనున్న ప్రధాన పార్టీల అభ్యర్థులతోపాటు, టిక్కెటు ఆశిస్తున్న అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్తున్నారు. పాడెలు మోయడం, పరామర్శించడం, పైసలు పంచడం అనే ట్రిపుల్‌ ‘ఫి’ కార్యక్రమాలు చేపడుతూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.

పట్టు నిలుపుకునే ప్రయత్నంలో సిట్టింగ్‌ శ్రీధర్‌బాబు
ఏఐసీసీ కార్యదర్శిగా, నియోజకరవ్గంలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఉన్నారు. అతడు, అతని సోదరుడు శ్రీనుబాబు కాంగ్రెస్‌ పార్టీ తరుఫున నియోజకవర్గంలో తమ కార్యకర్తలతో కలిసి శుభకార్యాలయాల్లో పాల్గొంంటూ, బాధిత కుటుంబాలను కలుస్తూ, అండగా ఉంటామని తెలుపుతూ నియోజకరవ్గంలో తిరుగుతూ పట్టు నిలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి, ప్రతిపక్షంలో ఉంటూ నియోజకవర్గ సమస్యలు శాసనసభ దృష్టికి తీసుకెళ్తూ పరిష్కారానికి చేస్తున్న కృషి మళ్లీ గెలిపిస్తుందని ధీమాతో ఉన్నారు.

పుట్ట మధుకు కష్టకాలం..
చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం నుంచి ఒకసారి పోటీ చేసి ఓటమి పాలై, 2014లో బీఆర్‌ఎస్‌ తరుఫున పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు పుట్ట మధు. అయితే 2018లో బీఆర్‌ఎస్‌ హవాలోనూ కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీధర్‌బాబు చేతిలో ఓడిపోయారు. తర్వాత జిల్లాపరిషత్‌ ఎన్నికల్లో జెడ్పీటీసీగా గెలిచి ప్రస్తుతం పెద్దపల్లి జెడ్పీ చైర్మన్‌గా ఉన్నారు. భార్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజతో కలిసి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. మృతుల కుటుంబాలను, ఇతర బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ, బీఆర్‌ఎస్‌ పార్టీ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అమలయ్యే విధంగా చూస్తూ నియోజకవర్గ ప్రజలు వద్ద మరింత మంచి పేరు పొందేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

స్వపక్షంలో విపక్షం..
జెడ్పీటీసీకి ఎక్కువ, ఎమ్మెల్యేకు తక్కువ అయిన పుట్ట మధుకు స్వపక్షంలోనే విపక్షం తయారవుతోంది. పార్టీలో పుట్ట మధు వ్యతిరేకవర్గం ఆయనకు టికెట్‌ రాకుండా పావులు కదుపుతోంది. బీఆర్‌ఎస్‌ సర్వేలో కూడా పుట్ట మధు పరిస్థితి బాగా లేదని తెలిసింది. దీంతో ఆయన వ్యతిరేక వర్గం మరింత పట్టు బిగిస్తోంది. దీంతో పుట్ట మధుకు టికెట్‌ వచ్చేది అనుమానంగానే కనిపిస్తోంది.

మధుకు పోటీగా నారాయణరెడ్డి
కాటారం మండలం దన్వాడకు చెందిన చల్ల నారాయణరెడ్డి పీఏసీఎస్‌ చైర్మన్‌గా బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. సీనియర్‌ నాయకులైన నారాయణరెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చాలాకాలం పనిచేశారు.మొదటి సర్పంచిగా, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా, సింగల్‌విండో చైర్మన్‌గా, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా, జెడ్పీటీసీగా పదువులు నిర్వహించారు. రిజర్వేషన్‌ కలిసి రాకపోవడంతో భార్య సుజాతను పోటీ చేయించి రెండు సార్లు దన్వాడ సర్పంచిగా, ఎంపీపీ పదవి గెలుచుకున్నారు. ఇటీవల బీఆర్‌ఎస్‌ పార్టీ మంత్రులకు, ముఖ్యమంత్రికి, పులువురి ఎమ్మెల్యేలను కలుస్తూ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ చురుకుగా ముందు కెళ్తున్నారు. పార్టీ అదిష్టానం ఆదేశిస్తే ఎమ్మెల్యేగా పోటీచేస్తానని సంకేతాలు ఇస్తున్నారు.

రంగంలోకి బీజేపీ..
మంథనిలో బీజేపీ ప్రభావం చాలా తక్కువ. కానీ, బండి సంజయ్‌ నాయకత్వంలో పార్టీకి మంచి ఊపు రావడంతో స్థానిక నేతలు బీజేపీలో చేరారు. ఆ పార్టీలో చేరిన మాజీ ఎంఎల్‌ఎ చందుపట్ల రాంరెడ్డి తనయుడు సునీల్‌రెడ్డి నియోజకరవ్గంలో పార్టీ బలోపేతానికి పాదయాత్రలు చేస్తూ, పరామర్శలు, బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం చేస్తూ ప్రజల ఆదరణ పొందేలా గెలుపే లక్షంగా నియోజకవర్గంలో నిత్యం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.