Homeజాతీయ వార్తలుBandi Sanjay: బండి ‘ముందస్తు’ ప్లాన్‌.. తెలంగాణలో బీజేపీ బహుముఖ వ్యూహం..!

Bandi Sanjay: బండి ‘ముందస్తు’ ప్లాన్‌.. తెలంగాణలో బీజేపీ బహుముఖ వ్యూహం..!

Bandi Sanjay: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి. సీఎం కేసీఆర్‌ వేస్తున్న అడుగులు చూస్తుంటే త్వరలోనే అసెంబ్లీ రద్దు చేసే అవకాశం కనిపిస్తోంది. దీంతో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి తామే ప్రత్యామ్నాయం అంటున్న బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ ‘ముందస్తు’ ప్లాన్‌ రెడీ చేస్తున్నారు. పాదయాత్రలతో ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న ఆయన ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో ప్లాన్‌ చేంజ్‌ చేసినట్లు తెలుస్తోంది.

Bandi Sanjay
Bandi Sanjay

‘ముందస్తు’ ప్లానింగ్‌..
సీఎం కేసీఆర్‌ త్వరలో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని రాజకీయవర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్న సమయంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం అందుకు అనుగుణంగా తమ గేమ్‌ ప్లాన్‌ చేంజ్‌ చేసింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్ధమని చెబుతున్న కమలనాథులు ఇప్పటికే సమరోత్సాహంతో కదులుతున్నారు. సీఎం కేసీఆర్‌ సడన్‌ గా అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళితే దానికి తగ్గట్టుగా బీజేపీ కూడా యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసింది.

బస్సెక్కనున్న ‘బండి’
ఇప్పటికి నాలుగు విడతలుగా బండి సంజయ్‌ పాదయాత్రను కొనసాగించారు. ప్రస్తుతం ఐదో విడత పాదయాత్ర నిర్మల్‌ జిల్లాలో సాగుతోంది. ఈ క్రమంలో బండి సంజయ్‌ పాదయాత్రను రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి చేయడం కోసం అదనంగా సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఊహించని విధంగా ముందస్తు ఎన్నికలకు నగారా మోగిస్తే బండి సంజయ్‌ పాదయాత్ర పూర్తయ్యే అవకాశం లేదు. దీంతో గేమ్‌ చేంజ్‌ చేసిన బీజేపీ బండి పాదయాత్ర నిలిపివేసి బస్సు యాత్ర చేయాలని ప్లాన్‌ చేస్తోంది. ఈ యాత్ర ద్వారా మరింత దూకుడు ప్రదర్శించాలని కాషాయ పార్టీ ఆలోచన చేస్తోంది.

Bandi Sanjay
Bandi Sanjay

సమీక్షలతో సమాయత్తం..
టీఆర్‌ఎస్‌ సర్కార్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బండి సంజయ్‌ జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా ఓ పక్క పాదయాత్ర నిర్వహిస్తూనే మరోపక్క సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక ఐదో విడత పాదయాత్రలో ప్రజా సమస్యలపై ప్రభుత్వంపై పోరాటం చేయడంతోపాటు, యాత్ర ముగిసేసరికి ఉత్తర తెలంగాణ జిల్లాల ముఖ్య నేతలతో సమీక్షలు పూర్తిచేసి ఎన్నికలకు సమాయత్తం చేయాలని బండి సంజయ్‌ ప్లాన్‌ చేశారు. ఈ మేరకు ఆయన నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.

ఆరోవిడతకు రూట్‌ రెడీ..
ఇదిలా ఉంటే ఐదో విడత పాదయాత్ర ముగిసిన నాలుగు రోజుల తర్వాత ఆరో విడత పాదయాత్రను కూడా చేయాలని రూట్‌ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నారు బీజేపీ నాయకులు. మొత్తానికి ప్రజాక్షేత్రంలో ఉంటూ వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీని గట్టి దెబ్బ కొట్టాలని బీజేపీ నాయకులు చేస్తున్న ప్రయత్నం తో తెలంగాణ రాష్ట్రంలో పొలిటికల్‌ హీట్‌ పెరుగుతోంది. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ, టీఆర్‌ఎస్‌ వేస్తున్న ఎత్తుగడలు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలపై చర్చకు కారణమవుతున్నాయి.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular